న్యూఢిల్లీ: వైవాహిక వివాదాల కేసుల్లో బాధితురాలికి చెల్లించాల్సిన మధ్యంతర భరణాన్ని కొలత కొలిచినట్టుగా నిర్దిష్టంగా లెక్కించడం అసాధ్యమని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. 2023 నాటి విడాకుల కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ అమిత్ మహాజన్ ఈ మేరకు స్పష్టం చేశారు. భర్త విదేశీ కరెన్సీలో సంపాదిస్తున్నాడన్న ఒకే ఒక్క కారణంగా, దాన్ని నేరుగా రూపాయల్లోకి మార్చి ఫలానా మొత్తం ఇవ్వాల్సిందేనంటూ తేల్చలేమని పేర్కొన్నారు.
ఫ్యామిలీ కోర్టు అప్పట్లో నెలకు రూ.50 వేల మధ్యంతర భరణాన్ని నిర్ధారించింది. దాన్ని పెంచాలని భార్య, మళ్లీ సమీక్షించాలని భర్త వేర్వేరు పిటిషన్లు వేశారు. ‘భర్త అమెరికాలో ఉంటున్నాడు. అమెజాన్ కంపెనీలో ఏటా రూ.176 కోట్లు సంపాదిస్తున్నట్టు భార్య చెబుతోంది. పైగా ఆమె నిరుద్యోగి. కానీ ఆయన ఖర్చులు కూడా అక్కడికి తగ్గట్టుగానే ఉంటాయన్నది మర్చిపోరాదు. వాటిని ఢిల్లీ పరిస్థితులతో పోల్చలేం కదా! అయినా మధ్యంతర విచారణ దశలోనే ఆర్థిక విషయాలను మరీ లోతుగా చూడాల్సిన అవసరం లేదు’అని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అయితే, మధ్యంతర భరణాన్ని నెలకు రూ.లక్షకు పెంచుతూ ఉత్తర్వులిచ్చారు!


