
ప్రతీకాత్మక చిత్రం
భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు.. హిమాచల్ ప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. వీటికి తోడు కొండచరియలు విరిగిపడుతుండడంతో.. అక్కడి ప్రజల జీవనం కష్టతరంగా ఉంటోంది. మరోవైపు వర్షాలకు ఇప్పటిదాకా 75 మంది మరణించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఊరకుక్క 67 మంది ప్రాణాలను కాపాడింది!!. వివరాల్లోకి వెళ్తే..
హిమాచల్‌లో కురుస్తోన్న భారీ వర్షాలతో మండి జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. అక్కడి ధరంపూర్ తాలుకా సియతి గ్రామం జూన్ 30న అర్ధరాత్రి సమయంలో పెద్ద కొండచరియ విరిగిపడడంతో సర్వనాశనమైంది. ఇళ్లు ధ్వంసం కావడంతో గ్రామస్థులంతా తియంబాలా గ్రామంలోని నైనాదేవి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు. సర్వం కోల్పోయినా.. ఓ ఊరకుక్క కారణంగా ప్రాణాలు దక్కాయని చెబుతున్నారు వాళ్లు. ఆ రాత్రి ఏం జరిగిందో ఓ గ్రామస్తుడి మాటల్లో..
మా ఇంటి రెండోఅంతస్తులో ప్రతిరోజు ఓ శునకం నిద్ర పోయేది. అయితే ఆరోజు అర్ధరాత్రి భారీ వర్షం కురుస్తోంది. ఆ వర్షంలో అది విపరీతంగా అరవడం మొదలుపెట్టింది. భయంతో అరుస్తుందేమోనని ఆ అరుపుల శబ్దానికి నేను లేచి దాని దగ్గరకు వెళ్లాను. పైకి వెళ్లి చూడగా.. ఇంటిగోడకు పగుళ్లు కనిపించాయి. ఇంట్లోకి చిన్నగా నీరు రావడం మొదలైంది. దాంతో వెంటనే కుక్కను కూడా కిందికి పరిగెత్తా.
ఇంట్లో వాళ్లను.. చుట్టుపక్కల అందరినీ లేపి సురక్షిత ప్రాంతానికి వెళ్లమని చెప్పాను. అలా దూరంగా వెళ్లామో, లేదో.. మా గ్రామంపై ఓ పెద్ద కొండచరియ విరిగిపడింది. పదుల సంఖ్యలో ఇళ్లు దానికింద నేలమట్టం అయ్యాయి అని చెప్పారాయన. అలా కుక్క అరుపు.. 20 కుటుంబాలకు చెందిన 67 మంది ప్రాణాలను రక్షించిందన్నమాట.