అమెరికాను సైతం తాకేలా క్షిపణులను ఆసియా దేశం పాకిస్థాన్ రహస్యంగా తయారు చేస్తోందని ఆ మధ్య అతి ప్రచారం నడిచింది. అలాగే.. పాక్ అణ్వాయుధాలపై భారత్ కొన్నేళ్లుగా ఆందోళనలు వ్యక్తంచేస్తోంది. అయితే.. పాక్ పన్నాగాల్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముందే పసిగట్టారా?.. ఈ విషయంలో ఆయన అగ్రరాజ్యం అమెరికాను ముందే అప్రమత్తం చేశారా?..
రెండు దశాబ్దాల కింద.. 2001లో స్లోవేనియాలో జరిగిన ఓ సమావేశానికి పుతిన్, నాటి అమెరికా అధ్యక్షుడు బుష్ హాజరయ్యారు. ఆనాడు వాళ్ల మధ్య జరిగిన సంభాషణను అమెరికాకు చెందిన నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్స్ (2001-2008) బయటపెట్టింది. తమ మధ్య మాటల్లో.. నాటి పర్వేజ్ ముషారఫ్ నేతృత్వంలోని పాక్ అణు కార్యక్రమాన్ని నాడు వారిద్దరు తీవ్ర సమస్యగా పరిగణించినట్లు ఆ పత్రాలను బట్టి స్పష్టమవుతోంది.
‘‘అది అణ్వాయుధాలు కలిగిన సైనిక కూటమి. అక్కడ ప్రజాస్వామ్యం లేదు. మిలిటరీ పాలనలో ఉంది. కానీ పాశ్చాత్య దేశాలు(వెస్ట్రన్ కంట్రీస్) దానిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదు. దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది’’ అని రష్యా అధ్యక్షుడు బుష్ వద్ద ఆక్షేపించారు. పాక్ పట్ల ఉదాసీనంగా వ్యవహరించడంపై పలు అనుమానాలు లేవనెత్తారు. అయితే.. ఈ వ్యాఖ్యలతో బుష్ విభేదించలేదని తెలుస్తోంది. కానీ, పాక్ అక్రమ అణు వ్యాపారంపై అమెరికా అధ్యక్షుడు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ఉల్లంఘన కలవరపెట్టేదే’’ అని పుతిన్ మాటలను బుష్ అంగీకరించారు.
ఇలా.. పాక్ అణ్వాయుధాల అంశంపై వీరు సమగ్రంగా చర్చించారు. అంతేకాదు అణు కార్యక్రమాల నిబంధనలను ఉల్లంఘించిట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశాల విషయంలో వ్యవహరించినట్లుగా.. పాకిస్థాన్‌పై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని నాడు పుతిన్ (Putin) పశ్నించినట్లు ఆ పత్రాల ద్వారా బయటకు వచ్చింది.
అయితే.. పాక్ అణుపితామహుడు అబ్దుల్ ఖాదిర్ ఖాన్ కార్యకలాపాలు బయటపడిన తర్వాత ఆ దేశంపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చామని నాడు బుష్ వెల్లడించారు. అలాగే ఖాన్‌తో పాటు అతడి అనుచరులను నిర్బంధించేలా చేశామన్నారు. కానీ.. ఈ అణు పదార్థాలు పాక్ (Pakistan) నుంచి ఎవరికి చేరాయనే దానిపై మాత్రం స్పష్టత లేదని ఆ సందర్భంలో బుష్ తెలిపారు.
ప్రజాస్వామ్య జవాబుదారీతనం లేని ప్రభుత్వాల చేతుల్లో అణ్వాయుధాలు అధికంగా ఉన్నాయని పుతిన్ పదేపదే లేవనెత్తగా.. ఆ సున్నితమైన పరిజ్ఞానం మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించాల్సిన అవసరం ఉందని బుష్ సమర్థించినట్లు వెల్లడైంది.
అలాగే.. ఇరాన్ అణు కార్యక్రమంలో పాక్ యురేనియాన్ని గుర్తించామని 2005లో జరిగిన మరో భేటీలో బుష్ వద్ద పుతిన్ ప్రస్తావించినట్లు ఇవే పత్రాలు బయటపెట్టాయి.
అయితే.. పాక్ అణ్వాయుధాలతో ప్రధానంగా భారత్‌కే ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. అసలు ఆ అణ్వాయుధాలను భారత్‌ను ఎదుర్కోవడానికే పాక్ అభివృద్ధి చేసిందని(ఇంకా చేస్తోందనే) అని కూడా అంటున్నారు. భారత్ అణ్వాయుధాల విషయంలో “No First Use” (మొదట ప్రయోగించొద్దు) అనే స్పష్టమైన అణు విధానం పాటిస్తోంది. కానీ పాక్ వద్ద అలాంటి పద్ధతులేం లేవు. పైగా భారత్ సాంప్రదాయ సైనిక శక్తిని సమతుల్యం చేసుకోవడానికే పాక్ చాలా కాలంగా పాకులాడుతూ వస్తోంది.
2025 నాటికి పాకిస్తాన్ వద్ద సుమారు 170 అణ్వాయుధాలు ఉన్నాయని ఒక అంచనా. రానున్న ఐదేళ్లలో ఆ సంఖ్య 200కి చేరుకునే అవకాశం లేకపోలేదు. అయితే.. పాక్ అణ్వాయుధాలనేవి యావత్ ప్రపంచానికి ఒక ఆందోళనకర అంశమే. ఎందుకంటే.. పాక్‌లో కొనసాగే రాజకీయ అస్థిరత.. సైనికాధిపత్యం, ఉగ్రవాద సంస్థలు వాటిని చేజిక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉండడం, వీటికి తోడు గతంలో అణు సాంకేతికత లీక్ కావడం లాంటివి విశ్లేషకులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.


