నిబంధనలమేరకే అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పషీ్టకరణ
న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్‌ఐసీ స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై తమ శాఖ ఎలాంటి సలహాలివ్వదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అలాగే ఈ విషయంలో మార్గనిర్దేశం సైతం చేయదని తెలియజేశారు. అదానీ గ్రూప్ కంపెనీలలో ప్రామాణిక నిర్వహణా సంబంధ నిబంధనల (ఎస్‌వోపీ)మేరకే ఎల్‌ఐసీ వాటాల కొనుగోళ్లు చేపట్టినట్లు ఒక ప్రశ్నకు గాను లోక్‌సభకి ఇచి్చన రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. టాప్ ర్యాంక్ బీమా దిగ్గజం అనేక సంవత్సరాలుగా ఆయా కంపెనీల ఆర్థిక మూలాలు (ఫండమెంటల్స్) ఆధారంగానే పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు.
కంపెనీలపై పూర్తిస్థాయి పరిశీలన చేపట్టాక మాత్రమే స్టాక్స్ కొనుగోళ్లు చేపడుతుందని వివరించారు. వెరసి ఎస్‌వోపీల ప్రకారం తగిన పరిశీలనతోపాటు.. రిసు్కలపై అధ్యయనం చేశాక అదానీ గ్రూప్‌లోని ఆరు కంపెనీలలో ఎల్‌ఐసీ ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అదానీ గ్రూప్ కంపెనీల పుస్తక విలువ రూ. 38,659 కోట్లుకాగా.. సంబంధిత కంపెనీల రుణ పత్రాలలోనూ మరో రూ. 9,626 కోట్లవరకూ పెట్టుబడులు చేపట్టినట్లు తెలియజేశారు. ఎల్‌ఐసీ ఫండ్ చేపట్టే పెట్టుబడి నిర్ణయాలపై ఆర్థిక శాఖ ఎలాంటి సూచనలు లేదా సలహాలు ఇవ్వబోదని, స్టాక్ కొనుగోళ్లలో ఎలాంటి ప్రమేయం ఉండదని పేర్కొన్నారు.
చట్టాల ప్రకారమే ...
ఎల్‌ఐసీ ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయాలు ఎప్పటికప్పుడు 1938 బీమా చట్టం, ఐఆర్‌డీఏఐ నియంత్రణలు, ఆర్‌బీఐసహా.. సెబీ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయని ఆర్థిక మంత్రి సీతారామన్ వివరించారు. అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసీ పెట్టుబడులకు వీలుగా ఆర్థిక శాఖ అధికారులు ఒక ప్రణాళికను రూపొందించినట్లు అక్టోబర్‌లో వాషింగ్టన్ పోస్ట్‌లోని ఒక నివేదిక ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో రుణభారంతోపాటు.. యూఎస్‌లో నిశిత పరిశీలనను ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసీ పెట్టుబడులకు ఆర్థిక శాఖ అధికారులు ఒక ప్రణాళికను అమలు చేసినట్లు నివేదిక ఆరోపించింది.
2025 మే నెలలో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్‌లో ఎల్‌ఐసీ 57 కోట్ల డాలర్లు (సుమారు రూ. 5,000 కోట్లు) ఇన్వెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి సీతారామన్ వివరణకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. ఎస్‌వోపీలు, బోర్డు అనుమతులతో 2025 మేలో ఎల్‌ఐసీ.. అదానీ పోర్ట్స్ జారీ చేసిన ఎన్‌సీడీలలో రూ. 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో లిస్టయిన టాప్–500 కంపెనీలలో ఎల్‌ఐసీ పెట్టుబడులు చేపట్టినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రస్తుతం పెట్టుబడుల్లో ప్రధాన వాటా భారీ కంపెనీలలోనే ఉన్నట్లు వెల్లడించారు. ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 50 కంపెనీలలో ఎల్‌ఐసీ పెట్టుబడుల పుస్తక విలువ 2025 సెపె్టంబర్ 30 కల్లా రూ. 4,30,777 కోట్లుగా పేర్కొన్నారు.


