breaking news
Funding Allocation
-
ప్రభావిత దేశాలకు మరిన్ని నిధులు
బెలెమ్: బ్రెజిల్‌లోని బెలెమ్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి కాప్ 30 సదస్సు శనివారం ముగిసింది. వాతావరణ మార్పులతో తీవ్రంగా ప్రభావితమైన దేశాలకు మరిన్ని నిధులను కేటాయించేందుకు ఈ సదస్సులో దేశాల మధ్య అంగీకారం కుదిరింది. నష్టపోయిన దేశాలను ఆదుకోవాలని పిలుపునిచ్చింది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని క్రమంగా తగ్గించేందుకు ఉద్దేశించిన ప్రణాళికపై నిర్ణీత కాలావధిపై దేశాలమధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అదేవిధంగా, ఉద్గారాలను కట్టడి చేసేందుకు ఉద్దేశించిన చర్యలపైనా అంగీకారానికి రాలేకపో యాయి. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించుకునేందుకు కొలంబియాతో కలిసి రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తామని బ్రెజిల్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. కాప్ 30 ఆమోదించిన తీర్మానం మాత్రమే ప్రభావవంతమైందిగా ఉంటుందని పేర్కొంది. -
పర్యాటక రంగానికి జాతీయ బోర్డు ఉండాలి
న్యూఢిల్లీ: దేశంలో పర్యాటక రంగం దీర్ఘకాల అభివృద్ధి కోసం నేషనల్ టూరిజం బోర్డ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖను పరిశ్రమల ప్రతినిధులు కోరారు. అలాగే, మరింత మంది పర్యాటకులను ఆకర్షించేందుకు నిధుల మద్దతు అవసరమని స్పష్టం చేశారు. బడ్జెట్‌కు ముందు పర్యాటకం, ఆతిథ్య రంగాల ప్రతినిధులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా పర్యాటకం–ఆతిథ్యానికి అన్ని రాష్ట్రాలూ పరిశ్రమ హోదా కలి్పంచేందుకు సహకరించాలని.. దీనివల్ల అందుబాటు ధరలపై రుణాలను పొందడం సాధ్యపడుతుందని ఈ రంగాల ప్రతినిధులు కోరారు. కొన్ని రాష్ట్రాలు పరిశ్రమ హోదా ఇవ్వగా, మరిన్ని రాష్ట్రాలు ఈ దిశగా నిర్ణయం తీసుకోవాల్సి ఉండంతో పరిశ్రమ ప్రతినిధులు కేంద్రం సహకారాన్ని ఆశించారు. పరిశ్రమ హోదా లేకపోవడం, సమన్వయం లేని నియంత్రణలు వృద్ధికి అడ్డు పడుతున్నట్టు చెప్పారు. లైసెన్స్‌ల మంజూరు, హోటళ్లకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) దాఖలుకు వీలుగా సింగిల్ విండో అనుమతుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్, ఇండియా ఫుడ్ టూరిజం ఆర్గనైజేషన్, టూరిస్ట్ గైడ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అడ్వెంచర్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, తదితర సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
హెల్త్‌కేర్‌కు మరిన్ని నిధులు కావాలి
న్యూఢిల్లీ: ఆరోగ్య సంరక్షణకు జీడీపీలో 2.5 శాతం నిధులు కేటాయించాలని ఈ రంగానికి చెందిన అత్యున్నత మండలి ‘నాట్‌హెల్త్’ కేంద్ర ఆర్థిక శాఖను కోరింది. నాన్ కమ్యూనికేబుల్ వ్యాధుల (అంటు వ్యాధులు కానివి) నియంత్రణకు తక్షణ కార్యాచరణ అవసరమని సూచించింది. ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షలను ప్రోత్సహించాలంటూ.. ఇందులో భాగంగా ఒక్కో వ్యక్తికి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10వేల వరకు పన్ను మినహాయింపులు ఇవ్వాలని కోరింది. దేశంలో 65 శాతం మరణాలకు దీర్ఘకాలిక వ్యాధులు కారణం అవుతుండడంతో ప్రభుత్వం ముందు ఈ ప్రతిపాదన ఉంచింది. 2026–27 బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల్లో భాగంగా హెల్త్‌కేర్ తరఫున నాట్‌హెల్త్ కీలక సూచనలు చేసింది. ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడానికి, ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి, బీమా మరింత మందికి చేరువ అయ్యేందుకు, ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షలను ప్రోత్సహించేందుకు వీలుగా కార్యాచరణను సూచించినట్టు నాట్‌హెల్త్ ప్రకటించింది. 2025–26 బడ్జెట్లో ఆరోగ్య సంరక్షణ రంగానికి కేటాయింపులు 1.97 శాతంగా ఉన్నాయి. మరిన్ని నిధులను కేటాయించంతోపాటు, నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టాలని, ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంతో పటిష్టమైన, భవిష్యత్తుకు వీలైన ఆరోగ్య వ్యవస్థను నిర్మించాలని సూచించింది. ఆరోగ్య సంరక్షణను ‘కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’గా ప్రకటించి, రూ.50,000 కోట్లతో నిధిని ఏర్పాటు చేయాలని కోరింది. ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్స్ కేంద్రాల ఏర్పాటుకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరం కావడం, వీటికి దీర్ఘకాలిక రుణ అవకాశాలు పరిమితంగా ఉన్నట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. అలాగే, టెక్నాలజీ ఆవిష్కరణలకు రూ.5,000–7,000 కోట్లతో నిధిని ఏర్పాటు చేయాలని కూడా కోరింది. -
వ్యవసాయంలో పరిశోధనలను ప్రోత్సహించాలి
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో పెరిగిపోతున్న వాతావరణ పరమైన సవాళ్లను అధిగమించేందుకు వీలుగా పరిశోధన, అభివృద్ధికి (ఆర్అండ్డీ) మరిన్ని నిధుల సాయం అందించాలంటూ కేంద్ర ఆర్థిక శాఖకు నిపుణులు సూచించారు. ఈ దిశగా విధానపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన బడ్జెట్ ముందస్తు సమావేశంలో వ్యవసాయ రంగం, ఆర్అండ్డీ సంస్థల నుంచి 12 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగం ప్రస్తుత స్థాయి నుంచి మరింత ప్రగతి సాధించేందుకు వీలుగా తీసుకోవాల్సిన చర్యల గురించి వారు తమ సూచనలు అందించారు. వ్యవసాయరంగ కార్యదర్శి దేవేష్ చౌదరి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ ఎంఎల్ జట్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం సానుకూలంగా జరిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వ్యవసాయం, అనుబంధ రంగాలు ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను నిపుణులు ప్రస్తావించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్య క్రమంలో చర్యలు తీసుకోవాలని కోరినట్టు వెల్లడించాయి. వ్యవసాయంలో ఆర్‌అండ్‌డీకి వాస్తవ నిధుల కేటాయింపులు గత రెండు దశాబ్దాల కాలంలో తగ్గినట్టు ఈ సమావేశంలో పాల్గొన్న భారత్ క్రిషక్ సమాజ్ చైర్మన్ అజయ్ వీర్ జఖార్ తెలిపారు. పంటల బీమాను తిరిగి సమీక్షించాలని, చాలా మంది రైతులు దీని విషయంలో అసంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు. వ్యవసాయ ముడి పదార్థాల విక్రయ వివరాలను వర్తకులు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసే విధానం ఉండాలని కోరారు. అలాగే, కనీస మద్దతు ధరలను ప్రకటిస్తున్న పంట ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు విధించాలని అభిప్రాయపడ్డారు.ప్రముఖ ఆర్థికవేత్తలతోనూ భేటీ మరోవైపు ప్రముఖ ఆర్థికవేత్తలైన సాజిద్ చినాయ్, నీల్కాంత్ మిశ్రా, ధర్మకృతి జోషి, రిధమ్ దేశాయ్, సోనల్ వర్మ, ఇందిరా రాజారామన్ తదితరులతోనూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. 2026–27 బడ్జెట్‌కు సంబంధించి ప్రముఖ ఆర్థికవేత్తలతో ఇది తొలి సమావేశమని ఆర్థిక శాఖ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై ప్రకటించింది. -
వేగంగా వృద్ధి సాధిస్తాం
ముంబై: తమ దగ్గర నిధుల సౌలభ్యం ఉందని, ఈ ఏడాది చివరిలో భారీ సంఖ్యలో (మూడు అంకెల) విమానాలకు ఆర్డర్ చేయగలమని ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దూబే ప్రకటించారు. చాలా వేగంగా వృద్ధి చెందే సామర్థ్యాలున్నట్టు చెప్పారు. ఈ సంస్థను ప్రముఖ ఇన్వెస్టర్ రాకేశ్ జున్‌జున్‌వాలా స్థాపించడం గమనార్హం. వచ్చే నెలతో సంస్థ కార్యకలాపాలకు ఏడాది పూర్తి కానుంది. ఈ కాలంలో తాము అంచనాలను మించినట్టు దూబే తెలిపారు. ప్రస్తుతం ఈ సంస్థ వద్ద 19 విమానాలు ఉండగా, మరొకటి ఈ నెలలోనే అందుబాటులోకి రానుంది. దీంతో అంతర్జాతీయ సరీ్వసులు సైతం ప్రారంభించడానికి వీలు కలగనుంది. మూడు అంకెల విమానాల ఆర్డర్లు, అంతర్జాతీయ సేవల ప్రారంభం ఈ ఏడాదిలో ఉంటాయని దూబే చెప్పారు. ఈ సంస్థ 76 విమానాలకు గత నెలలో ఆర్డర్లు ఇవ్వడం తెలిసిందే. మార్కెట్లో పోటీ పెరగడంతో ఇండిగో, ఎయిర్ ఇండియా ఒకవైపు పెద్ద సంఖ్యలో విమానాలకు ఆర్డర్లు ఇవ్వడాన్ని ప్రస్తావించగా.. తాము ఏదీ కూడా స్వల్పకాల దృష్టితో చేయబోమని దూబే స్పష్టం చేశారు. తాము వృద్ధి కోసం పరుగులు పెట్టడం కాకుండా, స్థిరత్వానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ‘‘ఇప్పటి నుంచి 2027 మార్చి నాటికి 76 ఎయిర్‌క్రాఫ్ట్‌లు మాకు అందుబాటులోకి వస్తాయి. ఉజ్వలమైన దేశీయ మార్కెట్, పలు అంతర్జాతీయ మార్గాలకు సరీ్వసులతో, ఎక్కువ మంది కస్టమర్ల సంతృప్తి పొందే ఎయిర్‌లైన్ సంస్థగా ఉంటాం’’అని దూబే చెప్పారు. అధికారిక గణాంకాల ప్రకారం మే నెలలో దేశీ మార్గాల్లో ఆకాశ ఎయిర్ 4.8 శాతం వాటాను సంపాదించింది. స్వర్ణయుగం.. వచ్చే రెండు దశాబ్దాల కాలం ఏవియేషన్ చరిత్రలో స్వర్ణయుగంగా నిలిచిపోతుందని దూబే అన్నారు. వచ్చే 15–20 ఏళ్లలో సుమారు 2,000 విమాన సరీ్వసులు, పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ‘‘ప్రస్తుతం మేమున్న స్థితి పట్ల ఎంతో సంతోíÙస్తున్నాం. ఎంతో వృద్ధి చూడనున్నాం. మేము చిన్న సంస్థగా ఉన్నాం. కనుక మరింత వేగంగా వృద్ధి చెందే సామర్థ్యాలు మాకున్నాయి. ఒక్కసారి మా విమానాల సంఖ్య 20కు చేరితే అంతర్జాతీయ సరీ్వసులు ఆరంభించేందుకు అర్హత లభిస్తుంది. 120 ఏళ్ల విమానయాన చరిత్రలో సున్నా నుంచి 19 విమానాలకు మా అంత వేగంగా చేరుకున్నది మరొకటి లేదు. గత ఏడాదిలో మేము సాధించిన ప్రగతి పట్ల సంతోíÙస్తున్నాం’’అని దూబే వివరించారు. తాము ఉద్యోగులను పెంచుకుంటున్నామని చెబుతూ, 2023 చివరికి 3,500 మంది ఉద్యోగులను కలిగి ఉంటామని పేర్కొన్నారు. -
