పీఎస్‌యూ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం)లో ప్రభుత్వం 6 శాతం వాటా విక్రయించనుంది. మంగళవారం(2న) ప్రారంభమైన ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్)కు భారీ డిమాండ్ కనిపించిన నేపథ్యంలో గ్రీన్ షూ ఆప్షన్‌కింద ప్రభుత్వం 6 శాతం వాటా విక్రయించాలని నిర్ణయించింది. ఇందుకు ఫ్లోర్ ధర షేరుకి రూ. 54కాగా.. సంస్థాగత ఇన్వెస్టర్లకు ప్రారంభమైన ఆఫర్ డిసెంబర్ 3న రిటైలర్లకు అందుబాటులోకి రానుంది.
ఓఎఫ్‌ఎస్‌లో భాగంగా ప్రభుత్వం బ్యాంక్‌లో తొలుత 5 % వాటాకు సమానమైన 38,454,77,748 షేర్లను విక్రయానికి ఉంచింది. అయితే ఆఫర్ తొలి రోజునే 400 శాతం సబ్‌స్క్రిప్షన్‌ను సాధించింది. దీంతో మరో 7,69,15,549 షేర్లను(1 శాతం వాటా) సైతం అమ్మివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఎక్స్‌లో పోస్ట్ ద్వారా దీపమ్ కార్యదర్శి అరునిష్ చావ్లా వెల్లడించారు. వెరసి ప్రభుత్వం 6 శాతం వాటాకు సమానమైన 46.14 కోట్లకుపైగా షేర్లను విక్రయించనుంది.
రూ. 2,492 కోట్లు
ఫ్లోర్ ధర ప్రకారం బీవోఎంలో వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 2,492 కోట్లు అందనుంది. సోమవారం ముగింపు ధర రూ. 57.66తో పోలిస్తే 6.3% డిస్కౌంట్‌లో ఫ్లోర్ ధరను ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం బ్యాంక్‌లో ప్రభుత్వానికి 79.6% వాటా ఉంది. తాజా వాటా విక్రయం ద్వారా బ్యాంక్‌లో ప్రభుత్వ వాటా 75% దిగువకు దిగిరావడంతోపాటు.. పబ్లిక్‌కు కనీసం 25% వాటా నిబంధన అమలుకు వీలు చిక్కనుంది. కాగా.. మరో 4 పీఎస్‌యూ బ్యాంకులలో సైతం ప్రభుత్వం గడువులోగా మైనారిటీ వాటాను పబ్లిక్‌కు ఆఫర్ చేయవలసి ఉంది. ఈ జాబితాలో ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్( ప్రభుత్వ వాటా 94.6 శాతం), పంజాబ్– సింద్ బ్యాంక్(93.9 శాతం), యుకో బ్యాంక్(91 శాతం), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(89.3 శాతం) చేరాయి.


