జమ్మలమడుగు: ఆట ఆడిస్తే తాట తీస్తానంటూ ఒక టీడీపీ సీనియర్ నాయకుడికి ఓ సీఐ సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఘటన జమ్మలమడుగు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. జూదం ఆడిస్తున్న టీడీపీ సీనియర్ నాయకుడిని ఓ సీఐ స్టేషన్‌కు పిలిపించారు. అతన్ని నిలుచోబెట్టి అరగంట పాటు మాటల తూటాలు పేల్చారు. నీవేమైనా పెద్ద మొగోడివి అనుకుంటున్నావా.. నీ కథ అంతా తెలుసు.. ఇలాగే ఆట ఆడిస్తే నీ సంగతి తేలుస్తా.. అంటూ హెచ్చరించారు.
నేను సీనియర్ నాయకుడిని.. నన్నే ఇన్నేసి మాటలు అంటావా.. కనీసం కూర్చోమని కూడా చెప్పవా.. అంటూ సదరు నేత ఏదో చెప్పబోతుండగా.. నిలబడే మాట్లాడు.. ఏం నీ కత.. అంటూ ఆ సీఐ గద్దించడంతో ఆ నాయకుడు బిత్తరపోయాడు. నీవు రమ్మంటే నేను వచ్చాను.. నువ్వు అలా మాట్లాడొద్దు అంటూ ఆ నేత సీఐతో అన్నాడు. ఆ తర్వాత తనకు జరిగిన చేదు అనుభవాన్ని ఆ నాయకుడు తన పార్టీ ముఖ్య నేతల దృష్టికి తీసుకెళ్లడంతో వారు సీఐకి ఫోన్ చేసి నువ్వు మా స్టేషన్‌కు పనికిరావు.. ఎక్కడికైనా వెళ్లిపో అంటూ బెదిరించినట్లు తెలిసింది.


