వైట్‌హౌస్‌లో సందడి.. వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లుపై ట్రంప్‌ సంతకం | US Donald Trump Signs On Big Beautiful Bill | Sakshi
Sakshi News home page

వైట్‌హౌస్‌లో సందడి.. వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లుపై ట్రంప్‌ సంతకం

Jul 5 2025 7:41 AM | Updated on Jul 5 2025 8:47 AM

US Donald Trump Signs On Big Beautiful Bill

వాషింగ్టన్‌: అమెరికాలో ‘వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు’పై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) సంతకం చేశారు. దీంతో వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు చట్టంగా మారింది. వైట్‌హౌస్‌ వేదికగా రిపబ్లికన్‌ సభ్యులు, అధికారుల సంబురాల మధ్య ట్రంప్‌.. ఈ బిల్లుపై సంతకం పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ట్రంప్‌ మద్దతుదారులు, మిత్రపక్షాలు, మిలిటరీ కుటుంబాలు, వైట్‌హౌస్‌ సిబ్బంది తరలివచ్చారు.

అనంతరం, వైట్‌హౌస్‌లో ట్రంప్‌ మాట్లాడుతూ.. ఈ చట్టంతో అందరికీ లబ్ధి జరుగుతుంది. సాయుధ బలగాల నుంచి మొదలు రోజూవారీ కార్మికుల వరకు కొత్త చట్టం మద్దతుగా ఉంటుంది. అమెరికా చరిత్రలోనే మా ప్రభుత్వం అతిపెద్ద పన్నుకోత, వ్యయకోత, సరిహద్దు భద్రతలో అతిపెద్ద పెట్టుబడి సాధించిది. అమెరికా ప్రజలు ఇంత ఆనందంగా ఉండటం గతంలో నేను ఎప్పుడూ చూడలేదు. ఈ బిల్లు ఆమోద ప్రక్రియలో మద్దతుగా నిలిచిన ప్రతినిధుల సభ స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌కు, సెనెట్‌ మెజారిటీ లీడర్‌ జాన్‌ థునెకు ధన్యవాదాలు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.  

ఇదిలా ఉండగా.. ప్రభుత్వ వ్యయాన్ని తీవ్రంగా తగ్గించడం, వలస చట్టాలను అమలు చేయడానికి కావాల్సిన కఠినమైన కొత్త విధానాలకు నిధులు సమకూర్చడం, పలు పన్ను కోతలను శాశ్వతం చేయడం వంటివి వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ చట్టంలో ఉన్నాయి. ఈ బిల్లుపై ఇటీవల సెనెట్‌లో సుదీర్ఘ చర్చ సాగింది. ముగ్గురు రిపబ్లికన్‌లు వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ 51-50 తేడాతో అక్కడ ఆమోదం లభించింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ టై బ్రేకర్‌గా మారి బిల్లును గట్టెక్కించారు. అనంతరం ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. సుదీర్ఘ చర్చ అనంతరం జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 218, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. ప్రతినిధుల సభలో బిల్లును ఇద్దరు రిపబ్లికన్లు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. 

 

మరోవైపు.. వైట్‌హౌస్‌లో వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లుపై ట్రంప్‌ సంతకం చేస్తున్న సందర్భంగా అక్కడ అమెరికా స్టెల్త్‌ బాంబర్లు, ఫైటర్‌ జెట్లు గగనతలంలో చక్కర్లు కొట్టాయి. కాగా, ఇటీవల ఇరాన్‌ అణుకేంద్రాలపై ఇవి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆకాశంలో ఫైటర్‌ జెట్లు చక్కర్లు కొడుతుండగా వైట్‌హౌస్‌ నుంచి ట్రంప్‌ వీక్షించారు. 

ఇది కూడా చదవండి: వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు.. ఎన్నారైలకు అలర్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement