సింగిల్ విండో వ్యవస్థను ఏర్పాటు చేయాలి
అన్ని రాష్ట్రాల్లోనూ పరిశ్రమ హోదా ఇవ్వాలి
కేంద్ర ఆర్థిక శాఖకు పర్యాటక, ఆతిథ్య రంగం వినతి
న్యూఢిల్లీ: దేశంలో పర్యాటక రంగం దీర్ఘకాల అభివృద్ధి కోసం నేషనల్ టూరిజం బోర్డ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖను పరిశ్రమల ప్రతినిధులు కోరారు. అలాగే, మరింత మంది పర్యాటకులను ఆకర్షించేందుకు నిధుల మద్దతు అవసరమని స్పష్టం చేశారు. బడ్జెట్‌కు ముందు పర్యాటకం, ఆతిథ్య రంగాల ప్రతినిధులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం నిర్వహించారు.
ముఖ్యంగా పర్యాటకం–ఆతిథ్యానికి అన్ని రాష్ట్రాలూ పరిశ్రమ హోదా కలి్పంచేందుకు సహకరించాలని.. దీనివల్ల అందుబాటు ధరలపై రుణాలను పొందడం సాధ్యపడుతుందని ఈ రంగాల ప్రతినిధులు కోరారు. కొన్ని రాష్ట్రాలు పరిశ్రమ హోదా ఇవ్వగా, మరిన్ని రాష్ట్రాలు ఈ దిశగా నిర్ణయం తీసుకోవాల్సి ఉండంతో పరిశ్రమ ప్రతినిధులు కేంద్రం సహకారాన్ని ఆశించారు. పరిశ్రమ హోదా లేకపోవడం, సమన్వయం లేని నియంత్రణలు వృద్ధికి అడ్డు పడుతున్నట్టు చెప్పారు.
లైసెన్స్‌ల మంజూరు, హోటళ్లకు నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) దాఖలుకు వీలుగా సింగిల్ విండో అనుమతుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్, ఇండియా ఫుడ్ టూరిజం ఆర్గనైజేషన్, టూరిస్ట్ గైడ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అడ్వెంచర్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, తదితర సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


