breaking news
big beautiful bill
-
మనకు బ్యూటిఫుల్ కాదు!
అమెరికాను మరింత గొప్ప (బిగ్)గా, మరింత చూడచక్కగా (బ్యూటిఫుల్)గా తీర్చిదిద్దుతానంటూ ట్రంప్ తెచ్చిన ‘ది వన్ బిగ్, బ్యూటిఫుల్’చట్టం అక్కడి భారతీయులకు పెను సమస్యగా మారేలా ఉంది. వలస, వలసేతర వీసాల ద్వారా అమెరికాలో కాలుపెట్టిన మనవాళ్లకు ఈ చట్టం సమస్యల స్వాగతం పలకడం ఖాయంగా కన్పిస్తోంది. ముఖ్యంగా వేలాది భారతీయ అమెరికన్లకు వైద్య బీమా రక్షణ ఛత్రాన్ని ఈ చట్టం దూరం చేస్తోంది. శాశ్వత స్థిరనివాస హోదా అయిన గ్రీన్కార్డ్దారులకు కూడా ‘బ్యూటిఫుల్’కష్టాల నుంచి ఊరట దక్కడం లేదు. హెచ్–1బీ వీసాదారుతో పాటు విద్యార్థి వీసాలపై అమెరికాకు వచ్చిన భారతీయులకు కూడా కొత్త చట్టం సమస్యాత్మకంగా మారుతోంది. ఏకంగా 20 లక్షల మంది భారత అమెరికన్లు దీని దెబ్బకు ఆరోగ్య బీమా సౌకర్యం కోల్పోయారు. ఖజానాపై ఏకంగా 1.7 లక్షల కోట్ల డాలర్ల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కొత్త చట్టం తేవడం తెలిసిందే. ఉచితంగా, అన్యాయంగా వైద్య సేవలు, సాయం వాళ్లకు మాత్రమే కోతలు పెడతానని అమెరికా పౌరులకు ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థి వీసాపై అమెరికా వర్సిటీల్లో చదివే మనవాళ్లకు ఇన్నాళ్లూ కొనసాగిన వైద్య బీమా సదుపాయం ఎత్తేశారు. అది లేకపోతే అమెరికాలో వైద్య ఖర్చులకు చుక్కలు కనిపిస్తాయి. తమకిది పెను ఆర్థిక భారమేనని న్యూజెర్సీలోని రూత్జర్స్ విశ్వవిద్యాలయానికి చెందిన భారత విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘కాలేజీలో ఎలాగోలా నెట్టుకొస్తాం. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక మా పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడుతుంది. ఆ వెంటనే ఉద్యోగం రాకుండా మరిన్ని ఇక్కట్లు తప్పవు’’అంటూ వాపోయారు. శరణార్థులకు అరిగోస! శరణార్థులుగా అమెరికాకు వచ్చిన వారిలో అత్యధికులు మెడిక్ఎయిడ్, ఎమర్జెన్సీ హెల్త్‌కేర్ ప్రోగ్రాంతోనే లబ్ధి పొందుతున్నారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) గణాంకాల ప్రకారం 2020లో 6,000 మంది భారతీయులు శరణార్థి హోదా పొందారు. 2023లో ఆ సంఖ్య 8 రెట్లు పెరిగి 51,000కు చేరింది. దాంతో శరణార్థుల్లో కొందరికే మెడిక్ఎయిడ్ను పరిమితం చేయాలని ‘బ్యూటిఫుల్’చట్టంలో పేర్కొన్నారు. మిగతా వారంతా వైద్య బీమాకు దూరం కానున్నారు. కనీసం 80,000 మంది భారత శరణార్థులకు బీమా సౌకర్యం దూరమవుతుందని చెబుతున్నారు. విద్యార్థులనూ కలుపుకుంటే కనీసం లక్ష మందికి పైగా భారతీయులు బీమాకు దూరమవుతున్నారు. బరాక్ ఒబామా హయాంలో గ్రీన్కార్డ్దారులు, శరణార్థులు, గృహహింస బాధితులు, హెచ్–1బీ వీసాదారులు, ఎఫ్–1 వీసా ఉన్న విద్యార్థులు ‘ఒబామాకేర్’పథకంలో భాగంగా వైద్య బీమా పొందేవాళ్లు. దీనికింద కుటుంబాలు, చిన్న వ్యాపారులకూ బీమా అందేది. వారికీ రెడ్ అలర్టే! గ్రీన్ కార్డు కేవలం శాశ్వతస్థిర నివాస హామీ మాత్రమే. అది లభించినంత మాత్రాన అమెరికా పౌరసత్వం ఇవ్వరు. ట్రంప్ సర్కారు సరిగ్గా ఇదే పాయింటు పట్టుకుంది. పౌరసత్వంలేని వాళ్లకు మెడిక్ఎయిడ్ తెగ్గోయాలని చట్టంలో పేర్కొంది. తద్వారా గ్రీన్కార్డ్దారుల్లో అత్యధికులకు వైద్య బీమా ఎత్తేస్తోంది. మిగతా వారి అర్హతను కూడా ప్రతి ఆర్నెల్లకోసారి సమీక్షిస్తారు. ఆ లెక్కన త్వరలో వారికీ బీమా ఎత్తేయడం ఖాయమంటున్నారు. ‘నేను న్యూజెర్సీలో ఓ ప్రముఖ టెక్ కంపెనీలో పనిచేస్తున్నా. నేను, నా భార్య కలిసి ఏటా 27,000 డాలర్లు పన్నుగా కడుతున్నాం. అయినా ట్రంప్ ప్రభుత్వం దృష్టిలో మేం తక్కువ పన్ను కడుతున్నట్టే లెక్క. నెలకు 450 డాలర్లున్న నా ఒక్కని నెలవారీ వైద్య బీమా ప్రీమియమే కొత్త చట్టంతో 1,200 డాలర్లకు పెరగనుంది’’అని సుహాస్ ప్రతాప్ అనే తెలుగు ఎన్నారై వాపోయారు. ఆయన హెచ్–1బీ వీసా మీద అమెరికాకు వచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా వీసా మరింత భారం
వాషింగ్టన్: వచ్చే ఏడాది నుంచి అమెరికా వీసా పొందాలని భావించే భారతీయులకు మరింత ఆర్థికభారం నెత్తిన పడనుంది. 250 డాలర్లు అంటూ దాదాపు రూ.21,000లను సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థి(ఎఫ్/ఎం) వీసాలతోపాటు పర్యాటక(బీ–1), ఉద్యోగ(హెచ్–1బీ), బిజినెస్(బీ–2), ఎక్సే్ఛంజ్(జే) వీసాల కోసం దరఖాస్తుచేసుకునే విదేశీయులు తప్పనిసరిగా ఈ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సిందేనని ట్రంప్ సర్కార్ ప్రకటించింది. ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘ ది వన్ బిగ్ బ్యూటిఫుల్’ చట్టం నిబంధనల్లో ఈ మేరకు మార్పులు చేశారు. ఈ ఫీజును వీసా మంజూరు చేసేటప్పుడు హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం వసూలుచేస్తుంది. వీసా పొందాక ఆయా వీసాదారులు సంబంధిత కఠిన నిబంధనావళిని ఖచ్చితంగా పాటించినట్లు ప్రభుత్వం భావిస్తే ఈ ఫీజును తిరిగి ఇచ్చేస్తారు. 2026 ఏడాదికి మాత్రమే ఫీజును 250గా నిర్ణయించారు. ఆ తర్వాతి ఏడాది ద్రవ్యోల్బణం, వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ)లకు అనుగుణంగా ఫీజును పెంచుతారు. అన్ని కేటగిరీ వీసా దరఖాస్తుదారుల నుంచి వసూలుచేస్తున్నందున దీనిని ‘వీసా ఇంటిగ్రిటీ ఫీజు’గా పేర్కొంటున్నారు. ఏ, జీ రకం దౌత్య వీసా కేటగిరీలకు మాత్రం ఈ అదనపు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సిన పనిలేదు. ఇతర ఫీజులూ వడ్డింపు ఐ–94 దరఖాస్తుకు 24 డాలర్లు, 90 రోజుల్లోపు అమెరికాలో ఉండే పర్యాటకులు, వ్యాపారులకు ఇచ్చే ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్(ఈఎస్టీఏ)కు 13 డాలర్లు వసూలుచేయనున్నారు. ఇక చైనీయులకు ఇచ్చే పర్యాటక, బిజినెస్ వీసాలపై మరో 30 డాలర్ల ఫీజు వసూలుచేస్తారు. శరణార్థులుగా వచ్చే వాళ్లు దరఖాస్తుతోపాటు 1,000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. శరణార్థులుగా వచ్చి అమెరికాలో తాత్కాలిక చిన్న ఉద్యోగాలు చేసుకోవాలనుకునే వాళ్లు అదనంగా 500 డాలర్లు చెల్లించాలి. చట్టప్రకారం శాశ్వత స్థిర నివాస హోదా దరఖాస్తుతోపాటు మరో 1,500 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. తమ వీసా పొందాలనుకునే విదేశీ పౌరులు అమెరికా ఇమిగ్రేషన్ చట్టనిబంధనలను పాటించాల్సిందేనని వన్ బిగ్ బ్యూటిఫుల్ చట్టంలో ట్రంప్ ప్రభుత్వం స్పష్టంచేసింది. ప్రస్తుతమున్న అమెరికా వీసా ఫీజుల విధానం ప్రకారం ఒక భారతీయుడు పర్యాటక(బీ–1) లేదా బిజినెస్(బీ–2) వీసా పొందాలంటే ఖచ్చితంగా 185 డాలర్లు చెల్లించాల్సి వచ్చేది. ఇకపై కొత్త నిబంధనల ప్రకారం ఈ 185 డాలర్లతోపాటు సెక్యూరిటీ ఫీజు(250 డాలర్లు), ఐ–94ఫీజు(24 డాలర్లు), ఈఎస్టీఏ ఫీజు(13 డాలర్లు) కలిపి మొత్తంగా 472 డాలర్లు(దాదాపు రూ.41వేలు) చెల్లించాల్సి ఉంటుంది. అంటే వాస్తవ ఫీజు కంటే ఇది రెండున్నర రెట్లు ఎక్కువ అని అమెరికాలోని ప్రైవేట్ ఇమిగ్రేషన్ సేవల సంస్థ ఫ్రాగోమెన్ పేర్కొంది. అఫ్గానిస్తాన్, సిరియా వంటి పేద దేశాల నుంచి వలసలను అడ్డుకునే దురుద్దేశంతో ట్రంప్ ప్రభుత్వం ఇలా శరణార్థులు సైతం ఏకంగా 1,000 డాలర్ల సెక్యూరిటీ డిపాజిట్ ఫీజును చెల్లించాలనే కఠిన నిబంధనను చేర్చిందని అమెరికాలోని వలసదారుల హక్కుల సంస్థ ‘నేషనల్ ఇమిగ్రేషన్ ఫోరమ్’ ఆగ్రహం వ్యక్తంచేసింది. అక్రమ వలసదారులను తగ్గిస్తున్నామంటూ ఆ వంకతో ప్రభుత్వం అన్ని రకాల కేటగిరీ వీసా దరఖాస్తుదారుల నుంచి అదనపు ఫీజులు వసూలుచేస్తోందని నేషనల్ ఇమిగ్రేషన్ ఫోరమ్ ఆరోపించింది. -
అమల్లోకి ‘బిగ్ బ్యూటిఫుల్’ చట్టం
వాషింగ్టన్: పన్ను చెల్లింపుదారులపై ట్యాక్స్ భారం తగ్గించడం, వలసచట్టాల అమలుకు కావాల్సిన నిధులను సేకరించడం, రక్షణరంగ బడ్జెట్ పెంపు వంటి ఎన్నో లక్ష్యాలతో రూపొందించిన కీలక ‘వన్ బిగ్ బ్యూటిఫుల్’బిల్లు ఎట్టకేలకు అమెరికాలో చట్టంగా అమల్లోకి వచ్చింది. అమెరికా సెనేట్, ప్రతినిధుల సభలో సుదీర్ఘ చర్చలు, ఉత్క ంఠతో కూడిన ఓటింగ్‌ల నడుమ ఆమోదం పొందిన ఈ బిల్లుపై అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం ట్రంప్ శ్వేతసౌధంలో సంతకంచేశారు. రెండో దఫా అధ్యక్షుడయ్యాక రిపబ్లికన్ పార్టీపై తన పట్టు సడలలేదని తాజా బిల్లు ద్వారా ట్రంప్ నిరూపించుకున్నారు. మరో దశాబ్దకాలంలో అమెరికా ఆర్థికలోటును మరో 3.3 ట్రిలియన్ డాలర్లు పెంచేసే చట్టంగా అపవాదును మూటగట్టుకున్న దాదాపు 870 పేజీల ఈ కొత్త చట్టంలోని కొన్ని కీలక అంశాలపై క్లుప్తంగా.. 