సాధారణంగా ఉద్యోగాలు మారినప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకుంటారు. పీఎఫ్ విత్‌డ్రా విధానాన్ని వీలైనంత వరకు సులభంతరం చేయడానికి కేంద్రం కూడా తగిన చర్యలు తీసుకుంటూ ఉంది. అయితే ఇప్పుడు ఉద్యోగంలో చేరిన ఐదేళ్ల లోపు ఎవరైనా పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలంటే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఆదాయ పన్ను చట్టం, పాత పన్ను విధానం ప్రకారం.. పీఎఫ్ డబ్బును ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనిపై ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అయితే పదవీవిరమణకు ముందే పీఎఫ్ విత్‌డ్రాను నియంత్రించడానికి ఈపీఎఫ్ఓ కొత్త విధానం తీసుకొచ్చింది. దీని ప్రకారం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇది కొత్త పన్ను నియమాలకు అనుగుణంగా ఉంటుంది.
ఒకవేళా మీ ఈపీఎఫ్ఓ ఖాతాలో రూ. 50వేలు కంటే తక్కువ డబ్బు ఉన్నప్పుడు.. లేదా సంస్థ క్లోజ్ అయినప్పుడు, ఇతర అనారోగ్య కారణాల వల్ల ఉద్యోగం నుంచి వైదొలిగినప్పుడు పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనిపై ఎటువంటి ట్యాక్స్ ఉండదు.
ఈపీఎఫ్ఓ ఖాతాలో రూ. 50వేలు కంటే ఎక్కువ డబ్బు ఉన్నప్పుడు.. మీరు ఉద్యోగంలో చేరి ఐదేళ్ల కంటే తక్కువ సమయం అయినప్పుడు.. పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలంటే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. మీరు పాన్ వివరాలు అందజేస్తే 10 శాతం టీడీఎస్ కట్ అవుతుంది, ఇవ్వకపోతే 34 శాతం వరకు టీడీఎస్ కట్ అవుతుంది. అదే ఐదేళ్లు ఉద్యోగం చేసిన తరువాత.. మీరు ఎలాంటి పన్ను చెల్లించకుండానే మీ పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఒకే సంస్థలో ఐదేళ్లు పనిచేయాలా?, లేక ఇతర కంపెనీలలో పనిచేసిన సమయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారా? అనే అనుమానం చాలామందికి రావచ్చు. ఉదాహరణకు.. మీరు A అనే కంపెనీలో రెండేళ్లు ఉద్యోగం చేసి.. B అనే కంపెనీలో మరో మూడేళ్లు పనిచేశారనుకోండి. ఈ రెండు కంపెనీలలో పనిచేసిన సంవత్సరాలను కలిపి ఐదేళ్లుగా కౌంట్ చేసుకుంటారు. కాబట్టి మీరు ఎక్కడ పనిచేసినా.. ఆ మొత్తాన్ని పరిగణలోకి తీసుకుంటారు.
ఇదీ చదవండి: ఇప్పుడు కొనండి, అప్పుడు అమ్మండి: కియోసాకి


