breaking news
dwarf planet
-
కుంచించుకుపోతున్న బుల్లి గ్రహం
వాషింగ్టన్: అప్పుడే పుట్టిన బిడ్డ అనుకోని అనారోగ్య సమస్యతో అల్లాడుతుంటే అయ్యో అంటాం. ఇప్పుడు అంతరిక్షంలోనూ ఇలా తన ఉపరితల వాతావరణాన్ని కోల్పోతూ త్వరలో ఒట్టి శిలాగ్రహంగా మిగిలిపోనున్న ఒక నవజాత గ్రహాన్ని నాసా ఖగోళవేత్తలు తాజాగా గుర్తించారు. మన పుడమి పుట్టి 500 కోట్ల ఏళ్లు. భూమి వయసుతో పోలిస్తే కేవలం 80 లక్షల ఏళ్ల వయస్సున్న బుల్లి గ్రహం జాడను నాసా శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు. కేవలం 80 లక్షల ఏళ్ల వయస్సున్న ఈ చిన్న గ్రహానికి ‘టీఓఐ 1227–బీ’అని నామకరణంచేశారు.ఇలా నామకరణం చేశారో అలా అది కుంచించుకుపోవడం చూసి ఆశ్చర్యపోయారు. పాత సినిమాల్లో దేవతల తీక్షణమైన చూపునకు రాక్షసులు కాలి భస్మమైపోయినట్లు ఇప్పుడు బుల్లి గ్రహం సైతం తన పుట్టుకకు కారణమైన నక్షత్రం నుంచి వెలువడే అత్యంత శక్తివంతమైన ఎక్స్–రే కిరణాల ధాటికి నాశనమవుతోంది. గ్రహం తన ఉపరితల వాతావరణాన్ని కోల్పోతోంది. వాతావరణాన్ని కోల్పో తూ అది కుంచించుకుపోతోందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. నాసా చంద్ర ఎక్స్–రే అబ్జర్వేటరీ ద్వారా ఈ బుల్లి గ్రహం కుంచించుకుపోతున్న వైనాన్ని ఖగోళవేత్తలు గమనించారు. ఈ వివరాలు ఆస్ట్రోఫిజిక్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అత్యంత సమీపంగా పరిభ్రమణం సూర్యుడు– బుధగ్రహం మధ్య ఉండే దూరంతో పోలిస్తే ఐదోవంతు దూరంలోనే ఈ బుల్లిగ్రహం తన పేరెంట్ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోంది. ఇంత దగ్గరగా పరిభ్రమిస్తుండటంతో ఆ నక్షత్రం నుంచి వెలువడుతున్న అత్యంత తీవ్రస్థాయి రేడియేషన్ ఈ గ్రహంపై పడుతోంది. ‘‘ఆ నక్షత్రం నుంచి వెలువడే భారీ రేడియేషన్ ధాటికి ఈ గ్రహంపై వాతావరణం త్వరలో పూర్తిగా ఆవిరైపోతుంది.ఈ రేడియేషన్‌ను గ్రహించాక గ్రహం సైతం రేడియేషన్‌ను వెదజల్లుతోంది’’అని పరిశోధనలో ప్రధాన రచయిత, రోచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పీహెచ్డీ విద్యార్థి అత్తిల వర్గా చెప్పారు. ఈ గ్రహం మన భూమికి రెండు రెట్లు బరువుంది. విశ్వంలో భిన్న పరిస్థితులు ఎలాగైతే ఇలాంటి బుల్లి గ్రహాలకు పురుడుపోస్తాయో, మళ్లీ అవే భిన్న పరిస్థితులు ఆ గ్రహాల మీది వాతావరణాన్ని అంతర్థానంచేస్తాయనే విషయాన్ని మరింత లోతుగా తెల్సుకునేందుకు ‘టీఓఐ 1227బీ గ్రహం’అక్కరకొస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