2017నాటి పన్నుల్లో కోత కొనసాగింపు ట్రంప్ తొలిదఫా అధ్యక్షునిగా ఎన్నికైనప్పుడు ప్రజలు చెల్లించాల్సి పన్ను రేటును తగ్గించారు. పరిశ్రమలకూ దీనిని వర్తింపజేశారు. ప్రభుత్వానికి తక్కువ పన్ను చెల్లించిన కారణంగా తమ వద్ద మిగిలిపోయిన సొమ్మును జనం ఖర్చుచేస్తారు. ఇలా వస్తుసేవల వినియోగం పెరిగి ఆర్థికాభివృద్ది ఊపందుకుంటుందని ట్రంప్ ఆశిస్తున్నారు. వైద్యసాయంపై భారీ కోత ఏ ప్రభుత్వమైనా కొత్త పథకం తెస్తే అందులో వైద్య ప్రయోజనాలు పెరుగుతాయి. కానీ ఈ బిల్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య ప్రయోజనాలకు గండికొడుతోంది. తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు/కుటుంబాలు/ వికలాంగులకు మెడికల్ ఎయిడ్ ప్రయోజనాలు దూరంకానున్నాయి. దీంతో మెడికల్ ఇన్సూరెన్స్ రక్షణలేక లక్షలాది మంది తమ సొంత డబ్బులను వైద్యం కోసం ఖర్చుచేయాల్సిఉంటుంది. ఎక్కువ గంటలు పనిచేసే వ్యక్తులకే అధిక మెడిక్ఎయిడ్ నిబంధనను చేర్చారు. ప్రస్తుతం అమెరికాలో 7.1 కోట్ల మంది ప్రభుత్వ వైద్య బీమా సదుపాయాన్ని పొందుతున్నారు. కొత్త చట్టం కారణంగా 1.7 కోట్ల మందికి ఈ సదుపాయం దూరమవుతుంది. పెన్షన్లు, గౌరవ భృతిపై పన్నుల తగ్గింపు రిటైర్డ్ ఉద్యోగులు, వికలాంగులు, ఇతర పెన్షనర్లపై విధించే సామాజిక భద్రతా ఆదాయ పన్నును తగ్గించారు. 65 ఏళ్లు పైబడిన వాళ్లకు అందే పెన్షన్, ఇతర ప్రయోజనాలపై మూలఆదాయం వద్ద కోతను 4,000 డాలర్లకు పరిమితం చేశారు. తగ్గనున్న ఫుడ్ కూపన్ల లబి్ధదారులు బైడెన్ హయాంలో అందించిన పునరుత్పాదక ఇంధన వనరుల ప్రోత్సాహక ప్రయోజనాలకు ప్రభుత్వం ఈ చట్టం ద్వారా కోతపెట్టింది. సౌర, పవన విద్యుత్ సంస్థలకు ఇచ్చే పన్ను ప్రయోజనాలను తగ్గించి ఆ మేరకు బొగ్గు, చమురు సంస్థలకు ప్రయోజనం కల్పించనున్నారు. కార్లు కొనేందుకు వాహనరుణం తీసుకుంటే అందుకు చెల్లించే వడ్డీని సైతం తగ్గించారు. తక్కువ ఆదాయవర్గాలకు అందించే ఫుడ్ కూపన్లు(టోకెన్లు) తగ్గించనున్నారు. ప్రస్తుతం 4 కోట్ల మంది ఈ ఫుడ్ టోకెన్లను ఉపయోగించుకుంటున్నారు. కొత్త చట్టం కారణంగా 47 లక్షల మంది ఆ అర్హతను కోల్పోతారు. భారీగా రక్షణ బడ్జెట్ రక్షణ బడ్జెట్‌ను మరో 150 బిలియన్ డాలర్లు పెంచనున్నారు. సరిహద్దు గోడనిర్మాణం, అక్రమంగా చొరబడిన విదేశీయుల కోసం మొత్తంగా 1,00,000 పడకలతో నిర్బంధ కేంద్రాలను నిర్మించనున్నారు. -
వైట్‌హౌస్‌లో సందడి.. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై ట్రంప్ సంతకం
వాషింగ్టన్: అమెరికాలో ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంతకం చేశారు. దీంతో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టంగా మారింది. వైట్‌హౌస్ వేదికగా రిపబ్లికన్ సభ్యులు, అధికారుల సంబురాల మధ్య ట్రంప్.. ఈ బిల్లుపై సంతకం పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ట్రంప్ మద్దతుదారులు, మిత్రపక్షాలు, మిలిటరీ కుటుంబాలు, వైట్‌హౌస్ సిబ్బంది తరలివచ్చారు.