నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో.. బంగ్లాదేశ్ శాంతిభద్రతలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ మైనారిటీలే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. దీపూ చంద్ర దాస్ ఉదంతం మరవకముందే మరో హిందూ వ్యక్తిని గ్రామస్థులు కొట్టి చంపిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే.. ఈ పరిణామాలపై సినీ ప్రముఖులు స్పందించడం మొదలుపెట్టారు.
గాజాలో జరిగిన పరిణామాలను అయ్యో.. పాపం అనుకున్న భారతీయులు, పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా మౌనం వీడాలంటూ సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న మూక దాడులను.. హత్యలను సినీ ప్రముఖులు ఖండిస్తున్నారు. దీపు దాస్ ఉదంతానని ఘోరమని.. అమానవీయమని పేర్కొంటున్నారు. హిందువులు ఇకనైనా మేల్కొనాలంటూ పిలుపు ఇస్తున్నారు.
యువ నటి జాన్వీ కపూర్ తన సోషల్ మీడియాలో స్పందిస్తూ.. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఘటనలు అమానుషమైనవి.. క్రూరమైనవి. ఇలాంటి ఘటనల పునరావృతం కావడం దారుణం. దీపు చంద్ర దాస్‌ను ప్రజల మధ్యలోనే అమానుషంగా లించ్ చేసిన ఘటన గురించి చదవాలని, వీడియోలు చూడాలని, ఘటనపై నిలదీయాలి. మనం ప్రపంచంలో ఎక్కడో జరిగే విషయాలపై కన్నీళ్లు కారుస్తూ, మన సొంత సోదరులు, సోదరీమణులు ఇక్కడే కాల్చి చంపబడుతున్నప్పుడు మౌనం వహించడం ప్రమాదకరమని అన్నారు. ఇంతటి దారుణం జరిగినప్పటికీ మనలో ఆగ్రహం రాకపోతే.. అదే ద్వంద్వ వైఖరి (hypocrisy) మనల్ని నాశనం చేస్తుందని హెచ్చరించారు.

సీనియర నటి కాజల్ అగర్వాల్ మొన్నీమధ్యే ఈ పరిణామాలపై ఓ పోస్ట్ చేశారు. ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్ అంటూ పోస్టర్ సోషల్ మీడియాలో ఉంచారు. అక్కడి మత అతివాదం వల్ల హిందువులు భయాందోళనలో బతుకుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులారా ఇకనైనా మేల్కొండి.. మౌనం మిమ్మల్ని రక్షించదు అంటూ పిలుపు ఇచ్చారామె.

సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద సైతం ఈ ఘటనలపై స్పందించారు. జరుగుతున్న పరిణామాలతో తన హృదయం ద్రవీంచిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారామె. భావోద్వేగాల్ని నియంత్రించుకుని తాను మాట్లాడుతున్నానని.. మూకహత్యలు హిందు మతంపై జరుగుతున్న దాడేనని.. అందుకే మౌనంగా ఉండలేక ప్రశ్నిస్తున్నానని ఓ వీడియో మెసేజ్‌లో అన్నారామె.
హెరా ఫెరీ నటుడు మనోజ్ జోషి.. గాజా, పాలస్తీనా కోసం ప్రతీ ఒక్కరూ ముందుకు వచ్చారని, అలాంటిది పక్క దేశంలో అదీ హిందువులపై దాడులు జరుగుతుంటే ఎవరూ సోసల్ మీడియాలోనైనా ముందుకు రారా? అని ప్రశ్నించారు. ఇది చాలా దురదృష్టకరమని.. దీనికి కాలమే సమాధానం చెబుతుందని అన్నారాయన.
సింగర్ టోనీ కక్కర్ తన కొత్త ఆల్బమ్ చార్ లోగ్(ఆ నలుగురు)లో.. దీపు దాస్ హత్యోదంతాన్ని ప్రస్తావించాడు. మనుషులు ఇకనైనా మత వివక్షను విడిచిపెట్టాలని, మానవత్వాన్ని కాపాడాలని పిలుపునిచ్చాడు.
ఇటీవల మయమన్‌సింగ్ జిల్లాలో దీపూ చంద్ర దాస్ అనే యువకుడు మూక దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మత వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలతో.. కొందరు అతనిపై దాడి చేసి హత్య చేసి.. అనంతరం నగ్నంగా చెట్టకు వేలాడదీసి కాల్చేశారు. ఆపై సగం కాలిన ఆ మృతదేహాన్ని రోడ్డు మీద పడేసి పోయారు. ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో యూనస్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇది మరువక ముందే..
బుధవారం రాత్రి రాజ్‌బర్ జిల్లా పంగ్షా సర్కిల్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. అమృత్ మొండల్ (29) అలియాస్ సామ్రాట్ అనే హిందూ యువకుడిని గ్రామస్తులు కొట్టి చంపారు. అయితే ఇది మత కోణంలో జరిగిన దారుణం కాదని.. అతనొక గ్యాంగ్‌స్టర్ అని, డబ్బు వసూళ్లకు పాల్పడడంతో గ్రామస్థులు అతడిపై దాడికి పాల్పడినట్లు స్థానిక పోలీసులు చెబుతున్నారు. అయితే.. దీపూ చంద్రదాస్‌పై దాడి తర్వాత ఓ మైనారిటీ వ్యక్తిపై మూకదాడి జరగడం ఈ ఘటనపై అనుమానాలకు తావిస్తోంది.