‘ఉపాధి’కి తగ్గిన బడ్జెట్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో లబ్ధి పొందుతున్న కుటుంబాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రతి ఏటా తగ్గుతున్న నిధుల కేటాయింపులకు తోడు ఆధార్ అనుసంధానిత చెల్లింపులు, ఆన్లైన్ హాజరు వంటి చర్యలతో పథకం కింద పనిచేసే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. కోవిడ్ సమయంలో సొంతూళ్లకు తిరిగి వచ్చిన వలసదారులకు ప్రధాన ఆర్థిక భద్రతగా ఉంటూ ఆసరాగా నిలిచిన ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య 2021 ఆర్ధిక సంవత్సరం నుంచి తగ్గుతూ వస్తోంద కేంద్ర గణాంకాలు చాటుతున్నాయి. కోవిడ్ సమయంలో 2020–21లో రికార్డు స్థాయిలో 7.55 కోట్ల కుటుంబాలు దీనిద్వారా ఉపాధి పొందాయి. ఆ తర్వాత 2021–22 వచ్చేసరికి ఈ సంఖ్య 7.25కోట్లకు తగ్గింది. 2022–23 నాటికి 6.19 కోట్లకు పడిపోయింది. తగ్గిన కుటుంబాలకు తోడు పనిదినాల సంఖ్య కుచించుకుపోవడం ఆందోళనకరం. 2020–21లో సగటు పనిదినాల సంఖ్య 51.42 రోజులుకాగా, ఆ సంఖ్య 2022–23 ఏడాదికల్లా 47.84 రోజులకు పడిపోయింది. 2021–22లో కేంద్ర బడ్జెట్లో ఈ పథకానికి రూ.98,467కోట్లు కేటాయించారు. 2022–23లో ఆ కేటాయింపులు కేవలం రూ.89వేల కోట్లకు పరిమితమయ్యాయి. ఈసారి బడ్జెట్లో కేవలం రూ.60వేల కోట్లే విదిల్చేందుకు సిద్ధమైంది. బడ్జెట్‌లేక పనిదినాలను కుదిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. -
పురోగతికి నిధులు కావాల్సిందే
న్యూఢిల్లీ: వృద్ధికి, దేశ నిర్మాణానికి నిధులు తప్పనిసరి అని అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత రీసోర్సెస్ పేర్కొంది. వృద్ధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని, చెల్లింపుల సామర్థ్యం ఆధారంగానే కంపెనీలు, వ్యక్తులు, ప్రభుత్వాలు రుణాలు తీసుకుంటాయనే విషయాన్ని గుర్తు చేసింది. నిర్వహణ పరిమితుల్లోపే రుణాలను కట్టడి చేస్తామని, ఈ విషయంలో ఇన్వెస్టర్ల సమూహాన్ని ఒప్పించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు రుణాలను సకాలంలో చెల్లించిన చరిత్రను ప్రస్తావించింది. పూర్తి చెల్లింపులకు తగిన సామర్థ్యం ఉన్నట్టు స్పష్టం చేసింది. 2023 మార్చి నాటికి తీర్చాల్సిన రుణాలకు ముందే చెల్లింపులు చేసినట్టు వేదాంత రీసోర్సెస్ తెలిపింది. గడిచిన 11 నెలల్లో 2 బిలియన్ డాలర్ల రుణాలను తగ్గించుకున్నట్టు వివరించింది. 