బడ్జెట్ విషయంలో అభిప్రాయాల సేకరణ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఢిల్లీలో మౌలిక రంగం, ఇంధన రంగాలకు చెందిన నిపుణులతో భేటీ అయ్యారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026–27) బడ్జెట్‌పై వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆఫ్కాన్స్ ఎండీ ఎస్.పరమశివన్, షాపూర్జీ పల్లోంజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్ డైరెక్టర్ మనీష్ త్రిపాఠి, జీఎంఆర్ గ్రూప్ డిప్యూటీ ఎండీ కె.నారాయణరావు, జేఎం బక్సి గ్రూప్ డైరెక్టర్ సందీప్ వాద్వా, ఇన్‌ఫ్రా విజన్ ఫౌండేషన్ సీఈవో జగదన్‌షా తదితర కంపెనీల సారథులు ఇందులో పాల్గొన్నారు.
దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై ఒక పోస్ట్ పెట్టింది. ‘‘ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి సీతారామన్ రానున్న 2026–27 కేంద్ర బడ్జెట్‌కు సంబంధించి 11వ ముందస్తు సమావేశాన్ని ఇన్‌ఫ్రా, ఇంధన రంగాల నిపుణులతో నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యుత్ శాఖ, షిప్పింగ్ శాఖల కార్యదర్శులు, రైల్వే బోర్డ్ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు హాజరయ్యారు’’అని ఆర్థిక శాఖ తన పోస్ట్‌లో వెల్లడించింది.
కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ 2026–27 బడ్జెట్‌ను 2026 ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా వాణిజ్య అనిశి్చతుల నేపథ్యంలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు ప్రాధాన్యం నెలకొంది. డిమాండ్, ఉపాధి కల్పనను పెంచడం, దేశ జీడీపీని 8 శాతం వృద్ధి రేటుకు చేర్చడం వంటి ప్రధాన సవాళ్లు ఆర్థిక మంత్రి ముందున్నాయి. వ్యవసాయం, ఎంఎస్‌ంఎఈలు, ఆరోగ్య సంరక్షణ, క్యాపిటల్ మార్కెట్ రంగాల ప్రతినిధులు, ప్రముఖ ఆర్థికవేత్తలతో ఇప్పటి వరకు బడ్జెట్ ముందస్తు సమావేశాలు నిర్వహించడం గమనార్హం.


