
డిపాజిట్లు, డివిడెండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇతర పొదుపు సాధనాలలో దాదాపు రూ.80,000 కోట్ల సొమ్ము.. ఎవరూ క్లెయిమ్ చేయకపోవడంతో అనామకంగా పడిఉంది. ఈ సొమ్మును దాని హక్కుదారులు, వారసులు గుర్తించి, తిరిగి పొందటానికి సహాయపడటానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా అవగాహన ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది.
యువర్ మనీ.. యువర్ రైట్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అక్టోబర్ 4న గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 'యువర్ మనీ, యువర్ రైట్' అనే మూడు నెలల అవగాహన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్ఏ)తో ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) ఈ ప్రచారాన్ని సమన్వయం చేస్తోంది.
"బీమా పాలసీ క్లెయిమ్‌లు, బ్యాంక్ డిపాజిట్లు, డివిడెండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్ ఆదాయంతో సహా క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులు అవగాహన లేకపోవడం లేదా కాలం చెల్లిన ఖాతా వివరాల కారణంగా అన్‌క్లెయిమ్‌గా మిగిలిపోతున్నాయి. ప్రజలు ఆదా చేసే ప్రతి రూపాయిని వారు లేదా వారి చట్టపరమైన వారసులు, నామినీలు సముచితంగా క్లెయిమ్ చేసుకునేలా చూడటానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది" అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీలు), సంబంధిత ఫండ్ రెగ్యులేటర్లు అభివృద్ధి చేసిన తరచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్ఏక్యూలు) ద్వారా తమ సొమ్మును ఎలా గుర్తించాలో, క్లెయిమ్ చేయాలనే దానిపై ప్రజలకు స్పష్టమైన సమాచారాన్ని అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.
డిజిటల్ క్లెయిమ్ ప్రక్రియ
కస్టమర్లు ఆర్బిఐకి చెందిన ఉద్గమ్ (UDGAM) పోర్టల్ ద్వారా అన్‌క్లెయిమ్ చేయని డిపాజిట్లను చెక్ చేయవచ్చు. అయితే క్లెయిమ్ ప్రక్రియను పూర్తి చేయడానికి వారు సంబంధిత బ్యాంకు శాఖను సందర్శించాలి. బ్యాంకులు చేపట్టబోయే ప్రతిపాదిత మార్పులు ఈ ప్రక్రియను డిజిటలైజ్ చేస్తాయి. ఆ తర్వాత ఆన్‌లైన్లో డిపాజిట్‌ను తిరిగి పొందటానికి అనుమతిస్తాయి.
కాగా బ్యాంకింగ్ చట్టాల (సవరణ) చట్టం, 2025.. ప్రతి బ్యాంకు ఖాతాకు అంగీకరించిన నామినీల సంఖ్యను ఒకటి నుండి నలుగుకు పెంచింది. ఖాతా డార్మాంట్‌గా ఉంటే లబ్ధిదారులను సులభంగా గుర్తించడానికి అనుమతిస్తుంది. చట్టం ముఖ్య నిబంధనలు ఆగస్టు 1 నుండి అమల్లోకి వచ్చాయి.
ఇదీ చదవండి: డీఏ పెరిగింది.. మరి జీతమెంత పెరుగుతుంది?