భారతీయ సంస్కృతిలో పండుగలనేవి కేవలం వేడుకలు మాత్రమే కాదు.. అవి ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని చాటిచెబుతాయి. సంక్రాంతికి ముందురోజున ఉత్తరాదిన లోహ్రీ (Lohri) అంబరాన్నంటుతుంటే, దక్షిణాదిన భోగి (Bhogi) మంటలు వెలుగులు పంచుతాయి. ప్రాంతాలు వేరైనా, పేర్లు వేరైనా.. ఈ రెండు పండుగల వెనుక ఉన్న అంతరార్థం ఒక్కటే.. అదే పాతను వదిలి కొత్తను ఆహ్వానించడం! మంచు కురిసే చలి రాత్రులలో నునువెచ్చని మంటల సాక్షిగా సాగే ఈ రెండు ఉత్సవాల మధ్య ఉన్న పోలికలు, వైవిధ్యాలపై ప్రత్యేక కథనం..
అగ్ని సాక్షిగా పాతకు వీడ్కోలు
భోగి, లోహ్రీ.. ఈ రెండు పండుగల ప్రధాన ఆకర్షణ మంటలు వేయడం. సంక్రాంతికి ముందు రోజు వచ్చే భోగి నాడు తెల్లవారుజామున ఇంటి ముందు పాత వస్తువులతో మంటలు వేసి, చలిని తరిమికొడుతూ వెచ్చదనాన్ని పొందుతారు. ఇదే సమయంలో అటు పంజాబ్‌లో లోహ్రీ రోజున చీకటిపడ్డాక భారీ ఎత్తున కట్టెలు పేర్చి మంటలు వేస్తారు. భోగి మంటలు ఇంట్లోని పాతను వదిలించుకునేదానికి సంకేతమైతే, లోహ్రీ మంటలు చలికాలం ముగిసి, సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్నాడనే దానికి సంకేతంగా నిలుస్తుంది.
నైవేద్యాల్లో నువ్వులు, బెల్లం
ఈ రెండు పండుగల్లో ప్రత్యేక ఆహారానికి ఇచ్చే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. భోగి రోజున తెలుగు రాష్ట్రాల్లో నువ్వులు, బెల్లం కలిపిన పదార్థాలను తింటారు. అదేవిధంగా లోహ్రీ నాడు నువ్వులు, బెల్లం, వేరుశనగతో తయారు చేసిన ‘రేవడి’లను ఆనందంగా అందరూ పంచుకుంటారు. ఈ రెండు వంటకాలూ శీతాకాలంలో శరీరానికి అవసరమైన ఉష్ణాన్ని ఇచ్చే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు కావడం విశేషం.
పంట చేతికొచ్చే వేళ
ఈ రెండు పండుగలు కూడా పంట చేతికివచ్చే తరుణాన్ని సూచించేవే.. పంజాబ్‌లో చెరుకు, రబీ పంటలు (గోధుమలు) కోతకు వచ్చే సమయం ఇది. అందుకే అక్కడి రైతులకు లోహ్రీ కొత్త ఆర్థిక సంవత్సరానికి నాంది. ఇటు దక్షిణాదిన పంటలు పండి, ధాన్యపు రాశులు ఇంటికి వచ్చే వేళ జరుపుకునే పండుగ భోగి. ప్రకృతి ప్రసాదించిన ఐశ్వర్యానికి కృతజ్ఞతగా ఇరు ప్రాంతాల్లోనూ ఈ వేడుకలను అత్యంత ఆనందంగా జరుపుకుంటారు.
దుల్లా భట్టి వర్సెస్ ఇంద్ర దేవుడు
దేశంలో జరిగే ప్రతి పండుగ వెనుక ఒక కథ ఉంటుంది. పంజాబ్‌లో లోహ్రీ అనగానే దుల్లా భట్టి గుర్తుకొస్తాడు. ఆరోజున..పేద అమ్మాయిలను రక్షించి, వారికి పెళ్లిళ్లు చేసిన దుల్లా భట్టి ధైర్యసాహసాలను కీర్తిస్తూ పాటలు పాడతారు. ఇక భోగి రోజున తెలుగువారు వర్షాలకు అధిపతి అయిన ఇంద్ర దేవుడిని పూజిస్తారు. సమృద్ధిగా వర్షాలు కురిసి, పుడమి పచ్చగా ఉండాలని కోరుకుంటూ భోగి వేడుకలు చేసుకుంటారు.
ఆటపాటల సందడి
సంప్రదాయం ఏదైనా సంతోషమే పరమార్థం. పంజాబీలు లోహ్రీ మంటల చుట్టూ 'గిద్దా', 'భాంగ్రా' నృత్యాలతో హోరెత్తిస్తారు. డప్పుల చప్పుళ్లతో వీధులన్నీ మారుమోగిపోతాయి. మన తెలుగు ఇళ్లలో భోగి రోజున సాయంత్రం చిన్నపిల్లలకు భోగి పళ్లు (రేగు పళ్లు, నాణేలు కలిపి) పోసి దిష్టి తీస్తారు. పిల్లల ఆరోగ్యం, క్షేమాన్ని కోరుకుంటూ ఈ వేడుక నిర్వహిస్తారు.
ఆత్మీయ అనుబంధాలు
లోహ్రీ ఉత్సవం ముఖ్యంగా కొత్తగా పెళ్లైన జంటలకు, ఇంట్లో పుట్టిన తొలి సంతానానికి ఎంతో ప్రత్యేకమైనది. ఆ రోజున పెద్ద ఎత్తున విందులు ఏర్పాటు చేస్తారు. అదే విధంగా తెలుగు లోగిళ్లలో భోగి రోజున కొత్త అల్లుళ్లను ఇంటికి పిలిచి మర్యాదలు చేయడం, ఆడపిల్లలకు కానుకలు సంస్కృతిలో భాగంగా కొనసాగుతోంది. ఈ రెండు పండుగలు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను మరింతగా పెంచుతాయి.
ఒకవైపు ముగ్గులు.. మరోవైపు గాలిపటాలు
భోగి రోజు తెల్లవారుజామున తెలుగు ఇళ్ల ముంగిళ్లు రంగురంగుల ముగ్గులతో, గొబ్బెమ్మలతో కళకళలాడుతాయి. పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో లోహ్రీ సందర్భంగా గాలిపటాలు ఎగురవేస్తారు. రంగురంగుల గాలిపటాలు ఎగురవేస్తూ పంజాబీలు తమ ఉత్సాహాన్ని చాటుకుంటారు.
భిన్నత్వంలో ఏకత్వం
మొత్తంగా చూస్తే అటు లోహ్రీ అయినా, ఇటు భోగి అయినా భారతీయుల జీవనశైలిలోని గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి. చలిని తరిమికొట్టే మంటలు, ప్రకృతికి కృతజ్ఞత తెలిపే వేడుకలు అంతటా కనిపిస్తాయి. మనసులోని మాలిన్యాన్ని తొలగించుకోవాలనే సందేశాన్ని ఈ రెండు పండుగలు అందిస్తాయి.
ఇది కూడా చదవండి: పునాదుల్లో భారీగా బంగారం.. విద్యార్థి చొరవతో..