అనంతరం, వైట్‌హౌస్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. ఈ చట్టంతో అందరికీ లబ్ధి జరుగుతుంది. సాయుధ బలగాల నుంచి మొదలు రోజూవారీ కార్మికుల వరకు కొత్త చట్టం మద్దతుగా ఉంటుంది. అమెరికా చరిత్రలోనే మా ప్రభుత్వం అతిపెద్ద పన్నుకోత, వ్యయకోత, సరిహద్దు భద్రతలో అతిపెద్ద పెట్టుబడి సాధించిది. అమెరికా ప్రజలు ఇంత ఆనందంగా ఉండటం గతంలో నేను ఎప్పుడూ చూడలేదు. ఈ బిల్లు ఆమోద ప్రక్రియలో మద్దతుగా నిలిచిన ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్‌కు, సెనెట్ మెజారిటీ లీడర్ జాన్ థునెకు ధన్యవాదాలు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. SIGNED. SEALED. DELIVERED. 🧾🇺🇸President Trump’s One Big Beautiful Bill is now LAW — and the Golden Age has never felt better. pic.twitter.com/t0q2DbZLz5— The White House (@WhiteHouse) July 4, 2025ఇదిలా ఉండగా.. ప్రభుత్వ వ్యయాన్ని తీవ్రంగా తగ్గించడం, వలస చట్టాలను అమలు చేయడానికి కావాల్సిన కఠినమైన కొత్త విధానాలకు నిధులు సమకూర్చడం, పలు పన్ను కోతలను శాశ్వతం చేయడం వంటివి వన్ బిగ్ బ్యూటిఫుల్ చట్టంలో ఉన్నాయి. ఈ బిల్లుపై ఇటీవల సెనెట్‌లో సుదీర్ఘ చర్చ సాగింది. ముగ్గురు రిపబ్లికన్లు వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ 51-50 తేడాతో అక్కడ ఆమోదం లభించింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ టై బ్రేకర్‌గా మారి బిల్లును గట్టెక్కించారు. అనంతరం ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. సుదీర్ఘ చర్చ అనంతరం జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 218, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. ప్రతినిధుల సభలో బిల్లును ఇద్దరు రిపబ్లికన్లు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. 🚨 NOW: President Trump and our INCREDIBLE First Lady Melania share a kiss on the White House balcony as the crowd chants “FOUR MORE YEARS!”What an EPIC day for our country!And THE BEST IS YET TO COME! 🇺🇸💥 pic.twitter.com/XSmJ8S9Ud4— Nick Sortor (@nicksortor) July 5, 2025మరోవైపు.. వైట్‌హౌస్‌లో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై ట్రంప్ సంతకం చేస్తున్న సందర్భంగా అక్కడ అమెరికా స్టెల్త్ బాంబర్లు, ఫైటర్ జెట్లు గగనతలంలో చక్కర్లు కొట్టాయి. కాగా, ఇటీవల ఇరాన్ అణుకేంద్రాలపై ఇవి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆకాశంలో ఫైటర్ జెట్లు చక్కర్లు కొడుతుండగా వైట్‌హౌస్ నుంచి ట్రంప్ వీక్షించారు. This angle of the B-2 and F-35 flyover of the White House before Trump signs the One Big Beautiful Bill 🔥 pic.twitter.com/z5M8f4NVl4— johnny maga (@_johnnymaga) July 4, 2025ఇది కూడా చదవండి: వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు.. ఎన్నారైలకు అలర్ట్ -
ట్రంప్ మెగా బిల్లు: ఎన్నారైలకు బిగ్ అలర్ట్