అక్కడ ఏడాదికి 25,000 రోజులు
వాషింగ్టన్: భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగిరావడానికి 365 రోజులు పడుతుందని తెల్సిందే. అదే మాదిరి ఒక చిన్నపాటి మరుగుజ్జు గ్రహం లాంటి ఖగోళ వస్తువు మన సూర్యుని చుట్టూ అత్యంత నెమ్మదిగా తిరుగుతోంది. ఎంతగా అంటే ఒక చుట్టు చుట్టేయడానికి ఏకంగా 25,000 రోజుల సమయం తీసుకుంటోంది. సౌరమండలంలో కొత్తగా కనిపెట్టిన ఈ మరుగుజ్జు గ్రహానికి 2017 ఓఎఫ్201 అని పేరుపెట్టారు. అయితే దీనిని గ్రహం హోదా ఇవ్వాలా వద్దా అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే దీనిని పూర్తిస్థాయిలో గ్రహ లక్షణాలు లేవని తేలింది. నెప్ట్యూన్ గ్రహం ఎంత దూరంలో అయితే సూర్యుడి చుట్టూ తిరుగుతోందో అంతకంటే కాస్తంత ఎక్కువ దూరంలో ఈ అంతరిక్ష పదార్థం మన సూర్యుని చుట్టూ తిరుగుతోంది. ఇది చాలా నెమ్మదిగా పరిభ్రమిస్తోంది. ఒకసారి సూర్యుడిని చుట్టిరావడానికి 25,000 రోజుల సమయం తీసుకుంటోంది. దీని వెడల్పు ఏకంగా 700 కిలోమీటర్లు. ‘‘ కోట్ల సంవత్సరాలుగా ఒకే కక్షలో పరిభ్రమిస్తోంది. ఆ లెక్కన చూస్తే బుల్లి గ్రహం హోదా పొందే అర్హత కాస్తంత దీనికి ఉంది’’ అని అమెరికాలోని న్యూజెర్సీ కేంద్రంగా పనిచేసే ప్రిన్స్టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీలో ఖగోళ భౌతిక శాస్తవేత్త సిహావో చెంగ్ అన్నారు. మరుగుజ్జు గ్రహాల హోదా పొందిన ఐదింటిక కంటే ఈ కొత్త ఖగోళ వస్తువు కాస్తంత చిన్నగా ఉంది. గతంలో గ్రహంగా చెలామణి అయిన ఇటీవల మరుగుజ్జు గ్రహంగా స్థిరపడిపోయిన ప్లూటో వ్యాసం 2,377 కిలోమీటర్లుకాగా ఈ 2017 ఓఎఫ్201 వ్యాసం కేవలం 700 కిలోమీటర్లే! -
గగన దీపిక
ఆకాశంలోని నక్షత్రాలు చిన్ని బుర్రల్లో మెరుపులు మెరిపిస్తాయి. రాగదీపికకు మాత్రం నక్షత్రాల వెలుగుల వెనుక దాగిన చీకట్లను ఛేదించాలనే కోరిక కలిగింది. డ్వార్ఫ్ గెలాక్సీలపై పరిశోధన చేస్తున్న ఈ తెలుగమ్మాయిది గుంటూరు జిల్లా తెనాలి. గగన దీపిక పిల్లలకు ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుంది. రాగదీపికకు చదువుకోవడం ఇష్టం. అయితే ఆమెకు అంతరిక్షం అంటే ఇంకా ఇష్టమని ఆమె తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులకు తెలిసింది. టెన్త్‌క్లాస్‌లో