కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిపై ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పార్టీ నాయకత్వం సరిగ్గా లేదని ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీకి లేఖ రాశారు. త్వరలోనే నాయకత్వ బాధ్యతలు ప్రియాంక గాంధీకి అప్పగించాలన్నారు. అందుకోసం యావద్దేశం ఎదురుచూస్తుందని తెలిపారు. ఈ లేఖతో అధికార బీజేపీ కౌంటర్ స్టార్ట్ చేసింది. కాంగ్రెస్‌లో మరోసారి గ్రూప్ వార్ నడుస్తోందని శుక్రవారం కామెంట్ చేసింది.
కాంగ్రెస్‌కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా గడ్డుకాలం నడుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు పరాజయం పాలవడంతో పాటు పలు రాష్ట్రాల్లో ఆపార్టీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. దీంతో ఆ పార్టీ నాయకత్వంపై బహిరంగంగానే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. 16 రోజుల పాటు యాత్ర నిర్వహించారు. ఆయన అక్కడ ఇండియా కూటమికి చుక్కెదురైంది. కాంగ్రెస్ పార్టీ 63 స్థానాల్లో పోటీ చేసి కేవలం 6స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. దీంతో పార్టీ భవిష్యత్తుపై మరోసారి చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఒరిస్సాకు చెందిన బరాబతి-కటక్ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ మెుఖ్యుం సోనియాగాంధీకి లేఖ రాశారు.
మాజీ ఎమ్మెల్యే లేఖలో "ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి జాతీయ స్థాయితో పాటు రాష్ట్రాలలో ఆశాజనకంగా లేదు. కేంద్రంలో మనం మూడు సార్లు వరుసగా పరాజయం పాలయ్యాము. ఈ పరిస్థితి పార్టీనే దైవంగా కొలిచే మాలాంటి కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. బిహార్, ఢిల్లీ, మహారాష్ట్ర, కశ్మీర్‌లతో పాటు ఇతర ప్రాంతాల్లో ఓడిపోవడానికి పార్టీ అంతర్గత సంక్షోభాలు కారణమన్నారు. భారత్‌లో ప్రస్తుతం 35 సంవత్సరాలలోపు జనాభా గలవారు దాదాపు 65శాతం మంది ఉన్నారు. భవిష్యత్తు మెుత్తం యువత చేతుల్లోనే ఉంటుంది. కనుక ప్రస్తుత జాతీయ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే గారి (83) వయస్సు రీత్యా వారి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోలేరు. కనుక ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీ ప్రియాంక గాంధీ చేతికి పార్టీ బాధ్యతలు అప్పగించాలి. దేశ యుువత వారి నాయకత్వం కోసం వేచిచూస్తుంది". అని లేఖలో ఆయన పేర్కొన్నారు.
పార్టీలో సరైన నాయకత్వం లేకే జ్యోతిరాధిత్య సిందియా, హిమంత్ బిశ్వాస శర్మ, జైవీర్ శెర్గిల్ లాంటి కీలక నాయకులు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారని తెలిపారు. ప్రస్తుతం ఒడిస్సాతో పాటు దేశవ్యాప్తంగా పార్టీ పరిస్థితి ఏమి బాగాలేదని ఇప్పటికైనా మేల్కోని తగిన చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశముందని పేర్కొన్నారు. అయితే ఈ లేఖపై బీజేపీ పార్టీ అటాక్ స్టార్ట్ చేసింది. కాంగ్రెస్‌లో అంతర్గతంగా రాహుల్ గాంధీ గ్రూప్, ప్రియాంక గాంధీ గ్రూప్ వార్ నడుస్తోందని తెలిపింది. అవి ఇప్పుడు బహిర్గతమయ్యాయని బీజేపీ కామెంట్ చేసింది.


