స్కూల్‌పై కూలిన జెట్‌ | One Killed And Four Injured After Bangladesh Air Force Jet Crashes On School In Dhaka, Watch Videos Inside | Sakshi
Sakshi News home page

స్కూల్‌పై కూలిన జెట్‌

Jul 21 2025 2:29 PM | Updated on Jul 22 2025 5:35 AM

Bangladesh Air Force jet incident in Dhaka

విద్యార్థులుసహా 20మంది మృతి 

మరో 171 మందికి గాయాలు

బంగ్లాదేశ్‌లో ఘోర విమాన ప్రమాదం

ఢాకా: ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటూ తరగతి గదిలో ప్రశాంతంగా కూర్చున్న విద్యార్థులపై అకస్మాత్తుగా ఆకాశం నుంచి మృత్యువు యుద్ధవిమానం రూపంలో దూసుకొచ్చింది. చైనా తయారీ ఎఫ్‌–7బీజీఐ శిక్షణ యుద్ధవిమానం ఉన్నపళంగా పాఠశాలపై కుప్పకూలడంతో పాఠశాల విద్యార్థులుసహా 20 మంది సజీవదహ నమయ్యారు. వీరిలో 16 మంది చిన్నారులు, ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక పైలట్‌ ఉన్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

 బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఈ ఘోర విమానప్రమాదం సోమవారం మధ్యాహ్నం 1.15 గంటలకు సంభవించింది. కాలినగాయాలతో రక్తమోడుతున్న మరో 171మందిని హుటాహుటిన ఆస్పత్రులకు తరలించి చికిత్సనందిస్తున్నారు. ఢాకా నగరంలోని ఉట్టారా పరిధిలోని డియాబరీ ప్రాంతంలోని మైల్‌స్టోన్‌ స్కూల్, కాలేజీ క్యాంపస్‌పై ఈ శిక్షణవిమానం కుప్పకూలిందని బంగ్లాదేశ్‌ ఫైర్‌ సర్వీస్, సివిల్‌ డిఫెన్స్‌ విభాగ డైరెక్టర్‌ జనరల్‌ బ్రిగేడియర్‌ జనరల్‌ జహీద్‌ కమల్‌ చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. 

విమానంలో అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తడంతో అది అదుపుతప్పి ఇలా పాఠశాలపై పడిపోయిందని తెలుస్తోంది. ఒక్కసారిగా పాఠశాల మంటల్లో చిక్కుకుపోవడంతో స్థానికులు హుటాహుటిన వచ్చి రక్తసిక్తమైన చిన్నారులను రిక్షాలు, ఆటోల్లో దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు. విషయం తెల్సుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

 ‘‘కుర్మిటోలాలోని ఏకే ఖాన్‌దాకర్‌ వైమానిక స్థావరం నుంచి సోమవారం ఉదయం ఒంటిగంట ఆరు నిమిషాలకు బయల్దేరిన శిక్షణవిమానం కొద్దిసేపటికే అదుపుతప్పింది. పరిస్థితి సెకన్లలో పసిగట్టిన పైలట్‌ తౌకిర్‌ విమానాన్ని జనావాస ప్రాంతం మీద నుంచి దూరంగా తీసుకెళ్లేందుకు మళ్లించే ప్రయత్నంచేశారు. కానీ ఆలోపే విమానం వేగంగా కిందకు పడిపోయింది’’ అని బంగ్లాదేశ్‌ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్‌ కల్నల్‌ సమీ ఉద్‌ దౌలా చెప్పారు. ఘటనపై దర్యాప్తునకు కమిటీని ఏర్పాటుచేశామని దౌలా అన్నారు.

మిన్నంటిన రోదనలు
విగతజీవులుగా మారిన చిన్నారులను చూసి పిల్లల తల్లిదండ్రులు దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్న దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. కూలిన భవనం, చెల్లాచెదురుగా పడిన విద్యార్థుల మృతదేహాలు, తల్లిదండ్రుల ఆక్రందనలు, సహాయక చర్యలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. క్షతగాత్రులను తరలించేందుకు డజన్లకొద్దీ అంబులెన్సులు ఘటనాస్థలికి చేరుకున్నాయి. 

విమానం సృష్టించిన బీభత్సం ధాటికి నేలమట్టమైన పాఠశాల శిథిలాల కింద నుంచి 20 మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన వారిలో ఎనిమిది మంది ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కంబైన్డ్‌ మిలటరీ ఆస్పత్రి, ఢాకా మెడికల్‌ బోధ నాస్పత్రి, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బర్న్‌ అండ్‌ ప్లాస్టిక్‌ సర్జరీ(ఎన్‌ఐబీపీఎస్‌)లో పలువురికి చికిత్స నందిస్తున్నారు. మా ఆస్పత్రికి తీసుకొస్తున్న క్షతగా త్రుల సంఖ్య పెరుగుతోందని ఎన్‌ఐబీపీఎస్‌ వైద్యు డొకరు మీడియాతో చెప్పారు. విమానాన్ని నడిపిన పైలట్‌ లెఫ్టినెంట్‌ మొహమ్మద్‌ తౌకిర్‌ ఇస్లామ్‌ సైతం ప్రాణాలు కోల్పోయాడు. 

ఎఫ్‌–7బీజీఐ విమానం భారీ పేలుడుతో నాలుగంతస్తుల పాఠశాల భవనంపై కూలిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. రక్తసి క్తమైన మృతదేహాలను ఒకటి నుంచి ఏడో తరగతి క్లాసుల్లో వరుసగా పేర్చారని అక్కడి ఒక ఉపాధ్యా యుడు చెప్పారు. ‘‘ చిన్నపిల్లల క్లాసులు అయిపో యాయి. ఫైనల్‌ బెల్‌ కొట్టాం. ఆనందంగా పిల్లలు బ్యాగులు సర్దుకుని లైన్లలో నిల్చుని బయటకు వెళ్తున్నప్పుడే విమానం కూలింది. చుట్టూతా మంటలే. ఆ మంటలు, దట్టమైన పొగలో అసలేం కనిపించలేదు. 

నా రెండు చేతులు కాలిపోయాయి. ఊపిరాడలేదు’’ అని ఒక ఉపాధ్యాయురాలు ఆ భ యానక దృశ్యాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘ మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో క్లాసులు జరు గుతున్నాయి. హఠాత్తుగా విమానం నా కళ్లెదుటే కుప్పకూలింది. నాకు కేవలం 10 అడుగుల దూరంలో అది కూలడం చూశా. ప్రైమరీ స్కూల్‌ పిల్లలకు పాఠాలు చెప్పే రెండంతస్తుల బిల్డింగ్‌ గ్రౌండ్‌ఫ్లోర్‌ను విమానం ఢీకొట్టింది’’ అని ప్రాంగణంలో 11వ గ్రేడ్‌ చదువుతున్న ఫహీమ్‌ హుస్సేన్‌ అనే విద్యార్థి భయపడుతూ చెప్పాడు.  
  

ఢాకాలో కూలిన బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement