అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ రిలీజ్ చేసిన తాజా నివేదికపై చైనా తీవ్రంగా స్పందించింది. భారత్‌తో సరిహద్దు ఉద్రిక్తతలు శాంతియుతంగానే ఉన్నాయని.. అయితే పాత పరిస్థితులను ప్రస్తావిస్తూ భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలకు అమెరికా ప్రయత్నిస్తోందని మండిపడింది.
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియన్ మాట్లాడుతూ.. ఈ నివేదిక చైనా రక్షణ విధానాన్ని వక్రీకరిస్తోంది. భారత్ సహా పొరుగు దేశాల మధ్య విభేదాలు సృష్టిస్తోంది. తన సైనిక ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నమే ఇది అని అన్నారు. భారత్ సంబంధాలను చైనా వ్యూహాత్మక స్థాయిలో, దీర్ఘకాల దృష్టితో చూస్తోంది. పరస్పర విశ్వాసం పెంపు, సహకారం, విభేదాల పరిష్కారం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను స్థిరంగా ఉంచాలని కోరుకుంటోంది అని అన్నారు. అయితే..
లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) పై US నివేదికలో చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. ప్రస్తుతం సరిహద్దు పరిస్థితి స్థిరంగా ఉందని, కమ్యూనికేషన్ చానెల్స్ సజావుగా పనిచేస్తున్నాయని తెలిపారు. మరోవైపు..
చైనా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఈ నివేదికను ఖండిస్తూ.. ఇది తప్పుడు కథనాలు, పక్షపాతాలతో కూడిందని, చైనా మిలిటరీ ముప్పు అనే అతిశయోక్తితో నిండిపోయి ఉందని విమర్శించింది. మొత్తంగా చైనా అగ్రరాజ్య నివేదికను అసంబద్ధమైనదని.. బాధ్యతారహితమైనదని పేర్కొంది.
భారత అమెరికా సంబంధాలను నీరుగార్చేందుకు చైనా కృషి చేస్తోందని.. సరిహద్దు ఉద్రిక్తతలు సడలింపును ఎరగా వేసి భారత్‌తో సత్సంబంధాలను పునరుద్ధరించకోజూస్తున్న డ్రాగన్ కంట్రీ అదే సమయంలో పాకిస్థాన్‌తోనూ మైత్రిని నెరపుతోందని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ నివేదిక వెలువరించింది. దీంతో చైనా పైవిధంగా స్పందించింది.


