ఢిల్లీ: జనాభా లెక్కల సేకరణకు 11,718 కోట్ల రూపాయల కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండు విడతల్లో జనగణన నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తొలివిడతలో ఇళ్ల లెక్కింపు, అనంతరం జనాభా లెక్కలు చేపట్టనున్నారు. 2026 ఏప్రిల్, సెప్టెంబర్‌లలో హౌస్ లిస్టింగ్, 2027 ఫిబ్రవరిలో జనగణన చేయనున్నారు.
30 లక్షల మంది సిబ్బందితో జనాభా లెక్కల సేకరణ చేయనున్నారు. మొబైల్ యాప్‌తో డేటా సేకరించనున్నారు. సెంట్రల్ పోర్టల్ మానిటరింగ్ వ్యవస్థ ద్వారా పర్యవేక్షించనున్నారు.
‘కోల్ సేతు విండో’కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బొగ్గు గనుల రంగంలో సంస్కరణల కోసం కొత్త పాలసీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కొబ్బరి కి మద్దతు ధర ప్రకటించిన కేంద్ర కేబినెట్.. 2026 సీజన్‌లో క్వింటాల్ మిల్లింగ్ కొబ్బరి కి క్వింటాల్‌కు రూ. 445 రూపాయలు. బాల్ కొబ్బరి క్వింటాలుకు 400 రూపాయలు మద్దతు ధర పెంచింది. మిల్లింగ్ కొబ్బరి క్వింటాలు ధర: 12,027 రూపాయలు, బాల్ కొబ్బరి ధర 12,500 ప్రకటించింది.
ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకంగా మార్పు చేసింది. పనిదినాలు ఏడాదికి 120 రోజులకు పెంచింది. ఈ పథకాన్ని మొదట జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 (NREGA)గా ప్రారంభించగా.. తరువాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)గా మార్చారు. తాజాగా.. 'పూజ్య బాపు ఉపాధి హామీ పథకం'గా మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.


