కుంచించుకుపోతున్న బుల్లి గ్రహం | Baby Planet Discovered By NASA's Chandra Is Shrinking, Know More Details Inside | Sakshi
Sakshi News home page

కుంచించుకుపోతున్న బుల్లి గ్రహం

Jul 21 2025 4:40 AM | Updated on Jul 21 2025 4:28 PM

Baby planet discovered by Nasa is shrinking

వయసు కేవలం 80 లక్షల ఏళ్లు  

నక్షత్ర తీక్షణ రేడియేషనే కారణం: నాసా

వాషింగ్టన్‌: అప్పుడే పుట్టిన బిడ్డ అనుకోని అనారోగ్య సమస్యతో అల్లాడుతుంటే అయ్యో అంటాం. ఇప్పుడు అంతరిక్షంలోనూ ఇలా తన ఉపరితల వాతావరణాన్ని కోల్పోతూ త్వరలో ఒట్టి శిలాగ్రహంగా మిగిలిపోనున్న ఒక నవజాత గ్రహాన్ని నాసా ఖగోళవేత్తలు తాజాగా గుర్తించారు. మన పుడమి పుట్టి 500 కోట్ల ఏళ్లు. భూమి వయసుతో పోలిస్తే కేవలం 80 లక్షల ఏళ్ల వయస్సున్న బుల్లి గ్రహం జాడను నాసా శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు. కేవలం 80 లక్షల ఏళ్ల వయస్సున్న ఈ చిన్న గ్రహానికి ‘టీఓఐ 1227–బీ’అని నామకరణంచేశారు.

ఇలా నామకరణం చేశారో అలా అది కుంచించుకుపోవడం చూసి ఆశ్చర్యపోయారు. పాత సినిమాల్లో దేవతల తీక్షణమైన చూపునకు రాక్షసులు కాలి భస్మమైపోయినట్లు ఇప్పుడు బుల్లి గ్రహం సైతం తన పుట్టుకకు కారణమైన నక్షత్రం నుంచి వెలువడే అత్యంత శక్తివంతమైన ఎక్స్‌–రే కిరణాల ధాటికి నాశనమవుతోంది. గ్రహం తన ఉపరితల వాతావరణాన్ని కోల్పోతోంది. వాతావరణాన్ని కోల్పో తూ అది కుంచించుకుపోతోందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. నాసా చంద్ర ఎక్స్‌–రే అబ్జర్వేటరీ ద్వారా ఈ బుల్లి గ్రహం కుంచించుకుపోతున్న వైనాన్ని ఖగోళవేత్తలు గమనించారు. ఈ వివరాలు ఆస్ట్రోఫిజిక్స్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 

అత్యంత సమీపంగా పరిభ్రమణం 
సూర్యుడు– బుధగ్రహం మధ్య ఉండే దూరంతో పోలిస్తే ఐదోవంతు దూరంలోనే ఈ బుల్లిగ్రహం తన పేరెంట్‌ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోంది. ఇంత దగ్గరగా పరిభ్రమిస్తుండటంతో ఆ నక్షత్రం నుంచి వెలువడుతున్న అత్యంత తీవ్రస్థాయి రేడియేషన్‌ ఈ గ్రహంపై పడుతోంది. ‘‘ఆ నక్షత్రం నుంచి వెలువడే భారీ రేడియేషన్‌ ధాటికి ఈ గ్రహంపై వాతావరణం త్వరలో పూర్తిగా ఆవిరైపోతుంది.

ఈ రేడియేషన్‌ను గ్రహించాక గ్రహం సైతం రేడియేషన్‌ను వెదజల్లుతోంది’’అని పరిశోధనలో ప్రధాన రచయిత, రోచెస్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో పీహెచ్‌డీ విద్యార్థి అత్తిల వర్గా చెప్పారు. ఈ గ్రహం మన భూమికి రెండు రెట్లు బరువుంది.  విశ్వంలో భిన్న పరిస్థితులు ఎలాగైతే ఇలాంటి బుల్లి గ్రహాలకు పురుడుపోస్తాయో, మళ్లీ అవే భిన్న పరిస్థితులు ఆ గ్రహాల మీది వాతావరణాన్ని అంతర్థానంచేస్తాయనే విషయాన్ని మరింత లోతుగా తెల్సుకునేందుకు ‘టీఓఐ 1227బీ గ్రహం’అక్కరకొస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement