ఐటీ శాఖ కార్యదర్శి కృష్ణన్
న్యూఢిల్లీ: పాశ్చాత్య దేశాలతో పోలిస్తే కృత్రిమ మేధతో (ఏఐ) భారత్‌లో వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు తక్కువేనని కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ చెప్పారు. మొత్తం ఉద్యోగుల్లో వైట్ కాలర్ సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటం ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ఆఫీసు ఉద్యోగాలు ఎక్కువగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) ఆధారిత విభాగాల్లోనే ఉంటున్నాయని తెలిపారు. ఉద్యోగులను పూర్తిగా తప్పించేసి, వారి స్థానాన్ని భర్తీ చేసే పరిస్థితి తలెత్తడం కన్నా, సిబ్బంది ఉత్పాదకత పెంపునకు ఏఐ ఉపయోగపడుతుందని వివరించారు.
ఏఐ కొన్ని సందర్భాల్లో డేటాను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయి, తప్పుగా ఇస్తున్న వివరాలను సరిచేసేందుకు ఇప్పటికీ మానవ ప్రమేయం అవసరం ఉంటోందని ఆయన చెప్పారు. ఏఐతో నిర్దిష్ట రంగాలు, అవసరాలకు తగ్గ సొల్యూషన్స్‌ని రూపొందించేందుకు అత్యుత్తమ నైపుణ్యాలున్న ఉద్యోగులు కావాల్సి ఉంటుందని కృష్ణన్ చెప్పారు. ఇలాంటి ఏఐ ఆధారిత ఉద్యోగావకాశాలను భారత్ అందిపుచ్చుకోవచ్చని వివరించారు. దేశీయంగా ఉద్యోగాల కల్పన, ఆర్థిక ప్రగతి సాధన కోసం కృత్రిమ మేధని ఉపయోగించుకోవడంతో పాటు ప్రపంచానికి కూడా ప్రయోజనం చేకూర్చగలిగే పటిష్టమైన స్థితిలో భారత్ ఉందని చెప్పారు.


