సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ తేదీ ప్రకటించింది. జనవరి 1న సాయుధ విరమణ చేస్తామని మావోయిస్టులు ప్రకటించారు. అందరూ కలిసి ఒకేసారి లొంగిపోనున్నట్లు మావోయిస్టు పార్టీ తెలిపింది. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ప్రకటన విడుదలైంది. ‘‘ఆయుధ విరమణ అంటే ప్రజలకు ద్రోహం చేయడం కాదు. సంఘర్షణకు సరైన సమయం కాదు. అధిక ప్రాధాన్యత ఇచ్చే సర్కార్‌తో వెళ్తాం’’ అంటూ మావోయిస్టు పార్టీ పేర్కొంది.
తాము ఆయుధాలు వీడేందుకు సిద్దంగా ఉన్నామని మావోయిస్టులు ఇటీవల లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఆపరేషన్ కగార్‌లో భాగంగా మూడు రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణ తేదీని ప్రకటిస్తామని పేర్కొనగా, తాజాగా తేదీని ప్రకటిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.
పోలీసుల అదుపులో దేవ్‌జీ
కాగా, మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ప్రస్తుతం పార్టీకి చీఫ్‌గా కొనసాగుతున్నాడని పేర్కొంటున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ పోలీసుల అదుపులో ఉన్నాడని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరుతో ఈనెల 22న విడుదల అయిన లేఖ గురువారం వెలుగుచూసింది.
‘మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు దేవ్‌జీతో పాటు మరో 50 మందిని పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు. వారిని వెంటనే కోర్టులో హాజరు పరచాలి. అదేవిధంగా మారేడుమిల్లి, రంపచోడవరం ఎన్‌కౌంటర్లకు నిరసనగా ఈనెల 30న భారత్‌బంద్ పాటించాలి. అటవీ ప్రాంతంలోని సహజ వనరులను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకే అక్కడి ఆదివాసీలపై ప్రభుత్వం దౌర్జన్య చర్యలకు దిగుతోంది. గిరిజన చట్టాలు అమలయ్యే రిజర్వ్ ఫారెస్ట్‌లో క్యాంపుల ఏర్పాటు, రోడ్లు, వంతెనల నిర్మాణం కోసం లక్షలాదిగా చెట్లను ప్రభుత్వం నరికివేస్తోంది’అని మావోయిస్టు పార్టీ పేర్కొంది.


