నూతన ఒరవడికి జస్టిస్ గవాయ్ శ్రీకారం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఆయన సోమవారం రాష్ట్రపతి భవన్‌లో నూతన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారానికి తన అధికారిక మెర్సిడెజ్ బెంజ్ కారులో హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన అనంతరం ఆ కారును జస్టిస్ సూర్యకాంత్ ఉపయోగించుకోవడానికి వీలుగా అక్కడే వదిలిపెట్టి, సొంత వాహనంలో ఇంటికి చేరుకున్నారు.
ప్రభుత్వం తనకు సమకూర్చిన అధికారిక మెర్సిడెజ్ బెంజ్ కారులో నూతన సీజేఐ సుప్రీంకోర్టుకు చేరుకోవడానికి జస్టిస్ గవాయ్ వెంటనే అవకాశం కల్పించడం విశేషం. సాధారణంగా సీజేఐగా పదవీ విరమణ చేసిన తర్వాత అధికారిక నివాసాన్ని వీడాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వం కలి్పంచిన ఇతర సౌకర్యాలను వదులుకోవాలి. ఇందుకు కొంత సమయం ఉంటుంది. కానీ, కొత్త సీజేఐ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జస్టిస్ గవాయ్ తన అధికారిక వాహనాన్ని విడిచిపెట్టి, సొంత కారులో ఇంటికెళ్లడం చర్చనీయాంశంగా మారింది.


