క్యాపిటల్ మార్కెట్ సంస్థల వినతి
రానున్న బడ్జెట్‌లో సెక్యూరిటీల లావాదేవీలపై పన్ను(ఎస్‌టీటీ) తగ్గించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు క్యాపిటల్ మార్కెట్ సంస్థల ప్రతినిధులు విన్నవించారు. ఆర్థిక మంత్రితో ప్రీబడ్జెట్ సమావేశం సందర్భంగా క్యాపిటల్ మార్కెట్ల సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఆర్థిక వృద్ధిలో చోటు కల్పించడం తదితర అంశాలను సూచించారు. ఫైనాన్షియల్ రంగం మరింత లోతుగా విస్తరించేందుకు వీలుగా తగిన చర్యలు చేపట్టాలని కోరారు. డెరివేటివ్స్‌తో పోలిస్తే నగదు విభాగంలో ఎస్‌టీటీని కుదించాలని విజ్ఞప్తి చేశారు.
సార్వత్రిక బడ్జెట్ రూపకల్పనకు తెరతీసిన నేపథ్యంలో క్యాపిటల్ మార్కెట్ ప్రతినిధులు నాలుగోసారి ఆర్థిక మంత్రిని కలవడం గమనార్హం! స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం బీఎస్‌ఈసహా ఎంసీఎక్స్, మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్(యాంఫీ), పెట్టుబడుల రిజిస్టర్డ్ సలహాదారులు, కమోడిటీ పార్టిసిపెంట్ల అసోసియేషన్ తదితర సంస్థల ప్రతినిధులు ఆర్థిక మంత్రితో సమావేశానికి హాజరయ్యారు. ఫిబ్రవరి 1న 2026–27 బడ్జెట్‌ను సీతారామన్ లోక్‌సభలోప్రవేశపెట్టే అవకాశముంది. తద్వారా వరుసగా 9వసారి బడ్జెట్‌ను ప్రకటించనున్నారు.
33 శాతం అప్
గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో క్యాపిటల్ మార్కెట్లు 33 శాతం అధికంగా రూ. 14.6 లక్షల కోట్ల పెట్టుబడుల మొబిలైజేషన్‌కు వీలు కల్పించాయి. ఈక్విటీ, డెట్, రియల్టీ ట్రస్ట్(రీట్)లు, ఇన్‌ఫ్రా ట్రస్ట్(ఇన్విట్)లు తదితర ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్ల ద్వారా నిధుల మొబిలైజేషన్ జరిగింది. కార్పొరేట్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థలు విభిన్న ఫైనాన్సింగ్ వ్యూహాలను అందిపుచ్చుకోవడాన్ని ఇది ప్రతిఫలిస్తోంది. మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీ, డెట్ విభాగాలే రూ. 14.2 లక్షల కోట్లను ఆక్రమించడం విశేషం! వెరసి ఆర్థిక వృద్ధికి అనువైన పెట్టుబడులను సమకూర్చడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
కాగా.. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అనురాధా ఠాకూర్, ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌తోపాటు ఆర్థిక శాఖకు చెందిన ఇతర అధికారులు హాజరయ్యారు. వార్షిక బడ్జెట్ తుది రూపకల్పనకు ముందు ఆర్థిక శాఖ వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించే విషయం విదితమే. ఈ బాటలో గత వారం సైతం ఆర్థికవేత్తలు, వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ రంగ అత్యున్నత ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించింది. డిమాండును పెంచడం, ఉద్యోగ కల్పన, 8 శాతం ఆర్థిక వృద్ధి తదితర లక్ష్యాలతో బడ్జెట్ రూపొందనున్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.


