హైదరాబాద్: నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలను నివారించే లక్ష్యంతో ‘ఓఆర్ఆర్‌పై నో పార్కింగ్’ అనే ప్రచారానికి ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ శ్రీకారం చుట్టింది. ఈ సంస్థ దేశంలోనే ప్రముఖ, అతిపెద్ద, లిస్టెడ్ ప్రైవేట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ అయిన ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ వారి స్పెషల్ పర్పస్ వెహికిల్. నగరంలోని నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును ఈ సంస్థే నిర్వహిస్తోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), ట్రాఫిక్ పోలీసులు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్)తో కలిసి ఈ నెలరోజు ప్రచారానికి ఐఆర్‌బీ సంస్థ శ్రీకారం చుట్టింది.
“ఓఆర్ఆర్ మీద పార్కింగ్ సురక్షితం కాదు” అనే కీలకమైన సందేశాన్ని అందరికీ చేరవేయడం, ఈ హైస్పీడ్ కారిడార్ మీద అక్రమంగా వాహనాలు పార్కింగ్ చేయడం ప్రాణాలకు ఎంత ప్రమాదకరమో వాహన దారులకు అవగాహన కల్పించడం ఈ ప్రచార లక్ష్యం. 158 కిలోమీటర్ల పొడవున్న ఈ ఓఆర్ఆర్‌ను గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ఎలాంటి ఆటంకం లేకుండా వెళ్లేలా తీర్చిదిద్దారు. అయితే, ఇటీవలి కాలంలో కొన్నిచోట్ల వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల కొన్ని తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా వరకు లారీలు, ట్రక్కులను ఇలా పార్క్ చేయడంతో ఇవి వేగంగా వచ్చే వాహనదారులకు ప్రమాదకరంగా మారుతున్నాయి.
ప్రమాదాన్ని సూచించే లైట్లు లేదా రిఫ్లెక్టివ్ వార్నింగ్ పరికరాలు ఏవీ లేకుండానే ఇలా అక్రమంగా భారీ వాహనాలను పార్కింగ్ చేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని భద్రతాధికారులు, నిపుణులు తరచు గుర్తిస్తున్నారు. ఈ ప్రచారం ప్రారంభం సందర్భంగా హెచ్‌జీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ, “ఔటర్ రింగ్ రోడ్డు అనేది వాహనాలు వేగంగా వెళ్లడానికి ఉందేతప్ప ఆగడానికి, పార్కింగ్ చేయడానికి కాదు! ఇలా షోల్డర్స్ మీద, అత్యవసర లేన్లలోను అక్రమంగా పార్క్ చేసిన వాహనాల వల్లే దురదృష్టవశాత్తు ప్రమాదాలు జరుగుతున్నాయి.
అందుకే ఈ విషయంపై అవగాహన పెంచేందుకు మేం ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే, ట్రాఫిక్ పోలీసులతో కలిసి ఈ ప్రచారం చేస్తున్నాం. దీనిద్వారా ప్రతి వాహనదారుడు కూడా ఓఆర్ఆర్ మీద ఒక్క క్షణం ఆగినా అది ప్రాణాంతకం కావచ్చని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. సౌలభ్యం కంటే రక్షణకే ఎప్పుడూ తొలి ప్రాధాన్యం ఇవ్వాలి” అని చెప్పారు.

ఈ సందర్భంగా ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే డైరెక్టర్ మాట్లాడుతూ, “ఓఆర్ఆర్ అనేది అంతర్జాతీయ మొబిలిటీ కారిడార్. అది హైదరాబాద్ వృద్ధి, సామర్థ్యాలకు నిదర్శనం. అయితే, ఈ రోడ్డును అక్రమ పార్కింగ్ కోసం దుర్వినియోగం చేయడం వల్ల నివారించదగ్గ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రచారం వల్ల అవగాహన పెరిగి, ప్రాణాలను కాపాడగలం. ఓఆర్ఆర్ మీద అత్యవసర పరిస్థితి వస్తే తప్ప వాహనాలను ఎప్పుడూ పార్కింగ్ చేయకూడదన్న సందేశం అందరికీ బలంగా వెళ్తుంది” అని వివరించారు.
నెలరోజుల పాటు నిర్వహించే ఈ ప్రచారంలో ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్, దాని భాగస్వాములు కలిసి క్షేత్రస్థాయిలో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు, డిజిటల్ ప్రచారాలు, వాణిజ్య డ్రైవర్లతోను, లాజిస్టిక్ సంస్థల నిర్వాహకులు, ప్రైవేటు వాహనాల యజమానులతో సెషన్లు నిర్వహిస్తారు. తద్వారా సురక్షితంగా, బాధ్యతాయుతంగా ఈ రోడ్డును వాళ్లు వాడుకోగలరు.
దాంతోపాటు ఈ ప్రచారంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) కూడా చేయి కలుపుతున్నాయి. ప్రధానమైన ఓఆర్ఆర్ ఇంటర్‌సెక్షన్ల వద్ద ‘నో పార్కింగ్ ఆన్ ఓఆర్ఆర్’, ‘నో ఫ్యూయెల్ ఆన్ ఓఆర్ఆర్’ అనే ఫ్లెక్సీలను ప్రదర్శిస్తారు. తద్వారా, ఓఆర్ఆర్ మీదకు వెళ్లేముందే వాహనదారులకు అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమంలోనే భాగంగా ‘ఓఆర్ఆర్ మీదకు ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు అనుమతి లేదు’ అనే విషయాన్ని కూడా ప్రచారం చేస్తారు. తద్వారా ఈ వర్గాలకూ అవగాహన పెంచుతారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును ఈ ప్రచారం ద్వారా ‘సున్నా మరణాల కారిడార్’గా మార్చడమే లక్ష్యంగా భావిస్తున్నారు. తద్వారా ఓఆర్ఆర్ మీద జరిగే చాలావరకు ప్రమాదాలను కేవలం ట్రాఫిక్ నిబంధనలకు కట్టుబడడం, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ ప్రవర్తనల ద్వారా నివారించవచ్చని చెబుతున్నారు.


