భూకంపాలపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీం వ్యాఖ్య
న్యూఢిల్లీ: దేశంలోని 75 శాతం జనాభా భూకంపాలు సంభవించే ప్రమాదకర జోన్‌లోనే ఉన్నారని, భూకంప నష్టం సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకర్టు అసహనం వ్యక్తం చేసింది. అంటే, ఇక్కడున్న అందరిని చంద్రుడిపై తరలించమంటారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పిటిషన్‌ను కొట్టివేసింది.
జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం ఎదుట పిటిషనర్ స్వయంగా వాదనలు వినిపించారు. రాజధాని ఢిల్లీ మాత్రమే భూకంప ప్రమాదమున్న చోట ఉందని ఇప్పటి వరకు అంతా భావించేవారని, దేశంలోని 75 శాతం ప్రజలకు భూకంపాల ప్రమాదం ఉందని ఇటీవలి అధ్యయనంలో తేలిందని ఆయన చెప్పారు. అయితే, చంద్రమండలంపైకి వీళ్లందర్నీ పంపించాలంటారా అని ధర్మాసనం ప్రశ్నించింది.
నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని పిటిషనర్ కోరగా ‘విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సింది ప్రభుత్వాలే. అది కోర్టుల పని కాదు’అంటూ ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. భూకంప ప్రమాదాలకు సంబంధించిన వార్తా కథనాలను చూపించగా, తాము వాటిని పట్టించుకోమని వ్యాఖ్యానించింది.


