వెనెజువెలా భవిష్యత్తుపై ట్రంప్ తన ప్లాన్‌ను ప్రకటించారు. ఆదేశంలో ఇప్పట్లో ఎన్నికలు ఉండవని తెలిపారు. ప్రస్తుతం ఆ దేశంలో శాంతియుత పరిస్థితులు నెలకొనాలని మౌళిక సదుపాయాలు, సంస్థాగత నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. వెనెజువెలా బాధ్యత ఎవరూ చూసుకుంటారు అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఇట్స్..మీ అని ట్రంప్ బదులిచ్చారు.
కొద్దిరోజుల క్రితం వెనెజువెలాపై యుఎస్ దాడి చేసి.. అక్కడి అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెనెజువెలా తదుపరి అధ్యక్షుడు ఎవరు? అక్కడి పాలన, తదితర పరిస్థితులు, ఎన్నికల నిర్వహణ తదితర విషయాలపై అందరిలోనూ సందేహాలు నెలకొన్నాయి. అయితే ఆ దేశ భవిష్యత్తుపై ట్రంప్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఆ దేశంలో ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ లేదని తెలిపారు.
ట్రంప్ మాట్లాడుతూ.. "మనం మెుదటగా దేశాన్ని సరిచేయాలి, ప్రజలు ఓటు వేయలేని పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించకూడదు. ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలి. ఇక్కడి ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరించేలా యుఎస్ ఆయిల్ కంపెనీలు ప్రధాన పాత్ర వహిస్తాయి. మెుదటగా యుఎస్ ఆయిల్ కంపెనీలు వెనెజువెలాలో పెట్టుబడులు పెడతాయి. అనంతరం ఆ మెుత్తాన్ని దాని రెవెన్యూ ద్వారా రీయంబర్స్‌మెంట్ చేసుకుంటాయి." అని అన్నారు.
ఈ వ్యవస్థ మెుత్తం సెట్ కావడానికి 18 నెలల వరకూ సమయం పడుతుందని ట్రంప్ తెలిపారు. వెనెజువెలాతో అమెరికా యుద్ధం చేయబోతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని డ్రగ్స్ అమ్మేవారితో అమెరికా ఎప్పుడు యుద్ధం చేయదని తెలిపారు. ఆ దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు ఆదేశ నాయకత్వమే కారణమని తెలిపారు.
అయితే అక్కడే ఉన్న ఒక జర్నలిస్టు అంతిమంగా వెనెజువెలా ఛార్జ్ ఎవరు తీసుకుంటారు అని ప్రశ్నించగా ట్రంప్ దానికి బదులిస్తూ అది 'నేనే' అని తెలిపారు. తన సెక్రటరీ స్పానిష్ భాష చాలా బాగా మాట్లాడుతుందని ఆ వ్యవహారాలు తాను చూసుకుంటుందని తెలిపారు. ఒకవేళ వెనెజువెలాలో పరిస్థితులు అదుపులో లేకపోతే మరోసారి దాడి చేయడానికి యుఎస్ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ట్రంప్ హెచ్చరించారు.


