టాప్–10 జాబితా నుంచి తెలంగాణ ఔట్
పదేళ్లలో సగానికి పడిపోయిన విదేశీ విద్యార్థుల సంఖ్య
ఇదే సమయంలో ఏపీలో ఐదు రెట్లు పెరిగిన విద్యార్థులు
నీతి ఆయోగ్ తాజా నివేదికలో వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: ఒకప్పుడు విదేశీ విద్యార్థులతో కళకళలాడిన తెలంగాణలోని యూనివర్సిటీలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. దశాబ్ద కాలంలో దేశంలో అత్యధిక విదేశీ విద్యార్థులను ఆకర్షించే టాప్–10 రాష్ట్రాల జాబితా నుంచి తెలంగాణ కనుమరుగైంది. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘నీతి ఆయోగ్’తన తాజా నివేదికలో కుండబద్దలు కొట్టింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన ‘ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా రిపోర్ట్’(2025) ప్రకారం..2012–13 విద్యా సంవత్సరంలో తెలంగాణలో 2,700 మంది విదేశీ విద్యార్థులు ఉండగా, 2021–22 నాటికి ఆ సంఖ్య దారుణంగా 1,286కు చేరుకుంది. పదేళ్లలో విదేశీ విద్యార్థుల సంఖ్య సగానికి పైగా పడిపోయింది.
తెలంగాణ వెనకడుగు..
ఓవైపు తెలంగాణలో విదేశీ విద్యార్థుల సంఖ్య పాతాళానికి పడిపోతుంటే, పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ విషయంలో దూసుకుపోతోంది. 2012–13లో కేవలం 679 మంది విదేశీ విద్యార్థులు మాత్రమే ఉన్న ఏపీలో, 2021–22 నాటికి ఆ సంఖ్య ఏకంగా 3,106కు చేరింది. తద్వారా ఏపీ దేశంలోనే 7వ స్థానంలో నిలిచింది. ఒకప్పుడు 4వ స్థానంలో వెలుగొందిన తెలంగాణ ఇప్పుడు కనీసం టాప్–10లో కూడా చోటు దక్కించుకోలేక చతికిలపడింది.
పశ్చిమ బెంగాల్‌తో పాటే..
దశాబ్ద కాలంలో (2012–2022) అంతర్జాతీయ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌లో టాప్–10 రాష్ట్రాల నుంచి వైదొలిగిన రెండే రెండు రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, తెలంగాణ కావడం గమనార్హం. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు తమ సామర్థ్యాన్ని పెంచుకుని విదేశీ విద్యార్థులకు గమ్యస్థానాలుగా మారుతుంటే, తెలంగాణ మాత్రం ఉన్న గుర్తింపును కోల్పోయింది.


