ట్యాక్స్ చెల్లించాలని యజమానులకు మెసేజ్‌లు
గ్రామాల్లో మాటువేసి మరీ కేసులు రాస్తున్న రవాణా శాఖ అధికారులు
ఇప్పటికే నీటితీరువా పేరిట రూ.21.81 కోట్ల భారం మోపిన బాబు ప్రభుత్వం
రైతులకు అండగా నిలిచిన గత జగన్ ప్రభుత్వం
సాక్షి, భీమవరం: రైతును రాజును చేస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం వారి నడ్డి విరుస్తోంది. నీటి తీరువాను తెరపైకి తెచ్చి వడ్డీ సహా భారం మోపింది. తాజాగా ట్రాక్టర్లకు ట్యాక్స్ చెల్లించాలంటూ రవాణా శాఖ మెసేజ్‌లు పంపుతోంది. గత ప్రభుత్వంలోని ఐదేళ్ల కాలానికి జరిమానాతో పాటు వసూళ్లకు పాల్పడుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో 2,106 ట్రాక్టర్లు, 3,740 ట్రాలీలు ఉన్నాయి. పొలం దమ్ము, పంట ఉత్పత్తులు, పశుగ్రాసాల తరలింపు తదితర పనుల కోసం అధిక శాతం ట్రాక్టర్లను వ్యవసాయ అవసరాలకు వినియోగిస్తుంటారు.
ట్రాక్టర్ యజమానుల్లో అధిక శాతం రైతులే. వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం ట్రాక్టర్లకు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది. ట్రాలీలకు సైతం పన్నులు వసూలు చేయలేదు. దీంతో వ్యవసాయ పనుల్లో పంట ఉత్పత్తుల తరలింపునకు రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవలేదు. తాజాగా, చంద్రబాబు ప్రభుత్వం కమర్షియల్ పేరిట ట్రాలీలకు పన్నులు విధించడం మొదలెట్టింది.
762 కిలోల నుంచి నాలుగు టన్నుల వరకు బరువును బట్టి రూ.260 నుంచి రూ.720 వరకు పన్ను విధిస్తోంది. దీంతో 2019 నుంచి ఇప్పటివరకు జరిమానాలు సహా రూ.15 వేల వరకు ట్యాక్స్ పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు వస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా రవాణా శాఖ అధికారులు గ్రామాల్లో కూడా కేసులు రాస్తున్నారని రైతులు చెబుతున్నారు.
ప్రధాన రహదారుల్లో తప్ప గతంలో ఎప్పుడూ రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు లేవంటున్నారు. వచ్చే సీజన్ నుంచి ట్రాక్టర్ల వ్యవసాయ పనుల ధరలు పెరుగుతాయని, ప్రభుత్వం తమపై కర్కశంగా పన్నుల భారం అదనంగా మోపుతోందని ఆవేదన చెందుతున్నారు.
అన్నదాత నడ్డివిరిచి..
రైతులకు మేలు చేస్తూ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలుచేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసింది. ఈ–క్రాప్ నమోదు ప్రామాణికంగా సాగు విస్తీర్ణం అంతటికీ రైతులు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని గతంలో ప్రభుత్వమే చెల్లించింది.
బాబు పాలనలో ఈ పథకాన్ని ఎత్తివేయడంతో ప్రీమియం వాటాను రైతులే భరించాల్సి వస్తోంది. మరోపక్క గత ప్రభుత్వం పక్కన పెట్టిన నీటితీరువాను తెరపైకి తెచ్చి, మూడేళ్లకు గాను పాత బకాయిలు, వడ్డీలతో కలిపి ఒక్కసారే రైతులపై రూ.21.81 కోట్ల భారాన్ని మోపింది.