నారాయణ ఒలింపియాడ్‌లో సీట్ వచ్చింది. కానీ చేరలేదు. ఇంటర్‌కి ఢిల్లీలో అత్యంత సాధారణమైన కాలేజ్ సరస్వతి విద్యామందిర్‌లో చేరింది. అప్పుడే ‘ఢిల్లీ విద్యామందిర్ క్లాసెస్’ అనే కోచింగ్ సెంటర్లో ట్యూషన్‌కు వెళ్లేది. అక్కడ ఒక సబ్జెక్టులో వారానికి నాలుగు క్లాసులు మాత్రమే ఉంటాయి. అలా ఏ మాత్రం ఒత్తిడి లేకుండా ఆడుతూ పాడుతూ ఇంటర్ పూర్తి చేసింది. ఇంటర్ తర్వాత ‘నెస్’్ట రాసి విశ్వభారతి యూనివర్సిటీ, శాంతినికేతన్లో ఎమ్మెస్సీ ఫిజిక్స్ (ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు)లో చేరింది. మనదేశంలో పిల్లలను పరిశోధన రంగంవైపు మళ్లించాలనే ఆలోచనతో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పెట్టించిన కోర్సు ఇది. భువనేశ్వర్, శాంతినికేతన్, బొంబాయిల్లో మాత్రమే ఈ కోర్సు ఉంది. అందులో దీపిక గోల్డ్ మెడల్ తెచ్చుకుంది. నక్షత్రాల వేట 2018 జనవరిలో అమెరికన్ ఆస్ట్రనామికల్ సొసైటీ సమావేశంలో పోస్టర్ ప్రెజంటేషన్, యూకేలోని డర్హామ్‌లో అంతర్జాతీయ సమావేశంలో ‘ఫ్లాష్ టాక్’ ఇచ్చింది రాగదీపిక. ప్రస్తుతం ట్యూసాన్లోని స్టూవర్డ్ అబ్జర్వేటరి, యూనివర్శిటీ ఆఫ్ ఆరిజోనాలో ‘డ్వార్ఫ్ గెలాక్సీస్–బ్లాక్ హోల్స్’ అనే అంశంపై పరిశోధన చేస్తోంది. ‘ఐసీ1613’ అనే డ్వార్ఫ్ గెలాక్సీ చుట్టూ అతి పురాతనమైన నక్షత్రాలు ఉన్నాయని ఈ పరిశోధనలోనే రాగదీపిక కనిపెట్టింది. భూమ్మీదే ఆగిపోకూడదు ‘మనకు బాగా తెలిసిన ఇంజినీరింగ్, మెడిసిన్ రంగాలే కాదు. ప్రపంచం చాలా విశాలమైంది. అంతరిక్షం అంతకంటే విశాలమైనది..’ అని.. సెలవులకు ఇండియా వచ్చినప్పుడు ఇచ్చే ప్రసంగాలలో తరచు చెబుతుంటుంది రాగదీపిక. తెనాలి, విజయవాడలోని కొన్ని స్కూళ్లు, కాలేజీల వాళ్లు పిల్లలకు గెస్ట్ లెక్చర్ కోసం దీపికను ఆహ్వానిస్తుంటారు. ‘‘మా నాన్నగారు ఖగోళశాస్త్రం పుస్తకాలు ఇష్టంగా చదివేవారు. దీపికకు తాతతో బాగా మాలిమి. ఆయన చదివే పుస్తకాలను చూస్తూ ఉండేది. దీపిక పదేళ్ల వయసులోనే మా నాన్నగారు పోయారు. కానీ ఈ రంగం మీద తనకు ఇష్టం కలగడానికి చిన్నప్పుడు పడిన తాతగారి ముద్రే కారణం అనిపిస్తుంది’’ అన్నారు రాగదీపిక తల్లి కనకదుర్గ.– బి.ఎల్.నారాయణ,సాక్షి, తెనాలి మరో రెండు పరిశోధనలు శాస్త్రవిజ్ఞానాన్ని వృత్తిగా స్వీకరించటానికి ప్రోత్సాహం కల్పించాలనేదే నా ఉద్దేశం. మరో రెండేళ్లలో నా పీహెచ్డీ పూర్తవుతుంది. తర్వాత ఇంకో రెండు పోస్ట్ డాక్టోరల్ పరిశోధనలు చేయాలనుకుంటున్నాను. పరిశోధనలు సాగిస్తూనే ప్రొఫెసర్‌గా పనిచేయాలనేది నా కోరిక. ఏదైనా సాధించి మంచి సైంటిస్టుగా చరిత్రలో నిలవాలనేది నా లక్ష్యం.– రాగదీపిక, పీహెచ్డీ స్కాలర్ -
