ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు ఆ దేశ ప్రభుత్వం ఉన్నత పదవిని కట్టబెట్టింది. పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF)గా ఆసిమ్ మునీర్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాక్ అధ్యక్ష కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో, ఆసిమ్ మునీర్‌కు మరిన్ని అధికారులు లభించే అవకాశం ఉంది.
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ ఆర్మీని బలోపేతం చేసే దిశగా పాకిస్తాన్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే పాక్.. తమ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలను ఏకీకృతం చేసేందుకు సీడీఎఫ్ పదవిని సృష్టించింది. ఇందుకు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం 27వ రాజ్యాంగ సవరణ చేసింది. మరోవైపు.. పాక్ ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన మునీర్ పదవీ కాలం గత నెల 29తో ముగిసింది. దీంతో, సీడీఎఫ్ పదవిని ఆసిమ్ మునీర్‌కు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది.
ఈ నేపథ్యంలో ఐదేళ్ల కాలానికి ఏక కాలంలో సైనిక దళాల చీఫ్‌గా వ్యవహరించేందుకు సీడీఎఫ్ పదవికి ఆసిమ్ మునీర్‌ను నియమించాలని పాక్ ప్రధాని సమర్పించిన సిఫార్సును అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఆమోదించారు. ఈ మేరకు పాక్ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ఈ నియామకంతో పాక్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా మునీర్ నిలవనున్నారు. న్యాయపరమైన విషయాల్లో అధ్యక్షుడితో సమానంగా రక్షణ పొందనున్నారు. ఆయన్ను ప్రాసిక్యూట్ చేసే అవకాశం కూడా ఉండదు. ఐదేళ్ల పాటు ఈ పదవిలో మునీర్ కొనసాగనున్నారు.
మునీర్‌కు స్పెషల్ హోదా..
ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన మునీర్ ఈ ఏడాదే అరుదైన ఫీల్డ్ మార్షల్ హోదాను పొందారు. ఇది అత్యున్నత సైనిక హోదా. పాక్ చరిత్రలో ఇంతకుముందు జనరల్ అయూబ్ ఖాన్‌కు మాత్రమే ఫీల్డ్ మార్షల్ హోదా లభించింది. తాజాగా ఇప్పుడు సీడీఎఫ్ అయ్యారు. దీంతో, పాకిస్తాన్ పలు కీలక పదవుల్లో ఉన్న వ్యక్తిగా మునీర్ రికార్డులోకి ఎక్కారు. అయితే, సీడీఎఫ్‌గా ఆసిమ్ మునీర్‌ను ప్రకటించడానికి ముందు పలు ఊహాగానాలు వచ్చాయి. ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ కావాలనే ఈ నియామకాన్ని ఆలస్యం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రభుత్వం, సైన్యం మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు పలు ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ, ఎట్టకేలకు పాక్ ప్రభుత్వం సీడీఎఫ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.


