
తన కలల బిల్లుపై సంతకం చేసి చట్టంగా తీసుకొచ్చిన ట్రంప్
వాషింగ్టన్: పన్ను చెల్లింపుదారులపై ట్యాక్స్ భారం తగ్గించడం, వలసచట్టాల అమలుకు కావాల్సిన నిధులను సేకరించడం, రక్షణరంగ బడ్జెట్ పెంపు వంటి ఎన్నో లక్ష్యాలతో రూపొందించిన కీలక ‘వన్ బిగ్ బ్యూటిఫుల్’బిల్లు ఎట్టకేలకు అమెరికాలో చట్టంగా అమల్లోకి వచ్చింది. అమెరికా సెనేట్, ప్రతినిధుల సభలో సుదీర్ఘ చర్చలు, ఉత్క ంఠతో కూడిన ఓటింగ్‌ల నడుమ ఆమోదం పొందిన ఈ బిల్లుపై అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం ట్రంప్ శ్వేతసౌధంలో సంతకంచేశారు.
రెండో దఫా అధ్యక్షుడయ్యాక రిపబ్లికన్ పార్టీపై తన పట్టు సడలలేదని తాజా బిల్లు ద్వారా ట్రంప్ నిరూపించుకున్నారు. మరో దశాబ్దకాలంలో అమెరికా ఆర్థికలోటును మరో 3.3 ట్రిలియన్ డాలర్లు పెంచేసే చట్టంగా అపవాదును మూటగట్టుకున్న దాదాపు 870 పేజీల ఈ కొత్త చట్టంలోని కొన్ని కీలక అంశాలపై క్లుప్తంగా..
2017నాటి పన్నుల్లో కోత కొనసాగింపు
ట్రంప్ తొలిదఫా అధ్యక్షునిగా ఎన్నికైనప్పుడు ప్రజలు చెల్లించాల్సి పన్ను రేటును తగ్గించారు. పరిశ్రమలకూ దీనిని వర్తింపజేశారు. ప్రభుత్వానికి తక్కువ పన్ను చెల్లించిన కారణంగా తమ వద్ద మిగిలిపోయిన సొమ్మును జనం ఖర్చుచేస్తారు. ఇలా వస్తుసేవల వినియోగం పెరిగి ఆర్థికాభివృద్ది ఊపందుకుంటుందని ట్రంప్ ఆశిస్తున్నారు.
వైద్యసాయంపై భారీ కోత
ఏ ప్రభుత్వమైనా కొత్త పథకం తెస్తే అందులో వైద్య ప్రయోజనాలు పెరుగుతాయి. కానీ ఈ బిల్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య ప్రయోజనాలకు గండికొడుతోంది. తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు/కుటుంబాలు/ వికలాంగులకు మెడికల్ ఎయిడ్ ప్రయోజనాలు దూరంకానున్నాయి. దీంతో మెడికల్ ఇన్సూరెన్స్ రక్షణలేక లక్షలాది మంది తమ సొంత డబ్బులను వైద్యం కోసం ఖర్చుచేయాల్సిఉంటుంది. ఎక్కువ గంటలు పనిచేసే వ్యక్తులకే అధిక మెడిక్‌ఎయిడ్ నిబంధనను చేర్చారు. ప్రస్తుతం అమెరికాలో 7.1 కోట్ల మంది ప్రభుత్వ వైద్య బీమా సదుపాయాన్ని పొందుతున్నారు. కొత్త చట్టం కారణంగా 1.7 కోట్ల మందికి ఈ సదుపాయం దూరమవుతుంది.
పెన్షన్లు, గౌరవ భృతిపై పన్నుల తగ్గింపు
రిటైర్డ్ ఉద్యోగులు, వికలాంగులు, ఇతర పెన్షనర్లపై విధించే సామాజిక భద్రతా ఆదాయ పన్నును తగ్గించారు. 65 ఏళ్లు పైబడిన వాళ్లకు అందే పెన్షన్, ఇతర ప్రయోజనాలపై మూలఆదాయం వద్ద కోతను 4,000 డాలర్లకు పరిమితం చేశారు.
తగ్గనున్న ఫుడ్ కూపన్ల లబి్ధదారులు
బైడెన్ హయాంలో అందించిన పునరుత్పాదక ఇంధన వనరుల ప్రోత్సాహక ప్రయోజనాలకు ప్రభుత్వం ఈ చట్టం ద్వారా కోతపెట్టింది. సౌర, పవన విద్యుత్ సంస్థలకు ఇచ్చే పన్ను ప్రయోజనాలను తగ్గించి ఆ మేరకు బొగ్గు, చమురు సంస్థలకు ప్రయోజనం కల్పించనున్నారు. కార్లు కొనేందుకు వాహనరుణం తీసుకుంటే అందుకు చెల్లించే వడ్డీని సైతం తగ్గించారు. తక్కువ ఆదాయవర్గాలకు అందించే ఫుడ్ కూపన్లు(టోకెన్లు) తగ్గించనున్నారు. ప్రస్తుతం 4 కోట్ల మంది ఈ ఫుడ్ టోకెన్లను ఉపయోగించుకుంటున్నారు. కొత్త చట్టం కారణంగా 47 లక్షల మంది ఆ అర్హతను కోల్పోతారు.
భారీగా రక్షణ బడ్జెట్
రక్షణ బడ్జెట్‌ను మరో 150 బిలియన్ డాలర్లు పెంచనున్నారు. సరిహద్దు గోడనిర్మాణం, అక్రమంగా చొరబడిన విదేశీయుల కోసం మొత్తంగా 1,00,000 పడకలతో నిర్బంధ కేంద్రాలను నిర్మించనున్నారు.