బస్సులో అందరి ముందు బాలికపై దాడి చేసిన విద్యార్థి
ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పోలీసులు మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం
ఎనిమిది రోజులు మృత్యువుతో పోరాడి మృతి చెందిన విద్యార్థిని
ఆ చిన్నారి భవిష్యత్‌పై ఎన్నో కలలు కనింది. బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకుంది. తనకోసం రేయింబవళ్లు కష్టపడుతున్న తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనుకుంది. అందుకే వ్యయప్రయాసల కోర్చి ధర్మవరానికి వెళ్లి మరీ చదువుకునేది. కానీ బస్సులో ఓ విద్యార్థి తనకు చేసిన అవమానాన్ని తట్టుకోలేక ఉరివేసుకున్న ఆ విద్యార్థిని ఎనిమిది రోజులు మృత్యువుతో పోరాడి అలసిపోయింది. బుధవారం సాయంత్రం జీవితాన్ని ముగించింది.
సత్యసాయి జిల్లా: మండల పరిధిలోని పులేటిపల్లికి చెందిన స్పందన(17) ధర్మవరంలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. రోజూ గ్రామం నుంచి ధర్మవరానికి బస్సులో వెళ్లి వచ్చేది. ఈ క్రమంలో ఎనిమిది రోజుల క్రితం కళాశాలకు బస్సులో వెళ్తున్న క్రమంలో ఓ విద్యార్థి ఆమెతో ఆసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె అతన్ని మందలించింది. దీంతో ఆ విద్యార్థి బస్సులో ప్రయాణికుల ముందే స్పందనపై రెండుసార్లు దాడి చేశాడు. ఘటనపై స్పందన ధర్మవరం పట్టణంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా.... పోలీసులు తమ పరిధిలోకి రాదని తప్పించుకున్నారు.
చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేయగా...అతడిని పిలిపించి మందలిస్తామన్నారు. ఓ బాలికపై భౌతిక దాడి చేస్తే మందలిస్తారా...అంతేనా..అని బాధపడిన చిన్నారి ఇంటికి వెళ్లి ఉరి వేసుకుంది. కుటుంబీకులు గమనించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఎనిమిది రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటం చేసిన బాలిక చివరకు మృత్యువు ఒడిలోకి చేరింది. కుమార్తె మృతితో తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించినట్లుగా యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


