రియల్ ఎస్టేట్ రంగంలో ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (సంస్థాగత) గతేడాది పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. 8.47 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్టు కొలియర్స్ ఇండియా తెలిపింది. 2024లో వచ్చిన 6.56 బిలియన్ డాలర్ల కంటే 29 శాతం అధికమని పేర్కొంది. ఇందులో దేశీ పెట్టుబడులు గణనీయంగా పెరగ్గా, విదేశీ పెట్టుబడులు తగ్గాయి. దేశీ ఇన్వెస్టర్ల నుంచి 4.82 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.
2024లో దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 2.24 బిలియన్ డాలర్లతో పోల్చి చూస్తే 120 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. విదేశీ పెట్టుబడులు మాత్రం అంతకుముందు ఏడాదితో పోల్చితే 2025లో 16 శాతం తగ్గి 3.65 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ వివరాలతో కొలియర్స్ ఇండియా ఒక నివేదిక విడుదల చేసింది. సంస్థాగత ఇన్వెస్టర్లలో ఫ్యామిలీ ఆఫీసులు, విదేశీ కార్పొరేట్ గ్రూప్‌లు, విదేశీ బ్యాంక్‌లు, ప్రొప్రయిటరీ బుక్‌లు, పెన్షన్ ఫండ్స్, ప్రైవేటు ఈక్విటీ, రియల్ ఎస్టేట్ ఫండ్–డెవలపర్స్, ఎన్‌బీఎఫ్‌సీలు, రీట్‌లు, సావరీన్ వెల్త్ ఫండ్స్ ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది.
‘‘2025లో అధిక శాతం పెట్టుబడులను ఆఫీస్ ఆస్తులు ఆకర్షించాయి. మొత్తం పెట్టుబడుల్లో 54 శాతం (4.53 బిలియన్ డాలర్లు) ఆఫీస్ ఆస్తుల్లోకి వచ్చాయి. ఆ తర్వాత నివాస ప్రాజెక్టులు, పారిశ్రామిక, గోదాముల్లోకి వెళ్లాయి’’అని కొలియర్స్ ఇండియా ఎండీ, సీఈవో బాదల్ యాజ్ఙిక్ తెలిపారు. 2026లో సంస్థాగత పెట్టుబడులు మరింత బలపడతాయని, అంతర్జాతీయంగా పెట్టుబడులకు రిస్క్ ధోరణి పెరగడం, దేశీ ఇన్వెస్టర్లు ఇందుకు మద్దతుగా నిలవనున్నట్టు పేర్కొంది.


