రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (ADAG) ఛైర్మన్ అనిల్ అంబానీ బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన వ్యక్తిగత ఖాతాలు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) లోన్ ఖాతాలను ‘ఫ్రాడ్’ వర్గీకరించిన నిర్ణయాన్ని సమర్థించిన బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ అప్పీల్ గత వారం చివరిలో దాఖలు చేయబడినప్పటికీ కేసు ఇంకా అత్యున్నత న్యాయస్థానంలో విచారణకు రాలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. అంబానీ గ్రూప్‌పై బ్యాంకులు, దర్యాప్తు సంస్థల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ తాజా న్యాయపరమైన చర్య తీసుకున్నట్లు తెలుస్తుంది.
కేసు వివరాలు
ఎస్‌బీఐ ఈ ఏడాది జూన్‌లో ఆర్‌కామ్ లోన్ ఖాతాలను ‘ఫ్రాడ్’ గుర్తించింది. రుణ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించింది. దీనివల్ల బ్యాంకుకు రూ.2,929.05 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది. అయితే దీనిపై అనిల్ అంబానీ స్పందిస్తూ, ఎస్‌బీఐ సహజ న్యాయ సూత్రాలను పాటించలేదని, విచారణ అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని పిటిషన్‌లో తెలిపారు.
బాంబే హైకోర్టు తీర్పు
అక్టోబర్ 3, 2025న బాంబే హైకోర్టులోని జస్టిస్ రేవతీ మోహిటే డేరే, నీలా గోఖలేల డివిజన్ బెంచ్ అంబానీ పిటిషన్‌ను తిరస్కరించింది. ఎస్‌బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాస్టర్ డైరెక్షన్స్‌ను పాటించిందని, అంబానీ కంపెనీ ప్రమోటర్‌గా, కంట్రోలింగ్ పర్సన్‌గా ఫలితాలను ఎదుర్కోవాల్సిందేనని తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో అంబానీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఇతర బ్యాంకులు
ఎస్‌బీఐతో పాటు ఐడీబీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ఇతర బ్యాంకులు కూడా ఆర్‌కామ్ ఖాతాలను ‘ఫ్రాడ్’గా వర్గీకరించాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 2025లో రూ.400 కోట్లకు సంబంధించిన ఆరోపణలపై షోకాజ్ నోటీసు జారీ చేసింది.
దర్యాప్తు సంస్థల దూకుడు
ఎస్‌బీఐ ఫిర్యాదు ఆధారంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆగస్టు 21, 2025న కేసు నమోదు చేసి రూ.2,929 కోట్ల మోసానికి సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఆర్‌కామ్, అంబానీ నివాసం సహా పలు ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సెప్టెంబర్ 2025లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎమ్‌ఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసింది. నవంబర్ 2025లో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఓ) కూడా నిధుల మళ్లింపు, గవర్నెన్స్ లోపాలపై విచారణ ప్రారంభించింది.
ఇదీ చదవండి: భవిష్యత్ యుద్ధాలు ‘చిట్టి’లతోనే!