‘సీరీజ్’పై మరో వెలుగు చుక్కలు
మరుగుజ్జు గ్రహం సీరీజ్‌పై మరో ప్రకాశవంతమైన ప్రాంతాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఆ గ్రహంపైకి పంపిన డాన్ వ్యోమనౌక గుర్తించింది. సీరీజ్ ఉపరితలం నుంచి దాదాపు 46వేల కిలోమీటర్ల దూరం నుంచి డాన్ వ్యోమనౌక తీసిన ఈ ఛాయాచిత్రాలు శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ వెలుగులు గ్రహంపై ఉన్న అగ్నిపర్వతాల నుంచి వెలువడిన ఉద్గారాలు కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఇంకా స్పష్టంగా కనిపించేంత వరకు కచ్చితంగా చెప్పలేమని వారు పేర్కొంటున్నారు. ఈ డాన్ వ్యోమనౌక సీరీజ్ కక్ష్యలోకి మార్చి 6న ప్రవేశించనుంది. ఆ తర్వాత ఈ ప్రకాశవంతమైన ప్రదేశాన్ని స్పష్టంగా చూసి దాని గురించి తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 2012లో సీరీజ్ నుంచి విడుదలవుతున్న నీటి ఆవిరిని కనుగొన్నారు. గ్రహ ఉపరితలంపై నీటిని కలిగి ఉన్న ఖనిజాలు ఉండొచ్చని వారు పేర్కొంటున్నారు. -
మరుగుజ్జు గ్రహంపై నీటిఆవిరి!
వాషింగ్టన్: అంగారక, గురు గ్రహాల మధ్య గ్రహశకలాలు తిరిగే ఆస్టరాయిడ్ బెల్ట్‌లో సీరీజ్ అనే మరుగుజ్జు గ్రహం నుంచి నీటి ఆవిరి విడుదలవుతోందట. సూర్యుడికి దగ్గరగా వెళ్లినప్పుడల్లా సీరీజ్ వేడెక్కుతోందని, ఫలితంగా దాని నుంచి నీటి ఆవిరి విడుదలవుతోందని ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈఎస్ఏ) శాస్త్రవేత్తలు హెర్షెల్ స్పేస్ టెలిస్కోపు సాయంతో కనుగొన్నారు. ఆస్టరాయిడ్ బెల్ట్‌లో అతిపెద్ద వస్తువు అయిన సీరీజ్ సుమారు 950 కి.మీ. సైజు ఉంటుంది. దీనిని తొలుత 1801 సంవత్సరంలో కనుగొన్నారు. ఆస్టరాయిడ్కు ఎక్కువ.. గ్రహానికి తక్కువ.. కావడంతో సీరీజ్ను మరుగుజ్జు గ్రహం(డ్వార్ఫ్ ప్లానెట్)గా ధ్రువీకరించారు. ఆస్టరాయిడ్ బెల్ట్‌లో ఒక వస్తువుపై నీటి ఆవిరిని గుర్తించడం ఇదే తొలిసారి. సీరీజ్ ఉపరితలంలో మంచు, అంతర్భాగంలో శిలలు, భారీ ఎత్తున మంచు ఉంటుందని, ఆ మంచును కరిగిస్తే గనక.. భూమిపై ఉన్న మంచినీటి కంటే ఎక్కువ పరిమాణంలోనే నీరు వెలువడుతుందని అంచనా.