మహిళలకు దక్కని ప్రాధాన్యం
కంపెనీల సిబ్బందిలో మహిళలకు మరింత ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా లిస్టెడ్ సంస్థల్లో వారి వాటా అంతంత మాత్రంగానే ఉంటోంది. ఎన్‌ఎస్‌ఈలో లిస్టయిన దాదాపు సగం కంపెనీల్లో (52 శాతం) ఉద్యోగినుల సంఖ్య 10 శాతం లోపే ఉంది. స్వచ్ఛంద సంస్థ ఉదైతీ విడుదల చేసిన ’సీజీజీ డ్యాష్‌బోర్డ్ 2024–25’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఎన్‌ఎస్‌ఈలో లిస్టయిన 1,386 కంపెనీల బాధ్యతాయుత వ్యాపారం, పర్యావరణహిత కార్యకలాపాల నివేదికలు (బీఆర్‌ఎస్‌ఆర్), సంస్థల వార్షిక నివేదికల ఆధారంగా ఈ రిపోర్ట్ రూపొందింది. వివిధ రంగాలవ్యాప్తంగా మహిళలు .. పురుషుల ప్రాతినిధ్యం, జీతాల్లో అంతరాలు, నాయకత్వ స్థానాల్లో సమ్మిళితత్వం, అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) తదితర అంశాలను ఇందులో పరిశీలించారు.
‘సిబ్బందిలో మహిళల ప్రాతినిధ్యం గత అయిదేళ్లుగా స్థిరంగా పెరుగుతోంది. అయినప్పటికీ ఈ ఏడాది గణాంకాలు చూస్తుంటే అది అంత వేగంగా పెరగడం లేదని తెలుస్తంది. ఎన్‌ఎస్‌ఈలో లిస్టయిన 2,615 సంస్థల్లో కేవలం సగం మాత్రమే లింగ ప్రాతినిధ్య డేటాను ఇస్తున్నాయి కాబట్టి మన ముందు ప్రస్తుతం ఉన్నది పాక్షిక ముఖ చిత్రమే‘ అని ఉదైతీ వ్యవస్థాపక సీఈవో పూజా శర్మ గోయల్ తెలిపారు.
రిపోర్ట్‌లో మరిన్ని విశేషాలు..
మొత్తం ఉద్యోగుల సంఖ్య 6 శాతం పెరగ్గా, మహిళా ఉద్యోగుల సంఖ్య 7 శాతం పెరిగింది. మరింత మంది మహిళలు ఉద్యోగాల్లో చేరుతున్నప్పటికీ నిర్దేశిత లక్ష్యాల స్థాయిలో వారి వాటా పెరగడం లేదు.
ఆసుపత్రులు, ప్రయోగశాలల్లో మహిళల ప్రాతినిధ్యం 45 శాతం నుంచి 48 శాతానికి, వినియోగదారుల సర్వీసుల్లో 30 % నుంచి 34 శాతానికి పెరగ్గా, ఐటీ (34 శాతం), బ్యాంకింగ్ (26 శాతం)లో పెద్దగా మార్పు నమోదు కాలేదు.
మహిళలు, పురషుల జీతాల మధ్య వ్యత్యాసం 2024, 2025 ఆర్థిక సంవత్సరాల్లో 6.7 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గింది. అయితే, మహిళల ప్రాతినిధ్యం ఎక్కువే ఉన్నప్పటికీ టెక్స్‌టైల్స్ (30.4 శాతం), డైవర్సిఫైడ్ (28.5 శాతం), మెటల్స్ .. మైనింగ్ (17 శాతం)లో మాత్రం వ్యత్యాసరం ఎక్కువగానే ఉంటుంది. మరోవైపు పురుషాధిక్యం ఎక్కువగా ఉండే కొన్ని రంగాల్లో జీతాల మధ్య వ్యత్యాసం రివర్స్‌లో ఉంది. పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా ఆర్జిస్తున్న రంగాల్లో ఫార్మా (8 శాతం), కన్జూమర్ డ్యూరబుల్స్ (7 శాతం) ఉన్నాయి.
లైంగిక వేధింపుల నివారణ నిబంధనలు (పీవోఎస్‌హెచ్) గురించి అవగాహన పెరుగుతోంది. పని ప్రదేశాల్లో సహోద్యోగుల తప్పుడు ప్రవర్తనపై ఫిర్యాదు చేసేందుకు మహిళలు ధైర్యంగా ముందుకొస్తున్నారు. లైంగిక వేధింపు ఫిర్యాదులు 16 శాతం పెరగడం ఇందుకు నిదర్శనం. అయితే, ఫిర్యాదుల స్థాయిలో పరిష్కారాల వేగం ఉండటం లేదు. పెండింగ్ కేసులు 28 శాతం దీన్ని సూచిస్తంది.
ఈ నేపథ్యంలో భద్రత, సమాన అవకాశాలు, వర్క్‌ప్లేస్ డిజైన్ విషయాల్లో వ్యవస్థాగతంగా ఉన్న అవరోధాలను అధిగమించే దిశగా ఇటీవలి లేబర్ కోడ్ ముందడుగులాంటిది. వీటిని మార్చుకోగలిగి, స్మార్ట్ విధానాలను అమలు చేస్తే, ప్రభుత్వం..కంపెనీలు చొరవ చూపితే మరింత మంది మహిళలు ఆర్థిక కార్యకలాపాల్లో పాలుపంచుకునే ప్రక్రియ వేగవంతం అవుతుంది.


