సంక్షేమ పథకాలు వారికీ అందాలి
కేంద్రాన్ని కోరిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: నేరగాళ్ల బలవంతంపై యాసిడ్ తాగిన బాధితులను ‘రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్’లో చేర్చేందుకు చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. చట్టాన్ని సవరించి, యాసిడ్ కారణంగా అనేక ఇబ్బందులకు గురవుతున్న బాధితులకు సంక్షేమ పథకాలను ఉపయోగించుకునేలా చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చిల ధర్మాసనం కోరింది.
యాసిడ్ దాడి బాధితురాలు షహీన్ మాలిక్ వేసిన పిల్‌పై ఈ నెల 4వ తేదీన విచారణ జరిపిన ధర్మాసనం..ఢిల్లీలోని రోహిణి కోర్టులో 16 ఏళ్లుగా పెండింగ్‌లో ఉండటంపై విస్మయం వ్యక్తం చేయడంతోపాటు, వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న యాసిడ్ దాడి కేసుల వివరాలను తెలపాలంటూ ఆదేశాలివ్వడం తెల్సిందే. షహీన్ మాలిక్ కేసు విచారణ రోజువారీగా జరుగుతోందని, ముగింపునకు వచ్చిందని గురువారం విచారణ సందర్భంగా ధర్మాసనానికి రోహిణి కోర్టు సమాచారం అందజేసింది.
అదే సమయంలో, యాసిడ్ దాడి కేసుల గురించి మాత్రమే తమకు ఇప్పటి వరకు తెలుసని, నేరగాళ్లు యాసిడ్ తాగించడంతో అంతర్గత వ్యవస్థలు దెబ్బతిన్న కేసులు కూడా ఉన్న విషయం ఇప్పుడే తెలిసిందని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. పిటిషనర్ కోరిన విధంగా, ఇటువంటి బాధితులకు న్యాయం చేసేందుకు, చట్టాన్ని అవసరమైన సవరణ చేపట్టేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని ఆయన అన్నారు.
చట్టానికి తీసుకురావాల్సిన సవరణలపై ఒక నోట్ అందజేయాల్సిందిగా సీజేఐ ఈ సందర్భంగా పిటిషనర్‌ను కోరారు. అందులోని అంశాలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. దీంతోపాటు, బలవంతంగా యాసిడ్ తాగిన వారికి రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం రూ.3 లక్షలు మాత్రమే పరిహారంగా అందజేస్తున్నాయని పిటిషనర్ తెలపగా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(నల్సా) నుంచి కూడా పరిహారం అందించే విషయం పరిశీలిస్తామన్నారు. అదేవిధంగా, జమ్మూకశ్మీర్, లద్దాఖ్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఐదు యాసిడ్ దాడి కేసులపై వేగవంతంగా విచారణ పూర్తి చేయాలని ఉత్తర్వు జారీ చేసింది.


