ప్రతీకాత్మక చిత్రం
కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదేళ్ల బాలిక హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేయడం ద్వారా పోలీసులు ప్రజల ప్రశంసలు పొందారు. అలాగే 25 చోరీ కేసుల్లో నిందితుడిని పట్టుకుని రూ.25 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరాల్లో 1,351 ఫిర్యాదులు రాగా.. వాటిలో రూ.1.72 కోట్ల నగదు తిరిగి బాధితులకు అందజేశారు. న్యాయ నిరూపణ ద్వారా ఈ సంవత్సరం 100 కేసులలో నిందితులకు శిక్షలు పడ్డాయి. అలాగే ఐదు విడతల లోక్ అదాలత్‌ల ద్వారా 9,595 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ సంవత్సరం గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా జిల్లాలో 11 మంది ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ నిర్వహణ విధుల నిర్వహించి రాష్ట్రంలోనే జగిత్యాల రెండో జిల్లాగా నిలిచింది.
జగిత్యాలక్రైం: జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే 5.05శాతం నేరాలు తగ్గాయి. 2024లో 5,620 నేరాలు నమోదు కాగా.. 2025లో 5,919 నమోదయ్యాయి. గతంతో పోలిస్తే ఈసారి 229 కేసులు, (5.05 శాతం) తగ్గాయి. ఇందులో అత్యధికంగా జగిత్యాల టౌన్ పోలీస్‌స్టేషన్‌లో 770 కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా బుగ్గారం పోలీస్‌స్టేషన్‌లో 135 నమోదయ్యాయి. ఈ ఏడాది మొత్తం 29 హత్య కేసులు నమోదు కాగా.. వీటిలో కలహాలు, ఆస్తి వివాదాలు, వరకట్న హత్యలు, చిన్నచిన్న గొడవలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
381 దొంగతనాలు
381 ప్రాపర్టీ కేసులు నమోదు కాగా.. వాటిలో 187 కేసులను చేధించి రూ.22,92,37,439 విలువైన ఆస్తి (69.85 శాతం)ని రికవరీ చేశారు. 104 ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు కాగా.. గతేడాదితో పోలిస్తే 5 కేసులు తగ్గాయి. జిల్లాలో 19 పీడీఎస్ రైస్ కేసులు నమోదు చేసి 1,135.69 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఇసుక అక్రమ రవాణాలో 234 కేసుల్లో 410 మంది నిందితులను, 260 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గేమింగ్ యాక్ట్ కింద 167 కేసులు నమోదు చేశారు. నిందితుల నుంచి రూ.30,62,036 నగదు స్వాధీనం చేసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 9,290 కేసులు నమోదయ్యాయి. ఇందులో 14 మందికి జైలు శిక్షలు పడ్డాయి. అలాగే రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగినప్పటికీ.. మృతుల సంఖ్య తగ్గింది.
మాదక ద్రవ్యాలపై 86 కేసులు
మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా 2025లో ఇప్పటివరకు 24.220 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 86 కేసుల్లో 203 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు మాదకద్రవ్యాల నివారనే లక్ష్యంగా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో 189 యాంటీ డ్రగ్ క్లబ్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు.
75 హిస్టరీ, 33 రౌడీషీట్ కేసులు
తరచూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్ప డుతున్న వారిపై 75 హిస్టరీ షీట్లు ఓపెన్ చేశా రు. హత్య కేసుల్లో పాల్గొన్న వారిపై 33 రౌడీ షీట్లు నమోదు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో పీడీ యాక్ట్ కేసు నమోదైంది. డయల్ 100కు 30,954 కాల్స్ రాగా.. 130 కేసులు నమోదు చేశారు. గల్ఫ్ పంపిస్తామని చెప్పి మోసం చేసిన వాటిలో 44 కేసుల్లో 54 మందిని అరెస్ట్ చేశారు. అధిక వడ్డీల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. ఆపరేషన్ స్మైల్ ముస్కాన్ 11లో భాగంగా 11 కార్యక్రమాలు నిర్వహించి 76 మంది పిల్లలను రక్షించి వారి కుటుంబాలకు అప్పగించారు.
ఎన్నికల్లో 21 కేసులు
ఇటీవల జిల్లాలో రెండో సాధారణ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై 21 కేసులు నమోదు చేశారు. 21 మంది నుంచి రూ.2,07,643 విలువైన 318.76 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. 34 కేసులు నమోదు చేసి 34 మంది నిందితుల నుంచి రూ.180,800 విలువైన 199.5 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు.
ఏసీబీ సోదాలు
హన్మకొండ డీటీసీగా పనిచేస్తున్న పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో కరీంనగర్ ఏసీబీ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి 2న సోదాలు చేపట్టారు. శ్రీనివాస్‌పై ఆదాయానికి మించి ఆస్తున్నాయని ఆరోపణల నేపథ్యంలో జగిత్యాలలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు.
ఈ ఏడాది ఆగస్టు 6న జిల్లా రవాణా శాఖ అధికారి బానోవత్ భద్రునాయక్, ఆయన డ్రైవర్ అరవింద్ జేసీబీ వాహనానికి పొల్యుషన్, ఇన్సూరెన్స్ లేదని యజమానిని బెదిరించి రూ.40 వేలు డిమాండ్ చేశారు. సదరు యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.