ట్రంప్ కలల బిల్లు.. బిగ్ బ్యూటిఫుల్ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. గురువారం సుదీర్ఘ చర్చ అనంతరం జరిగిన ఓటింగులో బిల్లు ఆమోదం పొందింది. అంతకుముందు ఈ బిల్లుకు సెనెట్‌లో ఆమోదం లభించింది. ట్రంప్ సంతకం తర్వాతనీ ఈ బిల్లు చట్టంగా మారనుంది. అటు అమెరికా రాజకీయాల్లో, ఇటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అంశంగా నిపుణులు ఈ బిల్లును భావిస్తున్నారు. అయితే ఇది ఎన్నారైలపై ఎంతంగా ప్రభావం చూపించనుందో ఓ లుక్కేద్దాం.. నగదు బదిలీలపై 1% రెమిటెన్స్ పన్ను2026 జనవరి 1 నుంచి, అమెరికా నుంచి భారత్‌కు పంపే నగదు ఆధారిత బదిలీలపై 1% పన్ను విధించనున్నారు.నగదు, మనీ ఆర్డర్, చెక్కుల రూపేణా పంపేవాటికి ఇది వర్తిస్తుంది. మొదట ఇది 5%గా ప్రతిపాదించబడింది. తర్వాత 3.5%కి తగ్గించి చివరకు 1 శాతంగా నిర్ణయించారు. ఇది చిన్న మొత్తంగా అనిపించినా.. తరచూ డబ్బు పంపే కుటుంబాలకు ఇది లక్షల్లో అదనపు భారం కానుంది.అయితే డిజిటల్ మార్గాలు ఉపయోగించే వారు పన్ను నుంచి తప్పించుకోవచ్చు. అయితే.. భారత్‌లో గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే వయసు పైబడినవాళ్లు ఇంకా నగదు మార్గాన్నే నమ్ముకుంటున్నారనేది గుర్తించాల్సిన విషయం. ఉదాహరణకు.. నెలకు $500 పంపే వ్యక్తి.. ఏడాదికి $6,000 పంపుతాడు. బిగ్ బ్యూటీఫుల్ బిల్లు అమల్లోకి వస్తే.. $60 అదనపు పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇది చిన్న మొత్తంగా అనిపించినా.. గణనీయమైన భారంగానే మారనుంది.భారత్‌కు వచ్చే రెమిటెన్స్‌లో తగ్గుదలబిగ్ బ్యూటిఫుల్ బిల్ (Big Beautiful Bill) ద్వారా అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 1% రెమిటెన్స్ పన్ను ప్రభావం కేవలం ప్రవాస భారతీయులకే కాదు, భారత ఆర్థిక వ్యవస్థ మొత్తానికే గణనీయంగా ఉండనుంది. రెమిటెన్స్ (Remittance) అంటే ఒక వ్యక్తి విదేశంలో పని చేసి, అక్కడి నుంచీ తన స్వదేశంలోని కుటుంబానికి లేదా ఖాతాకు డబ్బు పంపడం.2023–24లో భారత్‌కు వచ్చిన మొత్తం రెమిటెన్స్ 135.46 బిలియన్ డాలర్లు. అందులో 32 బిలియన్ డాలర్లు అమెరికా నుంచే వచ్చింది. అయితే1% పన్ను విధానం వల్ల 10–15% తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉంది. అంటే.. 12–18 బిలియన్ డాలర్ల వరకు నష్టం జరగవచ్చు. రెమిటెన్స్‌లు భారతదేశానికి విదేశీ కరెన్సీ ప్రవాహంలో ప్రధాన భాగం. కాబట్టి ఈ తగ్గుదల వల్ల విదేశీ మారక నిల్వలపై ప్రభావం పడుతుంది. డాలర్ నిల్వలు తగ్గి, రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ద్రవ్యోల్బణం (inflation) పెరగడానికి దారితీయవచ్చు. అదే సమయంలో..రెమిటెన్స్‌లు అనేక కుటుంబాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ముఖ్యంగా కేరళ, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అనేక కుటుంబాలకు. అయితే.. డబ్బు తక్కువగా రావడం వల్ల విద్య, వైద్యం, పెళ్లిళ్లు, గృహ నిర్మాణం వంటి అవసరాలపై ప్రభావం పడుతుంది.