2023 జూన్‌తో ముగిసే త్రైమాసికం వరకు నిధుల అవసరాలను చేరుకోగలమని విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. సంస్థ చరిత్రలో ఇప్పటి వరకు 35 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించగా, వాటన్నింటికీ సకాలంలో చెల్లింపులు చేసినట్టు ప్రకటించింది. అధిక నగదు ప్రవాహాలను తెచ్చిపెట్టే బ్రహ్మాండమైన ఆస్తులు ఉన్నాయంటూ నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం చేస్తున్న విస్తరణతో సమీప భవిష్యత్తులో ఆదాయం 30 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ‘‘వేదంతా కంపెనీలు అన్నీ కూడా టాప్ సీఈవోల ఆధ్వర్యంలో నిపుణులతో నిర్వహిస్తున్నవి. అధిక వృద్ధి అవకాశాలతో, తక్కువ నిర్వహణ వ్యయాలతో వేదాంతా గ్రూప్ వ్యాపారాలను నిర్వహిస్తోంది. భారత్ ఆర్థిక పురోగతిలో మేము కూడా భాగస్వాములు అవుతాం’’అని లింక్డ్ఇన్ పోస్ట్‌లో వేదాంత రీసోర్సెస్ పేర్కొంది. వేదాంత లిమిటెడ్ ప్రమోటర్ సంస్థకు భారీ రుణాలు ఉండడంతో.. అదానీ తర్వాత వేదాంతా గ్రూపు రుణ సమస్యలు ఎదుర్కోనుందంటూ ఆందోళనలు వస్తున్న నేపథ్యంలో ఈ పోస్ట్ విడుదల చేయడం గమనార్హం. -
బకాయిలొచ్చాయ్..
- ఆర్‌డబ్ల్యూఎస్‌కు రూ. 1.25కోట్లు విడుదల - ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు - పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు సిద్ధమవుతున్న అధికారులు సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగానికి ఊరట లభించింది. గత వేసవిలో తాగునీటి సమస్యల పరిష్కారానికి చేపట్టిన పనులకు సంబంధించి నిధులు విడుదలయ్యాయి. వాస్తవానికి గత ఏడాదే ఈ నిధులు మంజూరయ్యాయి. అప్పట్లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ రాష్ట్ర విభజన ప్రక్రియతో జిల్లాకు రావాల్సిన ఈ నిధులు నిలిచిపోయాయి. తాజాగా ఈ నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా ప్రభుత్వం జిల్లా ఆర్డబ్ల్యూఎస్ విభాగానికి రూ.1.25 కోట్లను కలెక్టర్ ఖాతాలో జమ చేసింది. 2014-15 సంవత్సరంలో వేసవిలో తాగునీటి సమస్యలనెదుర్కొనేందుకు ఆర్డబ్ల్యూఎస్ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ట్యాంకర్ల ద్వారా నీటి, ప్రైవేట్ బోర్లు అద్దెకు తీసుకోవడం, ప్రస్తుతమున్న బోర్లు ఫ్లషింగ్తో పాటు లోతు పెంచడం, బోరుమోటార్ల మరమ్మతులు తదితర పనుల్ని సీఆర్ఎఫ్ (విపత్తు నివారణ నిధి) కింద చేపట్టారు. దాదాపు రూ.1.21కోట్లతో పనులు పూర్తిచేశారు. పనులు పూర్తయిన వెంటనే బిల్లులు చెల్లించాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల కాలేదు. మరోవైపు రాష్ట్ర విభజన ప్రక్రియతో ఈ ఫైలు అటకెక్కింది. ఒకవైపు పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లు నిధులకోసం అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో జిల్లా కలెక్టర్ ఈ నిధుల విడుదల కోసం ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం బకాయిల విడుదలకు పచ్చజెండా ఊపింది. ఇందులో భాగంగా మంగళవారం రూ.1.25కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. గత బకాయిలు చెల్లించినప్పటికీ ఆర్డబ్ల్యూస్కు కొంత అదనపు నిధులు వలిసివచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రస్తుత అవసరాలకు వాటిని వినియోగించనున్నట్లు ఆ శాఖ ఇంజినీరు ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు.


