ఆర్థిక వ్యవస్థలు డిజటల్‌గా మారుతుండడం, క్రిప్టో, స్టెబుల్ కాయిన్లు తరహా కొత్త ఆర్థిక ఉత్పత్తులు పుట్టుకొస్తుండడంతో.. వీటి కారణంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాల మధ్య సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
లబ్ధిదారుల వివరాలు, పన్నుల సమాచారాన్ని సకాలంలో పంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఇందుకోసం కృత్రిమ మేథ (ఏఐ) వంటి సాధనాలను వినియోగించుకోవాలని, దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమన్నారు. ఇందుకు వీలుగా అంతర్జాతీయ ఫోరమ్ కోసం మంత్రి సీతారామన్ పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రమాణాలను మరింత బలోపేతం చేయడంతోపాటు పంచుకున్న సమాచారం ఆధారంగా ఫలితాలు సాధించేందుకు ఇది అవసరమని అభిప్రాయపడ్డారు.
ఢిల్లీలో మంగళవారం 18వ గ్లోబల్ ఫోరమ్ ప్లీనరీ సమావేశాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి సీతారామన్ మాట్లాడారు. ఏ ఒక్క దేశం తనంతట తాను ఈ సవాళ్లను పరిష్కరించలేదన్నారు. సహకారం, విశ్వాసం, సకాలంలో సరైన సమాచారం పంచుకోవడం అవసమరన్నారు. స్పష్టమైన నిబంధనల మేరకు నడుచుకుంటే పన్నుల్లో పారదర్శకత, కచ్చితత్వం ఉంటుందన్నారు.
గడిచిన దశాబ్ద కాలంలో దేశంలో స్వచ్చంద నిబంధనల అమలు మెరుగుపడినట్టు మంత్రి చెప్పారు. సకాలంలో సమాచారాన్ని గుర్తించేందుకు ఏఐ తరహా టెక్నాలజీలు అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. ఆవిష్కరణలు అన్నవి జవాబుదారీగా ఉండాలంటూ.. ఇవి వ్యవస్థలకు బలాన్ని, విశ్వసనీయతను తెచ్చిపెట్టే విధంగా ఉండాలన్నారు.
రహస్య సమాచారం..
డేటా గోప్యతకు సంబంధించి బలమైన వ్యవస్థల దిశగా దేశాలు కలసి పనిచేయాలని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రెవెన్యూ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ పిలుపునిచ్చాన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పంచుకునే సమాచారాన్ని సమర్థవంతంగా వినియోగించు కోవాలన్నారు.


