న్యూఢిల్లీ: తమినాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి సిట్ దర్యాప్తునకు మద్రాసు హైకోర్టు ఆదేశాలివ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుకు సంబంధించి మద్రాసు హైకోర్టులో ‘ఏదో తప్పు జరుగుతోంది అంటూ వ్యాఖ్యానించింది. ప్రధానంగా ఈ కేసు విచారణ లిస్టింగ్ జాబితాకు సంబంధించి ఏదో జరుగుతోందని అనుమానం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.
ఈరోజు(శుక్రవారం, డిసెంబర్ 12) ఈ కేసు విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు రిజిస్టార్ జనరల్ నివేదికను పరిశీలించిన క్రమంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రార్‌ను పార్టీగా చేరుస్తూ నోటీసు జారీ చేసింది అదే సమయంలో మద్రాస్ హైకోర్టులో అనుసరిస్తున్న నియమాలను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
కరూర్ తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టు.. సిట్‌ను ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ విజయ్ టీవీకే పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. ఈ మేరకు వ్యాఖ్యానించింది. టీవీకే విజయ్ దాఖలు చేసిన పిటిషన్‌లో భాగంగా మద్రాస్ హైకోర్టు సిట్ విచారణకు ఆదేశిస్తూ తీర్పు ఇవ్వడంపై గతంలోనే ఆశ్చర్యం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ఈసారి ఆ హైకోర్టులో ఏదో తప్పు జరుగుతోంది’ అంటూ అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్టోయిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆశ్చర్యంతో పాట అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు.
తమిళనాడులోని కరూర్ తొక్కిసలాటపై మద్రాస్ హైకోర్టు రెండు విరుద్ధమైన ఉత్తర్వులు జారీ చేయడంలోని ఔచిత్యాన్ని గతంలో కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది సీబీఐ విచారణ కోరుతూ విజయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన మద్రాస్ హైకోర్టు.. సిట్ దర్యాప్తునకు మాత్రం ఆదేశాలివ్వడంతో కేసుల విచారణ లిస్టింగ్ సరిగా జరుగుతుందా లేదా అనేది పరిశీలించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.


