సాక్ష, తాడేపల్లి: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ వ్యాప్తంగా ఇవాళ ఘనంగా భోగి వేడుకలు జరుగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ శ్రేణులు వైవిధ్యంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కోసం ఇచ్చిన జీవో కాపీలను భోగి మంటల్లో వేసి బాబు సర్కార్‌కు వ్యతిరేకంగా నిరసన చెబుతున్నాయి. ఈ నిరసనల్లో అటు వామపక్ష పార్టీలు సైతం పాల్గొన్నాయి.
పనికిరాని వస్తువులన్నీ ‘భోగి’ మంటల్లో వేస్తున్నాం. కూటమి ప్రభుత్వ అహం తొలగిపోవాలని కోరుకున్నాం. ప్రైవేటీకరణ జీవోలను భోగి మంటల్లో వేసి కాల్చాం. వెంటనే ఆ జీవోను వెనక్కు తీసుకోవాలి. లేదంటే మరింతగా ప్రజా ఉద్యమాలు చేపడతాం అని కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.
వైయస్సార్ జిల్లా కేంద్రంలో.. జీవో ప్రతులను భోగి మంటల్లో వేసి కాల్చిన మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, రాజంపేట పరిశీలకుడు సురేష్ బాబు, మేయర్ పాకా సురేష్ పాల్గొన్నారు.
విజయవాడ బీసెంట్ రోడ్డులో కార్యకర్తలతో కలిసి భోగి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు.తెలుగువారి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకునే పరిస్థితి లేదు. రైతులు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రజల గురించి ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. మెడికల్ కాలేజీల పిపిపిని వ్యతిరేకిస్తూ ఈరోజు జీవో కాపీలను దగ్ధం చేశాం. ఈ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను పక్కనపెట్టేసింది. ప్రతీ అంశంలోనూ ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. పన్నులు,సెస్ లు వేసి ప్రజల పై భారాలు మోపుతోంది. ఒక్క క్షణం కూడా ఈ ప్రభుత్వం అధికారంలో ఉండటానికి అర్హత లేదు అని విష్ణు అన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో.. మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. సంప్రదాయ పద్ధతిలో భోగి మంటలు ,హరిదాసులు గంగిరెద్దులతో ఘనంగా సంక్రాంతి వేడుకలను ప్రారంభించారాయన. కూటమి హయాంలో కేవలం చంద్రబాబు కుటుంబం రాష్ట్రంలో ఎవరు సంతోషంగా లేరని.. కొత్త సంవత్సరంలోనైనా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారాయన. ఈ సందర్భంగా.. మెడికల్ కళాశాలల పిపిపి జీవో ప్రతులను భోగిమంటల్లో దగ్ధం చేశారు.
ప్రకాశం జిల్లా భోగి వేడుకల్లో.. చీమకుర్తిలోని తన నివాసం వద్ద నిరవహించిన భోగి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘జగన్ మోహన్ రెడ్డి హయాంలో పేదలకు ఉపయోగ పడే విధంగా ప్రభుత్వమే 17 మెడికల్ కాలేజీ లను నిర్మించడానికి ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్‌కు మంచి పేరు వస్తుంది అని ప్రవేటు వారికి దారదత్తం చేయడానికి మెడికల్ కాలేజీ లను పీపీపీ విధానంలో కి మార్చింది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు మార్చుకొని మెడికల్ కాలేజీ లను ప్రభుత్వమే నిర్మించాలి అని డిమాండ్ చేశారు.
వైయస్సార్ జిల్లా పులివెందులలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గృహం వద్ద భోగి సంబరాలు ఘనంగా జరిగాయి. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన జీవో కాపీలను భోగిమంటల్లో వేసిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. జిల్లా ప్రజలకు భోగి , మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు.
చిత్తూరు జిల్లా నగరిలో తన నివాసం వద్ద ఆర్కే రోజా భోగి సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో.. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించారు. ‘‘కూటమి ప్రభుత్వం చెప్పిన సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు, రాష్ట్రంలో ప్రజలు పండుగ జరుపుకునే పరిస్థితి లేదు. రైతులు సంతోషం జరుపుకునే పండుగ ఇది, 20 వేలు ఇస్తామని చెప్పి, కొందరికే 10 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని సంతోషంగా నమ్మిన వారు నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. నాలుగుసార్లు సీఎంగా చేసినా చంద్రబాబు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకు రాలేదు. కూటమి ప్రభుత్వం లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రవేట్ వ్యక్తులకు మేలు చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. ప్రవేట్ మెడికల్ జీవో కాపీలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపిన రోజా.. ఫ్రీ ఫ్రీ అనే ఫ్రీ బాబు మాటలు నమ్మవద్దు అని రాష్ట్ర ప్రజలను కోరారు.
సీపీఐ ఆధ్వర్యంలో.. విజయవాడ సీపీఐ రాష్ట్ర కార్యాలయం వద్ద భోగి మంట వేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో శ్రేణులు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవో కాపీలు మంటల్లో వేశారు. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి.. ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు కొనసాగించాలి అంటూ నినాదాలు చేశారు. జీవో 590, 847 రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
విజయవాడ.. ఏకంగా కూటమి మేనిఫెస్టోని భోగిమంటల్లో వేసిన ఏఐవైఎఫ్ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి రూ.3,000, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలంటూ చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


