కిడ్నాప్ చేసి మరీ ఘాతుకం
తిరువొత్తియూరు: ఓ పాఠశాల విద్యార్థినిపై నలుగురు మైనర్లు సామూహిక అత్యాచారం చేసిన ఘటన పుదుచ్చేరిలోని బాగూరులో జరిగింది. పుదుచ్చేరికి చెందిన 14 ఏళ్ల బాలిక అక్కడి ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కొద్ది రోజుల క్రితం పాఠశాలకు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు పలుచోట్ల గాలించినప్పటికీ ఆచూకీ తెలియలేదు.
ఈ క్రమంలో బాలిక బాగూరు ప్రాంతంలో ఉన్నట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది. దాని ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ‘ప్రేమిస్తున్నానంటూ ఓ బాలుడు విద్యార్థినిని కిడ్నాప్ చేసి, ఓ ఇంట్లో బంధించాడని, అక్కడ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. విద్యార్థినిని రక్షించి, నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.


