కమ్మర్‌పల్లిలో పులి అడుగులు | A large tiger has entered Nizamabad district | Sakshi
Sakshi News home page

కమ్మర్‌పల్లిలో పులి అడుగులు

Mar 4 2026 4:33 AM | Updated on Mar 4 2026 4:33 AM

A large tiger has entered Nizamabad district

గుర్తించిన అటవీ శాఖ..

అప్రమత్తమైన అధికారులు 

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలోకి పెద్ద పులి ఎంట్రీ ఇచ్చింది. జిల్లా సరిహద్దుల్లోని జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో సంచరించిన పెద్ద పులి తాజాగా కమ్మర్‌పల్లి అటవీ రేంజ్‌లోకి వచ్చినట్లు ఆనవాళ్లు కనిపించాయి. కమ్మర్‌పల్లి ఫారెస్ట్‌ రేంజ్‌ కోనాపూర్‌ అడవుల్లో మంగళవారం పెద్ద పులి పాదముద్రలను అటవీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు జిల్లా అటవీ అధికారి వికాస్‌మీనా ‘సాక్షి’కి ధ్రువీకరించారు. 

రెండురోజుల క్రితం వరకు జగిత్యాల జిల్లా కొడిమ్యాల అటవీ ప్రాంతంలో సంచరించిన ఈ మగ పులి తాజాగా నిజామాబాద్‌ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోకి రావడంతో జిల్లా అటవీ శాఖ అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. రాష్ట్ర అ­ట­వీ శాఖకు సమాచారం అందించారు. కమ్మర్‌పల్లి రేంజ్‌లో పెద్ద పులి పాద ముద్రలను గుర్తించిన అధికారులు అది ఎటువైపు వెళ్లిందో? అనే విషయమై కచ్చితమైన అంచనాలకు రాలేదు. 

కమ్మర్‌పల్లి రేంజ్‌ అడవుల్లోనే ఉందా? లేక పక్కనే ఉన్న మెట్‌పల్లి, వేములవాడ, సిరిసిల్ల రేంజ్‌లకు వెళ్లిందా? అనేదానిపై నిర్ధారణ చేయాల్సి ఉంది. కాగా, సిరికొండ, ఇందల్వాయి రేంజ్‌ల్లోకి సైతం పులి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని అటవీ శాఖ భావిస్తోంది. ఈ మగపులి జోడీ కోసం మహారాష్ట్ర తడోబా నుంచి యాదాద్రి జిల్లాలోకి ప్రవేశించి తిరిగి సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల మీదుగా జగి­త్యాల నుంచి నిజామాబాద్‌ జిల్లాలోకి ప్రవేశించిందని అధికారులు చెబుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement