నేటితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి తెర
సాక్షి, హైదరాబాద్: దాదాపు ఇరవై రోజులుగా ఎర్రగడ్డ, రహ్మత్‌నగర్, షేక్‌పేట, వెంగళరావునగర్ తదితర ప్రాంతాల్లో నెలకొన్న సందడి ఆదివారంతో ముగియనుంది. బస్తీలు, కాలనీలు, రోడ్లు, క్యాంటీన్లు, సెలూన్లు ఎక్కడ పడితే అక్కడ పర్యటించిన నేతలు ఆప్రాంతాలను వీడిపోనున్నారు. ఆయా పారీ్టల రంగురంగుల జెండాలు, మైకుల హడావుడి ముగిసిపోనుంది. ఎక్కే గడప, దిగే గడప అన్నట్లుగా ఇంటింటికీ వెళ్లిన వివిధ పార్టీల నాయకులతో, ప్రజలతో మాటా ముచ్చట్లతో కార్యకర్తల ఆటపాటలతో కళకళలాడిన కాలనీలు, బస్తీలు ఇక మూగబోనున్నాయి. బస్తీల్లో, బార్లలో, హోటళ్లలో విందులు, ప్రచారాల్లో డ్యాన్సుల చిందులు ఆగిపోనున్నాయి. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రచార గడువు ముగిసిపోనుండటంతో ఈ కార్యక్రమాలన్నింటికీ తెరపడనుంది. వివిధ ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి వచ్చిన పార్టీల నేతలు సైతం ఇక నియోజకవర్గాన్ని వీడి పోవాల్సి ఉంది. ఇప్పటి వరకు రోడ్‌షోలు, పార్టీ హేమాహేమీ నేతల ప్రసంగాలు, ఇతరత్రా హడావుడి ముగిసిపోనుంది.
ఇక తెరచాటు వ్యవహారాలే..
ప్రచారం ముగిస్తే..మద్యం, డబ్బు పంపిణీ వంటి తెరచాటు అక్రమాలూ మాత్రం రాత్రి వరకు కొనసాగే అవకాశాలున్నాయి. వివిధ వర్గాలు, సంఘాలతో చివరి ప్రయత్నాలు, సమావేశాలు జరగనున్నాయి. వీరికి తాయిలాలు ప్రకటించేందుకు పారీ్టలు సిద్ధమయ్యాయి. చివరి రోజు బైక్‌ర్యాలీలు వంటివి నిర్వహించనున్నారు. మూడు పార్టీలూ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగానే కాకుండా సవాల్‌గానూ తీసుకున్నాయి. రాబోయే జీహెచ్‌ఎంసీ, అసెంబ్లీ ఎన్నికలకు వీటిని ఇండెక్స్‌గా భావిస్తున్నాయి. అందుకే హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న మార్గాలను ఎంచుకున్నాయి. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలపై శ్రద్ధ చూపిన రాజకీయ పారీ్టలు.. ఇక ఓటరు దేవుళ్లను పోలింగ్ కేంద్రాల దాకా రప్పించే పనిలో పడనున్నాయి.
ఓటర్లు పోలింగ్ కేంద్రాల దాకా వచ్చి ఓట్లేసేలా చూడటంలో బూత్‌కమిటీలు ముఖ్యభూమిక వహించనున్నాయి. వీటి పని ముమ్మరం కానుంది. తటస్థులను తమవైపు తిప్పుకునేందుకు తమవంతు కృషి చేయనున్నాయి. ఇప్పటికే సంచుల కొద్దీ డబ్బుల పంపిణీ జరుగుతోందనే ప్రచారాలు జరుగుతున్నాయి.ఎన్నికల సంఘానికి ఫిర్యాదులూ అందాయి. పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుండటం తెలిసిందే.


