
1.8 లక్షలకు పైగా కొత్త యూనిట్లు
పెండింగ్ దరఖాస్తుల క్లియరెన్స్ వేగిరం
పౌరసరఫరాల శాఖ అధికారుల కసరత్తు
సాక్షి, హైదరాబాద్: తెల్లరేషన్ (ఆహార భద్రత) కార్డుల్లో కొత్త యూనిట్లకు కోటా కేటాయించేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. మే నెలలో కొన్ని కొత్త యూనిట్లకు బియ్యం కోటా విడుదల చేయగా.. తాజాగా మరికొన్ని యూనిట్లకు జూన్ కోటా కేటాయించి విడుదల చేయాలని నిర్ణయించింది. ఎనిమిదేళ్ల నిరీక్షణ అనంతరం కొత్త యూనిట్లకు ఆమోదం లభించిన విషయం విదితమే.
అయితే.. రేషన్ కార్డు లబ్ధి కుటుంబాల్లో కొత్తగా సభ్యులుగా చేరిన ఏడేళ్ల వయసు దాటిన వారికి మాత్రమే రేషన్ కోటా కేటాయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతున్నా.. పౌరసరఫరాల శాఖ అధికారులు మాత్రం వయసుతో నిమిత్తం లేకుండా కార్డుల్లోని ప్రతి యూనిట్‌కు బియ్యం కోటా విడుదల ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
60 శాతం కొత్త సభ్యులకు ఆమోదం..
గ్రేటర్ పరిధిలో ఇప్పటి వరకు 60 శాతం కొత్త సభ్యులకు ఆమోదం లభించినట్లు పౌరసరఫరాల శాఖ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిరిగి జిల్లాల పౌరసరఫరాల పరిధిలో సుమారు మూడు లక్షల లబ్ధి కుటుంబాలు కొత్త సభ్యుల చేర్పుల కోసం దరఖాస్తులు చేసుకున్నాయి. ఇప్పటి వరకు సుమారు సగానికి పైగా ఆమోదం లభించినట్లు తెలుస్తోంది.
మిగిలిన దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పౌరసరఫరాల అధికారులు మాత్రం పాతరేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల ఆమోదం ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొంటున్నారు. మీ సేవ కేంద్రాల్లో ఆన్‌లైన్ ద్వారా వచి్చన ప్రతి పెండింగ్ దరఖాస్తునూ పరిశీలించి అర్హులై సభ్యుల పేర్లను ఆమోదిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు.