యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌సీటీఈ స్థానంలో ఒకే రెగ్యులేటరీ
‘వికసిత్ భారత్ శిక్షా అధిక్షణ్ బిల్లు’కు కేంద్ర కేబినెట్ ఆమోదం
ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు
2027లో రెండు దశల్లో డిజిటల్ జన గణన
బీమా రంగంలో ఎఫ్‌డీఐలు 74 శాతం నుంచి 100 శాతానికి పెంపు
2026 సీజన్‌లో ఎండు కొబ్బరి కనీస మద్దతు ధర పెంపు
కాలం చెల్లిన చట్టాల రద్దు బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: దేశంలో ఉన్నత విద్యకు సంబంధించి ఒకే నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. విశ్వవిద్యాలయ నిధుల సంఘం(యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ), జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్‌సీటీఈ) వంటి సంస్థల స్థానంలో ఏకైక వ్యవస్థను తీసుకురాబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రతిపాదించిన హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(హెచ్‌ఈసీఐ) బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
ఈ బిల్లు పేరును ‘వికసిత్ భారత్ శిక్షా అధిక్షణ్ బిల్లు’గా మార్చారు. సింగిల్ హైయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని నూతన జాతీయ విద్యా విధానంలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం శుక్రవారం సమావేశమైంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జన గణన, పంటలకు కనీస మద్దతు ధర, బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, కాలం చెల్లిన చట్టాల రద్దు సహా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ వివరాలను కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలియజేశారు.
మూడు ప్రధాన బాధ్యతలు
ఉన్నత విద్య నియంత్రణను ఒకే ఒక్క వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించడం ముఖ్యమైన సంస్కరణ అని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యవస్థకు మూడు ప్రధాన బాధ్యతలు అప్పగిస్తారు. రెగ్యులేషన్, అక్రెడిటేషన్, ప్రమాణాలు నిర్దేశించడం. విద్యా సంస్థలకు నిధులు కేటాయించే అధికారం మాత్రం ఉండదని తెలుస్తోంది. నిధుల బాధ్యత ప్రభుత్వానిదే. అలాగే వైద్య, న్యాయ కళాశాలలు ఈ సింగిల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ పరిధిలోకి వచ్చే అవకాశం లేనట్లు సమాచారం. హెచ్‌ఈసీఐ ముసాయిదా బిల్లు ఇప్పటికే సిద్ధమైంది. ‘వికసిత్ భారత్ శిక్షా అధిక్షణ్ బిల్లు’ పార్లమెంట్‌లో ఆమోదం పొందితే ఈ కమిషన్ సాకారం కానుంది.
‘ఉపాధి’ పని దినాలు ఇకపై 125 రోజులు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ‘పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన’గా మార్చడానికి ఉద్దేశించిన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద పనిదినాల సంఖ్యను ఏటా 100 నుంచి 125కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కూలీలకు ప్రతి సంవత్సరం కనీసం 125 పని దినాలు కల్పించాల్సి ఉంటుంది.
జన గణనకు రూ.11,718 కోట్లు
దేశవ్యాప్తంగా జన గణన కోసం రూ.11,718 కోట్లు కేటాయించడానికి మంత్రివర్గం అంగీకారం తెలియజేసింది. ఈసారి డిజిటల్ రూపంలో జన గణన నిర్వహించబోతున్నారు. దాదాపు 30 లక్షల మంది ఎన్యుమరేటర్లు ఈ క్రతువులో పాల్గొంటారు. జన గణనతోపాటు కుల గణన నిర్వహించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. రెండు దశలో కులగణన నిర్వహిస్తారు.
మొదటి దశలో 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ చేపడతారు. రెండో దశలో 2027 ఫిబ్రవరి నుంచి జన గణన ప్రారంభిస్తారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండే జమ్మూకశీ్మర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో మాత్రం 2026 సెప్టెంబర్‌లోనే జన గణన ప్రారంభమవుతుంది. ప్రజల డేటా సేకరణ కోసం మొబైల్ యాప్‌ను ఉపయోగించబోతున్నారు. ఇది దేశ చరిత్రలోనే మొట్టమొదటి డిజిటల్ సెన్సెస్ అని చెప్పొచ్చు.
బీమా రంగంలో 100% ఎఫ్‌డీఐలు
దేశంలో బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు(ఎఫ్‌డీఐ) అనుమతించే బీమా చట్టాల(సవరణ) బిల్లు–2025ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు పెద్దపీట వేయడం ద్వారా దేశంలో బీమా రంగం మరింత అభివృద్ధి సాధిస్తుందని, ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం బీమా రంగంలో 74 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. దీన్ని 100 శాతానికి పెంచబోతున్నారు
బొగ్గు గనుల వేలానికి ‘కోల్‌సేతు’
పారిశ్రామిక అవసరాల కోసం బొగ్గు గనుల వేలం, ఎగుమతులకు అనుమతులు ఇచ్చే విషయంలో ‘కోల్‌సేతు’ వేదిక ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వేలంలో పారదర్శకతతోపాటు వనరుల సది్వనియోగానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశీయ వినియోగదారులు బొగ్గు కావాలంటే ‘కోల్‌సేతు’ ద్వారా వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది. తవ్విన బొగ్గులో 50 శాతాన్ని విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు. మిగతా 50 శాతం ఇక్కడే ఉపయోగించాలి.
ఎండు కొబ్బరికి మరో రూ.445
మిల్లింగ్ చేసిన ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను కేంద్ర మంత్రివర్గం క్వింటాల్‌కు మరో రూ.445 పెంచింది. దీంతో 2026 సీజన్‌లో క్వింటాల్ ధర రూ.12,027కు చేరింది. ఇక మిల్లింగ్ చేయని ఎండు కొబ్బరి కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు మరో రూ.400 పెంచింది. ఈ రకం కొబ్బరికి క్వింటాల్ ధర రూ.12,500కు చేరుకుంది. కొబ్బరి రైతులను ప్రోత్సహించడానికి, వారికి మరింత ఆదాయం దక్కేలా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
71 చట్టాలు రద్దు
కాలం చెల్లిపోయిన 71 చట్టాల రద్దు బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఇందులో 65 చట్టాలు సవరణ చట్టాలు, ఆరు అసలైన చట్టాలు ఉన్నాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా 1,562 పాత చట్టాలను రద్దు చేసింది. ప్రతిపాదిత రిపీల్ అండ్ అమెండ్‌మెంట్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే.. రద్దయిన చట్టాల సంఖ్య 1,633కు చేరుకోనుంది.


