జీడీపీలో 2.5 శాతానికి పెంచాలి
వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ప్రోత్సాహకాలు
కేంద్ర ఆర్థిక శాఖకు నాట్‌హెల్త్ సూచన
న్యూఢిల్లీ: ఆరోగ్య సంరక్షణకు జీడీపీలో 2.5 శాతం నిధులు కేటాయించాలని ఈ రంగానికి చెందిన అత్యున్నత మండలి ‘నాట్‌హెల్త్’ కేంద్ర ఆర్థిక శాఖను కోరింది. నాన్ కమ్యూనికేబుల్ వ్యాధుల (అంటు వ్యాధులు కానివి) నియంత్రణకు తక్షణ కార్యాచరణ అవసరమని సూచించింది. ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షలను ప్రోత్సహించాలంటూ.. ఇందులో భాగంగా ఒక్కో వ్యక్తికి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10వేల వరకు పన్ను మినహాయింపులు ఇవ్వాలని కోరింది.
దేశంలో 65 శాతం మరణాలకు దీర్ఘకాలిక వ్యాధులు కారణం అవుతుండడంతో ప్రభుత్వం ముందు ఈ ప్రతిపాదన ఉంచింది. 2026–27 బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల్లో భాగంగా హెల్త్‌కేర్ తరఫున నాట్‌హెల్త్ కీలక సూచనలు చేసింది. ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడానికి, ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి, బీమా మరింత మందికి చేరువ అయ్యేందుకు, ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షలను ప్రోత్సహించేందుకు వీలుగా కార్యాచరణను సూచించినట్టు నాట్‌హెల్త్ ప్రకటించింది.
2025–26 బడ్జెట్‌లో ఆరోగ్య సంరక్షణ రంగానికి కేటాయింపులు 1.97 శాతంగా ఉన్నాయి. మరిన్ని నిధులను కేటాయించంతోపాటు, నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టాలని, ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంతో పటిష్టమైన, భవిష్యత్తుకు వీలైన ఆరోగ్య వ్యవస్థను నిర్మించాలని సూచించింది. ఆరోగ్య సంరక్షణను ‘కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’గా ప్రకటించి, రూ.50,000 కోట్లతో నిధిని ఏర్పాటు చేయాలని కోరింది. ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్స్ కేంద్రాల ఏర్పాటుకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరం కావడం, వీటికి దీర్ఘకాలిక రుణ అవకాశాలు పరిమితంగా ఉన్నట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. అలాగే, టెక్నాలజీ ఆవిష్కరణలకు రూ.5,000–7,000 కోట్లతో నిధిని ఏర్పాటు చేయాలని కూడా కోరింది.


