న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సామాన్యుడి నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ‘కేంద్ర బడ్జెట్’ ఈసారి ఒక సంచలనానికి వేదిక కాబోతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026–27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఆదివారం ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. సెలవు రోజు పార్లమెంటు సభలు జరగడం అరుదైన విషయమైనా, ఈసారి అది కార్యరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి.
సస్పెన్స్ రేపుతున్న ఫిబ్రవరి 1
2017 నుండి బడ్జెట్‌ను ఫిబ్రవరి మొదటి తేదీనే ప్రవేశపెట్టడం ఒక ఆచారంగా మారింది. అయితే, 2026 ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి కేంద్రంపై పడింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజును దీనిపై ప్రశ్నించగా.. ‘సరైన సమయంలో క్యాబినెట్ కమిటీ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుంది’.. అంటూ సస్పెన్స్‌ను కొనసాగించారు.
కొత్తేమీ కాదు కానీ..
బ్రిటిష్ కాలం నాటి ’వారాంతపు సెలవు’ విధానం మన బడ్జెట్ తేదీని మార్చలేదు. గతంలో కూడా కోవిడ్ సమయంలో, పార్లమెంటు 60వ వార్షికోత్సవం (మే 13, 2012) సందర్భంగా ఆదివారాల్లో సభలు నిర్వహించిన చరిత్ర ఉంది. ఒకప్పుడు బడ్జెట్ అంటే ఫిబ్రవరి చివరి రోజు జరిగేది.


