భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో అంటూ అత్యంత కవితాత్మకంగా పలవరించాడు దాశరథి. చంద్రుని పుట్టుక కోసం నిజంగానే ఓ భారీ సురగోళం రాలి కనుమరుగైందట! అవున్నిజమే. భూమికి ఏకైక ఉపగ్రహమైన చందమామ ఆవిర్భావానికి సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని తాజా అధ్యయనం ఒకటి వెలుగులోకి తెచి్చంది.
చాలాకాలం క్రితం, అంటే ఏకంగా 450 కోట్ల ఏళ్ల నాడు మన సౌరకుటుంబంలో అటూఇటుగా అంగారకుని సైజుతో కూడిన థెయా అనే భారీ గ్రహం కూడా ఉండేదట. ఆ లెక్కన పరిమాణంలో దాన్ని భూమికి అక్క వంటిదన్నమాట! అది కాస్తా (తొలి)నాటి భూమితో ఢీకొట్టి ముక్కలు చెక్కలైందట. వాటిలో చిన్నాచితకా ముక్కలన్నీ నామరూపాల్లేకుండా పోగా, మిగిలిపోయిన అతి పెద్ద భాగమే మన చందమామగా రూపుదిద్దుకుంది!
అంటే చంద్రునికి జన్మనిచ్చే క్రమంలో దాని తల్లి ఏకంగా ప్రాణత్యాగమే చేసిందన్నమాట. అంతేకాదు, థెయా ఢీకొన్న ఫలితంగా భూ అక్షం కూడా భారీ మార్పుచేర్పులకు లోనై ఇప్పుడున్న క్రమంలోకి మారింది. దాంతో జీవకోటి ప్రాదుర్భావానికి, అందుకు అనువైన వాతావరణం అమరేందుకు భూమి మరింత వీలుగా మారిందట. అలా థెయా తాను కనుమరుగైపోతూ కూడా ఇటు భూమికి ఎనలేని సాయం చేయడమే గాక, అటు చంద్రునికి ఏకంగా ఉనికినే ఏర్పరచింది.
గుట్టు విప్పిన ఐసోటోపులు
థెయా ఉనికిని ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలం క్రితమే దాదాపుగా నిర్ధారించారు. అయితే అది ఎంత పరిమాణంలో ఉండేది, దాని మూలాలేమిటి, కూర్పు ఎలాంటిది వంటి ప్రశ్నలకు ఇంకా జవాబులు లభించాల్సే ఉంది. వీటికి సమాధానాలు కనిపెట్టేందుకు జర్మనీలోని మాక్స్ ప్లాంట్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సోలార్ రీసెర్చ్, యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఒక భారీ ప్రయోగానికి తెరతీశారు.
అందులో భాగంగా ఇనుము, రాళ్లు తదితరాలతో పాటు అపోలో అంతరిక్ష యాత్రలో భాగంగా చంద్రుని పై నుంచి, పలు సమీప ఉల్కల నుంచి వ్యోమగాములు తెచి్చన ఆరు నమూనాల ఐసోటోపులను పరీక్షించారు. ముఖ్యంగా భూమి, చంద్రుడు, ఉల్కల తాలూకు ఐసోటోపుల పరస్పర నిష్పత్తిని రివర్స్ ఇంజనీరింగ్‌గా పేర్కొనే ప్రక్రియ ద్వారా పోల్చి చూశారు.
థెయా మన సౌరకుటుంబ లోపలి భాగంలోనే ఏర్పడిందని, అందులోనూ భూమి కంటే సూర్యునికి దగ్గరగా ఉండేదని తేల్చారు. అంతేగాక సౌరమండలంలో భూ గ్రహం ఉన్న అకర్బన మండల పరిధిలోనే థెయా కూడా ఉండేదని అధ్యయన సారథి తిమో హాప్ వివరించారు. ‘‘భూమి కంటే కూడా సూర్యునికి థెయా దగ్గరగా ఉండేది గనుక మరింత వేడిగా, వాయుమయంగా ఉండేదన్నది వాస్తవం.
భూమితో పోలిస్తే చంద్రుడు చాలా పొడిగా ఉండేందుకు ఇది కూడా ముఖ్య కారణమే’’ అని ఆయన వివరించారు. బుధ, శుక్ర గ్రహాల నుంచి కూడా నమూనాలను సేకరించగలిగిన నాడు థెయాకు సంబంధించి మరిన్ని ఆసక్తికరమైన అంశాలు కచి్చతంగా వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ వివరాలను సైన్స్ జర్నల్ తాజా సంచికలో ప్రచురించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్