ఇంకోవైపు.. బ్యాంకింగ్ వ్యవస్థపై ఇది ప్రభావం చూపించనుంది. రెమిటెన్స్ తగ్గితే బ్యాంకుల డిపాజిట్లు తగ్గుతాయి, ఇది వడ్డీ రేట్ల పెరుగుదలకు దారితీయవచ్చు.మరీ ముఖ్యంగా గ్రామీణ బ్యాంకింగ్ సేవలపై ప్రభావం ఉండే అవకాశం ఉంది. వలసలకు ఇక గడ్డు కాలమే?ఈ బిల్లుతో వలస నియంత్రణ మరింత కఠినతరం కాబోతోంది. వీసా ఫీజులు పెరిగాయి. H-1B, L-1 వీసాలతో పాటు ఆశ్రయం దరఖాస్తులకు(Asylum Applications) భారీ రుసుములు విధించబడ్డాయి. అక్రమంగా వచ్చినవారిపై ఓ రేంజ్లో జరిమానాలు విధించాలని నిర్ణయించారు. డిపోర్టేషన్ బలగాల విస్తరణ వంటి చర్యలు ప్రవేశపెట్టబడ్డాయి. అక్రమ వలసదారులను తనిఖీలు చేయడం.. అవసరమైతే అక్కడికక్కడే అరెస్టులు చేసే అవకాశాలు ఉంటాయి. ఇది అమెరికాలో ఉన్న ఎన్నారైలకు మాత్రమే కాదు.. అక్కడ చదువుతున్న విద్యార్థులకు, ఉద్యోగార్థుల్లో కూడా భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా.. అమెరికాలో శాశ్వత నివాసం అనే కలకు బిగ్ బ్యూటీఫుల్ బిల్ ఒక శరాఘాతంగా పరిణమించబోతోందనే చెప్పొచ్చు.పెట్టుబడి ప్రణాళికల్లో మలుపులు!కార్పొరేట్ సంస్థలు, పెద్ద స్థాయి పెట్టుబడిదారులకు ఈ బిల్లుతో పన్ను మినహాయింపులు ఉన్నా.. ఎన్నారైల వాస్తవ ప్రయోజనాలు మాత్రం పరిమితంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా పన్ను రీఫండ్లు U.S. పౌరులకు మాత్రమే వర్తించడంతో, ఎన్నారైల ఆసరా మరింత దెబ్బతినే అవకాశమే కనిపిస్తోంది.సాధారణంగా రియల్ ఎస్టేట్ అనేది ప్రవాస భారతీయులకు కేవలం పెట్టుబడి కాదు.. భారత్‌తో అనుబంధానికి ఆధారం కూడా. ఈ పన్ను వల్ల భారత్‌లో ఆస్తుల కొనుగోలు లేదా అమ్మకానికి సంబంధించిన పెద్ద మొత్తాల బదిలీలపై అదనపు ఖర్చు వస్తుంది. అలాంటి సందర్భంలో ఈ పన్ను వారి ఆర్థిక ప్రయోజనాలపై కాదు, భావోద్వేగాలపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.ఈ క్రమంలో.. దీర్ఘకాలికంగా ఆస్తులు కొనాలని భావించిన వారు, ఇప్పుడు పన్ను అమలుకు ముందు ముందుగా డబ్బు పంపించి కొనుగోలు పూర్తిచేయాలని చూస్తున్నారు. ఇది ఒక రకంగా బిల్లు అమలుకు ముందు ఆస్తి రద్దీ(Rush) అనే పరిస్థితిని తెచ్చింది. దీంతో పన్ను అమలుకు ముందు తాత్కాలికంగా బదిలీల పెరుగుదల జరిగే అవకాశం నిపుణులు అంచనా వేస్తున్నారు. రియల్ ఎస్టేట్‌తో పాటు విద్య, ఆరోగ్య ఖర్చులపై కూడా ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. కంప్లయన్స్ భారముఎన్నారైలు బిగ్ బ్యూటీఫుల్ బిల్లును క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నారైలు తమ ఆర్థిక ప్రణాళికలను మరింత జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరాన్ని తెచ్చి పెట్టింది. ఎటువంటి మార్గంలో డబ్బు పంపుతున్నారో జాగ్రత్తగా గమనించాలి. లేకపోతే అనవసర పన్నులు పడే అవకాశం ఉంది. కఠినమైన KYC నిబంధనలతో పాటు NRE/NRO ఖాతాలపై