
విద్యార్థి, పర్యాటక, హెచ్–1బీ వీసా అభ్యర్థుల నుంచి 250 డాలర్ల సెక్యూరిటీ ఫీజు వసూలు
వాషింగ్టన్: వచ్చే ఏడాది నుంచి అమెరికా వీసా పొందాలని భావించే భారతీయులకు మరింత ఆర్థికభారం నెత్తిన పడనుంది. 250 డాలర్లు అంటూ దాదాపు రూ.21,000లను సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థి(ఎఫ్/ఎం) వీసాలతోపాటు పర్యాటక(బీ–1), ఉద్యోగ(హెచ్–1బీ), బిజినెస్(బీ–2), ఎక్సే్ఛంజ్(జే) వీసాల కోసం దరఖాస్తుచేసుకునే విదేశీయులు తప్పనిసరిగా ఈ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సిందేనని ట్రంప్ సర్కార్ ప్రకటించింది.
ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘ ది వన్ బిగ్ బ్యూటిఫుల్’ చట్టం నిబంధనల్లో ఈ మేరకు మార్పులు చేశారు. ఈ ఫీజును వీసా మంజూరు చేసేటప్పుడు హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం వసూలుచేస్తుంది. వీసా పొందాక ఆయా వీసాదారులు సంబంధిత కఠిన నిబంధనావళిని ఖచ్చితంగా పాటించినట్లు ప్రభుత్వం భావిస్తే ఈ ఫీజును తిరిగి ఇచ్చేస్తారు.
2026 ఏడాదికి మాత్రమే ఫీజును 250గా నిర్ణయించారు. ఆ తర్వాతి ఏడాది ద్రవ్యోల్బణం, వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ)లకు అనుగుణంగా ఫీజును పెంచుతారు. అన్ని కేటగిరీ వీసా దరఖాస్తుదారుల నుంచి వసూలుచేస్తున్నందున దీనిని ‘వీసా ఇంటిగ్రిటీ ఫీజు’గా పేర్కొంటున్నారు. ఏ, జీ రకం దౌత్య వీసా కేటగిరీలకు మాత్రం ఈ అదనపు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సిన పనిలేదు.
ఇతర ఫీజులూ వడ్డింపు
ఐ–94 దరఖాస్తుకు 24 డాలర్లు, 90 రోజుల్లోపు అమెరికాలో ఉండే పర్యాటకులు, వ్యాపారులకు ఇచ్చే ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్(ఈఎస్‌టీఏ)కు 13 డాలర్లు వసూలుచేయనున్నారు. ఇక చైనీయులకు ఇచ్చే పర్యాటక, బిజినెస్ వీసాలపై మరో 30 డాలర్ల ఫీజు వసూలుచేస్తారు. శరణార్థులుగా వచ్చే వాళ్లు దరఖాస్తుతోపాటు 1,000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
శరణార్థులుగా వచ్చి అమెరికాలో తాత్కాలిక చిన్న ఉద్యోగాలు చేసుకోవాలనుకునే వాళ్లు అదనంగా 500 డాలర్లు చెల్లించాలి. చట్టప్రకారం శాశ్వత స్థిర నివాస హోదా దరఖాస్తుతోపాటు మరో 1,500 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. తమ వీసా పొందాలనుకునే విదేశీ పౌరులు అమెరికా ఇమిగ్రేషన్ చట్టనిబంధనలను పాటించాల్సిందేనని వన్ బిగ్ బ్యూటిఫుల్ చట్టంలో ట్రంప్ ప్రభుత్వం స్పష్టంచేసింది.
ప్రస్తుతమున్న అమెరికా వీసా ఫీజుల విధానం ప్రకారం ఒక భారతీయుడు పర్యాటక(బీ–1) లేదా బిజినెస్(బీ–2) వీసా పొందాలంటే ఖచ్చితంగా 185 డాలర్లు చెల్లించాల్సి వచ్చేది. ఇకపై కొత్త నిబంధనల ప్రకారం ఈ 185 డాలర్లతోపాటు సెక్యూరిటీ ఫీజు(250 డాలర్లు), ఐ–94ఫీజు(24 డాలర్లు), ఈఎస్‌టీఏ ఫీజు(13 డాలర్లు) కలిపి మొత్తంగా 472 డాలర్లు(దాదాపు రూ.41వేలు) చెల్లించాల్సి ఉంటుంది.
అంటే వాస్తవ ఫీజు కంటే ఇది రెండున్నర రెట్లు ఎక్కువ అని అమెరికాలోని ప్రైవేట్ ఇమిగ్రేషన్ సేవల సంస్థ ఫ్రాగోమెన్ పేర్కొంది. అఫ్గానిస్తాన్, సిరియా వంటి పేద దేశాల నుంచి వలసలను అడ్డుకునే దురుద్దేశంతో ట్రంప్ ప్రభుత్వం ఇలా శరణార్థులు సైతం ఏకంగా 1,000 డాలర్ల సెక్యూరిటీ డిపాజిట్ ఫీజును చెల్లించాలనే కఠిన నిబంధనను చేర్చిందని అమెరికాలోని వలసదారుల హక్కుల సంస్థ ‘నేషనల్ ఇమిగ్రేషన్ ఫోరమ్’ ఆగ్రహం వ్యక్తంచేసింది. అక్రమ వలసదారులను తగ్గిస్తున్నామంటూ ఆ వంకతో ప్రభుత్వం అన్ని రకాల కేటగిరీ వీసా దరఖాస్తుదారుల నుంచి అదనపు ఫీజులు వసూలుచేస్తోందని నేషనల్ ఇమిగ్రేషన్ ఫోరమ్ ఆరోపించింది.