నియంత్రణ ఉంటుంది. తద్వారా పాస్‌పోర్ట్, వీసా, నివాస ధృవీకరణ వంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం పెరుగుతుంది. డబ్బు ఎలా అమెరికా దాటి పోతుంది అనే దానిపై మరింత పర్యవేక్షణ ఉంటుంది. పన్ను రీఫండ్లు కేవలం అమెరికా పౌరులకు మాత్రమే వర్తిస్తాయి — NRIs కు కాదు. అంటే, గ్రీన్ కార్డు హోల్డర్లు, H-1B వీసాదారులు, ఇతర ఎన్నారైలు ఈ ప్రయోజనాలను పొందలేరు.కాబట్టి ఈ బిల్లు ప్రవాస భారతీయులపై (NRIs) కేవలం పన్ను భారం మాత్రమే కాదు, నియంత్రణ (compliance) భారాన్ని కూడా పెంచుతోంది. ఇది పెద్ద మొత్తంలో డబ్బు పంపే వారికి మాత్రమే కాదు, చిన్న మొత్తాల్లో తరచూ పంపే వారికి కూడా అదనపు కాగితాలు, సమయం, ఖర్చు పెరుగుతాయి.ఎన్నారైలు డబ్బు పంపడాన్ని తగ్గిస్తే, భారత్‌లోని కుటుంబాల ఆదాయం తగ్గుతుంది. ఇది వారి వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలతో పాటు కుటుంబాలపై, చివరికి భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపేలా ఉంది. ఏంటీ బిగ్ బ్యూటీఫుల్ బిల్లు?అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఒక విస్తృత ఆర్థిక, పన్ను, వలస విధానాల చట్టం. పన్నుల్లో కోతలు, వ్యయ నియంత్రణే లక్ష్యంగా తెస్తున్నట్లు చెబుతున్నారాయన.పన్ను కోతలు2017లో అమలైన పన్ను కోతలను శాశ్వతం చేస్తుంది.కార్పొరేట్ కంపెనీలు, ఉన్నత ఆదాయ వర్గాలకు పన్ను మినహాయింపులు కల్పిస్తుంది.టిప్పులు, ఓవర్‌టైమ్‌పై పన్ను మినహాయింపుటిప్ ఆదాయం పై పన్ను రద్దు, ఓవర్‌టైమ్ ఆదాయంపై $12,500 వరకు మినహాయింపు.చైల్డ్ టాక్స్ క్రెడిట్ పెంపుపిల్లలపై టాక్స్ క్రెడిట్ $2,000 నుంచి $2,200కి పెంపు.కానీ తక్కువ ఆదాయ కుటుంబాలకు ఇది పూర్తిగా వర్తించదు.1% రెమిటెన్స్ పన్నుఅమెరికా నుంచి భారత్ వంటి దేశాలకు నగదు బదిలీలపై 1% పన్ను విధించబడుతుంది.బ్యాంక్, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా(డిజిటల్ లావాదేవీలు) పంపిన డబ్బుకు మినహాయింపు ఉంది.వలస నియంత్రణ కఠినతరంICE అధికారుల నియామకం, డిపోర్టేషన్ కేంద్రాల విస్తరణ, వీసా ఫీజుల పెంపు వంటి చర్యలు ఉన్నాయి.మెడికేడ్, ఫుడ్ స్టాంపులపై కోతలుతక్కువ ఆదాయ గల అమెరికన్లకు ఆరోగ్య, ఆహార సహాయ కార్యక్రమాల్లో కోతలు విధించబడ్డాయి.పునరుత్పాదక శక్తికి ఎదురుదెబ్బసౌర, గాలి శక్తి పథకాలపై పన్ను రాయితీలు తగ్గించబడ్డాయి, ఇది గ్రీన్ ఎనర్జీ రంగానికి నష్టంగా మారుతుంది.లాభాలు ఎవరికీ?కార్పొరేట్ కంపెనీలు, ఉన్నత ఆదాయ వర్గాలు, టిప్/ఓవర్‌టైమ్ వేతనదారులు లాభపడతారు. కానీ తక్కువ ఆదాయ గల కుటుంబాలు, వలసదారులు, పునరుత్పాదక శక్తి రంగం నష్టపోతాయి.ప్రతిపక్షాల అభ్యంతరాలుడెమొక్రాట్లు, సామాజిక కార్యకర్తలు ఈ బిల్లును "సంపన్నులకు లాభం, సామాన్యులకు నష్టం" అని విమర్శిస్తున్నారు. హకీం జెఫ్రీస్ అనే నేత 8 గంటల పాటు బిల్లుకు వ్యతిరేకంగా ప్రసంగించారు.